గిరిజనుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా…..

0
353
స్పందన,ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, జీఎస్‌ఎల్‌ సంయుక్త ఆధ్వర్యాన రేపు మెగా వైద్య శిబిరం
పెదభీంపల్లిలో నిర్వహణకు ఏర్పాట్లు – ఉచిత పరీక్షలతో పాటు భారీగా మందుల పంపిణీ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 17 :  రవాణా, వైద్య సేవల, సౌకర్యాల లేమితో, అవగాహన లేమితో నిత్యం అనేక అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజనులకు సేవలందించడమే ధ్యేయంగా గన్ని కృష్ణ సారధ్యంలోని స్వతంత్ర చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవా విభాగం స్పందన స్వచ్ఛంద సంస్థ, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, జిఎస్‌ఎల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యాన రేపు ఏజన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయితీ పెదభీంపల్లి (ఫజుల్లాబాద్‌)లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. వ్యాధి ఏమిటో తెలియక, సరైన వైద్యం పొందే అవకాశాలు, ఆర్థిక వెసులుబాటు లేక చాలా మంది గిరిజనులు అనేక వ్యాధులను ముదరబెట్టుకుని ప్రాణాలు కోల్పొతున్న నేపథ్యంలో గిరిజనుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరం వారి జీవితాల్లో ఓ ఆశాదీపం వంటిదని పేర్కొనవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, స్పందన అధ్యక్షులు గన్ని కృష్ణ తాను దత్తత తీసుకున్న గిరిజన గ్రామం పెదభీంపల్లిలో వైద్య శిబిరాన్ని నిర్వహించాలని సంకల్పించారు. గన్ని సంకల్పానికి ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ జనరల్‌ హాస్పటల్‌, ఇతర వైద్యుల సహకారం తోడు కావడంతో కార్యరూపం దాలుస్తున్న ఈ  శిబిరంలో గిరిజనులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు  వారికి  పెద్దఎత్తున ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. ఈ వైద్య శిబిరం ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ప్రతినిధి శ్రీరామ్మూర్తి,  జీఎస్‌ఎల్‌ హాస్పటల్‌ అండ్‌ కళాశాల అడ్మినిస్ట్రేటర్‌ శ్రీనివాస్‌ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్ని వెల్లడించారు. ఈ శిబిరంలో గుండె, ఎముకల, నేత్ర, న్యూరో తదితర వ్యాధులతో పాటు స్త్రీల వ్యాధులు, పిల్లల వ్యాధులకు సంబంధించి  నిష్ణాతులైన వైద్యులతో ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు గన్ని తెలిపారు. పరిమితి లేకుండా ఎంతమంది వచ్చినా పరీక్షలు నిర్వహించడంతో పాటు తగినన్ని అన్ని రకాల మందులను ఉచితంగా పంపిణీ చేసేందుకు తాము ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అవసరమైన వారికి రక్తపరీక్షలతో పాటు ఇసిజీ పరీక్షలు నిర్వహిస్తామని, తమ ప్రయత్నానికి ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, జీఎస్‌ఎల్‌  వైద్య కళాశాల అండ్‌ ఆసుపత్రి సహకారం తోడు కావడంతో పెద్ద ఎత్తున ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ శిబిరాన్ని  పరీక్షలు చేసి మందులిచ్చి సరిపెట్టడం గాక ఫాలో ఆఫ్‌ యాక్షన్‌గా అవసరమైన వారికి జీఎస్‌ఎల్‌ కళాశాల, ఆసుపత్రిలో మరిన్ని విస్తృత పరీక్షలు, వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని గన్ని కృష్ణ చెప్పారు. వైద్య సేవలకు వీలుగా నాలుగు మొబైల్‌ డెంటల్‌ చైర్లను కూడా శిబిరానికి తరలిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఎన్‌టిఆర్‌ వైద్య సేవ పథకం కింద కూడా ఉచితంగా వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు. ఈ శిబిరాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నామన రాంబాబు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిధులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జీఎస్‌ఎల్‌ సంస్థల చైర్మన్‌ డా. గన్ని భాస్కరరావు, మాజీ  శాసనసభ్యులు శీతంశెట్టి వెంకటేశ్వరరావు,  చిన్నం బాబూ రమేష్‌ పాల్గొంటారని గన్ని తెలిపారు.
జీఎస్‌ఎల్‌ కళాశాల అండ్‌ ఆసుపత్రి  అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో అవసరమైన వారిని గుర్తించి వారికి ఆ తర్వాత తమ ఆసుపత్రిలో ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్లు చేయడంతో పాటు దంత వైద్య సేవలు, గుండె, న్యూరో సంబంధిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.  ఎన్‌టిఆర్‌ వైద్య సేవ పరిధిలో లేని వారికి కూడా తమ ఆసుపత్రిలో సేవలందిస్తామన్నారు. స్వైన్‌ ఫ్లూ వ్యాధిపై గిరిజనులకు  అవగాహన కల్పించడంతో పాటు మందులు పంపిణీ చేస్తామన్నారు. తమ ఆసుపత్రిలో అవసరమైన వారికి ఉచితంగా రక్త పరీక్షలు, ఇసీజీ వగైరా పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ప్రతినిధి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్‌ ద్వారా ఇంతవరకు 5,270 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి 11.56 లక్షల మందికి సేవలందించామని తెలిపారు. తమ ట్రస్ట్‌ ద్వారా వ్యాధులపై అవగాహన శిబిరాలు నిర్వహించడంతో పాటు  యోగా తరగతులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో  దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, కొమ్మ  శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ పరిమి శ్రీనివాస్‌,  పార్టీ నాయకులు నిమ్మలపూడి  గో వింద్‌, మజ్జి రాంబాబు కొత్తూరి బాల నాగేశ్వరరావు, మళ్ళ వెంకట్రాజు, ఉప్పులూరి జానకిరామయ్య, మరుకుర్తి తాతబ్బాయ్‌, లా మదన్‌, కాట్రు లక్ష్మణస్వామి, ,కరుటూరి అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.