గతి తప్పుతున్న ‘సంక్షేమ సంతర్పణ’

0
265
జీ.కె. వార్తా వ్యాఖ్య
అధికారంలోకి రావడమే పరమావధిగా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అలవి కాని హామీలు గుప్పించేస్తాయి.. తీరా అధికారంలోకి వచ్చాక కాని తత్వం బోధపడదు.
ఆర్థిక పరిస్థితి సహకరించేలా లేకపోవడంతో ఆ పథకాల అమలుకు సవాలక్ష నియమ నిబంధనలు, పరిమితులు విధించడం అధికారంలోకి వచ్చిన పార్టీలకు అలవాటే.  ప్రతిపక్షాలకు ఇదే ఆయుధం అవుతుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు పాలకులు వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుంటారు. తద్వారా పేదల జీవన ప్రమాణాలు ఎంతో కొంత మేర మెరుగు పడటంతో పాటు ఆ పథకాలు తమ పీఠాలను సుస్థిరపర్చి వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తమకు ప్రయోజనం చేకూర్చిపెడతాయన్నది పాలకుల భావన. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ఎవరు పాలకులుగా ఉన్నా ఇది పరిపాటిగా వస్తోంది. నిజమే… ప్రపంచంలో జనాభా పరంగా రెండవ అతి పెద్ద దేశంగా ఉన్న భారత్‌లో పేదల సంఖ్య అపరిమితంగా ఉంది. కడుపు నిండా తిండికి నోచుకోని వారు కోట్లాది మంది ఉండగా బీహారు, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో అసలు తిండి లేక కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుని శుష్కించిపోయే వారూ అధికమే. ఆయా రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆకలి మరణాలు సంభవించిన పరిస్థితులు కూడా ఉన్న మాట వాస్తవమే. అలాంటి వారిని దారిద్య్ర రేఖ దిగువ నుంచి పైకి తెచ్చేందుకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలకులుగా ఉన్న వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తున్నారు. దేశంలో అసమానతలు అధికమైతే అరాచకం ప్రబలుతుంది. తిరుగుబాటు వచ్చే ప్రమాదం కూడా లేకపోదు. ఈ దృష్ట్యా పేదల జీవన ప్రమాణాలను మెరుగు పర్చి తీరాల్సిందే. దీనిని ఎవరూ తప్పుబట్టబోరు. అయితే ఇటీవల కాలంలో అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు ఎడాపెడా హామీలు గుప్పించేస్తున్నాయి. హామీలిచ్చే విషయంలో అధికార పార్టీ కంటే తమది పై చేయిగా ఉండాలని ప్రతిపక్షం…అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్షం కంటే మనదే కాస్త పై చేయిగా ఉండాలనే ఆలోచనతో అధికార పక్షం.. ఇలా సంక్షేమ సంతర్పణలో పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. పేదలకు చేయూతనిచ్చి అసమానతలను తొలగించే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టడం లేదని మరో మారు స్పష్టం చేస్తూ అదే సమయంలో  ఈ ‘సంక్షేమ సంతర్పణ’ మోతాదు అధికమై ప్రజలు సోమరిపోతులుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తు పెట్టుకోవలసిన అవసరం చాలా ఉంది. అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది..మనం ఎందుకు కష్టపడటం అనే ఆలోచన వస్తే సంపద సృష్టి సాధ్యపడదు… మానవ శక్తి వృథా అవుతుంది. ఈ ధోరణి దేశానికైనా..రాష్ట్రానికైనా చాలా ప్రమాదకరం. మరో వైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు అధికారంలోకి వచ్చిన పార్టీకి కూడా కత్తి మీద సాములాంటిదే. ఎందుకంటే ఆ హామీలు అమలు చేయాలంటే ఖజానాపై మోయలేని భారం పడుతోంది. దీంతో అధికారంలోకి వచ్చిన వారికి తత్వం బోధపడి ఆ హామీల అమలుకు సవాలక్ష నిబంధనలు, పరిమితులు విధిస్తూంటారు. ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమ కార్యక్రమాల అమలు ‘పులి మీద స్వారీ’ వంటిదని చెప్పవచ్చు. పులి మీద స్వారీ చేసినంత సేపు బాగానే ఉంటుంది… మనం కాని ఆ పులి మీద నుంచి దిగితే మనకు భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. హామీల అమలు కూడా ఇదే తీరున ఉంటుంది. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఆక్సిజన్‌లా పనిచేస్తాయి…తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలుపైనే అటు ప్రజల దృష్టి.. ఇటు ప్రతిపక్షం దృష్టి ఉంటాయి. సంక్షేమ హామీల అమలు తాత్సారం చేయడం ద్వారా అధికార పార్టీ ఎక్కడ దొరకుతుందా అని ప్రతిపక్షం కాసుక్కూర్చుంటుంది. అది తెలుగుదేశమైనా కావచ్చు….వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అయినా కావచ్చు. ఆ హామీల అమలు కోసం అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిలదీయడం సహజ పరిణామమే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే జరిగింది. అధికారాన్ని దక్కించుకోవడానికి అన్ని పార్టీలు అన్నం కూడా మేమే తినిపిస్తాం అనే స్థాయి వరకు వెళ్ళాయి. 2014లో రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నా ప్రజలకు సంక్షేమంలో ఏ మాత్రం లోటు రాకుండా, తెలియనివ్వకుండా ఏ రాష్ట్రంలో జరగనన్ని కార్యక్రమాలు అమలు చేసి పాలన సాగించారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అనేక హామీలు గుప్పించింది. 2014లో ఇచ్చిన హామీలను ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీ అమలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. అలాగే తెదేపా కంటే పై చేయిగా ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగు ఆకులు ఎక్కువే చదివి మరిన్ని హామీలు గుప్పించింది. అందులో ఒకటి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల్లో పేదలకు 45 ఏళ్ళకే పింఛను పథకం. ఇది శాసనసభలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాల మధ్య వాగ్వివాదానికి కారణమై తెదేపా సభ్యుల సస్పెన్షన్‌కు దారి తీసింది. 2017లో  బహిరంగ సభలో  45 ఏళ్ళకే ఫించను విషయంపై తమ అధినేత జగన్‌ మాట్లాడినా 2018లో తమ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిపెస్టో నవరత్నాల్లో ఈ హామీ ఇవ్వలేదని వైకాపా వాదించగా ఇచ్చిన హామీ నుంచి వైకాపా వెనక్కి వెళ్ళిందంటూ తెదేపా వాదిస్తోంది. దీనిపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలాగే వైకాపా ఎన్నికల హామీలో మరొకటి అమ్మఒడి పథకం. దీనిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు మాత్రమే వర్తింపజేస్తామని ఒకసారి….ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చదివే వారికి కూడా వర్తింపజేస్తామని మరో మారు జగన్‌ సర్కార్‌ చెబుతూ వస్తోంది. దీనిపై కూడా స్పష్టత కొరవడటంతో గందరగోళం నెలకొంది. దీంతో ఈ అంశాల్ని సహజంగానే ప్రతిపక్ష తెదేపా శాసనసభలో నిలదీసే ప్రయత్నం చేయడం అధికారపక్షం వైకాపా అడ్డుకోవడంతో రగడ జరుగుతోంది. ఏది ఏమైనా సంక్షేమ పథకాల్ని ఎవరూ తప్పు పట్టరు కాని అదే సమయంలో పాలకులు నిర్మాణాత్మకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై కూడా దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధితో పాటు సంక్షేమం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడటం వల్ల కూడా రాష్ట్ర ప్రగతి సూచి కొత్త పుంతలు తొక్కడం మాట వాస్తవమే. అయితే  అదే సమయంలో నిర్మాణాత్మక అభివృద్ధి దిశగా కూడా పాలకులు దృష్టి సారిస్తే దేశానికైనా..రాష్ట్రానికైనా శ్రేయస్కరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here