గీత దాటితే చర్యలు తప్పవు

0
376
బిజెపి నగరాధ్యక్షులు బొమ్ముల దత్తు – అర్బన్‌ జిల్లాకు కొత్త కూర్పు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 25 : పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొందరిపై ఒకట్రెండు రోజుల్లో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ  పార్టీ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయని, దానిపై విచారణ జరిపిన పార్టీ అధిష్ఠానం త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అర్బన్‌ జిల్లా కమిటీని నియమించామని, పార్టీలో చురుకుగా ఉంటున్నవారికి గుర్తింపు ఇచ్చామన్నారు. ప్రధాన కార్యదర్శులుగా అడబాల రామకృష్ణారావుకు మరో మారు అవకాశం కల్పించి బూర రామచంద్రరావును కూడా ప్రధాన కార్యదర్శిగా నియమించామని తెలిపారు. ఉపాధ్యక్షులుగా నల్లమిల్లి వీర బ్రహ్మానందం, సవితాల చక్రభాస్కరరావు, వీరఘంట భానుమతి, సుంకవల్లి కృష్ణార్జున చౌదరి, తకెళ్ళ సత్యనారాయణ, కార్యదర్శులుగా బొర్రా పోతురాజు, రాయుడు వెంకటేశ్వరరావు,  జక్కంశెట్టి మహేష్‌, పిల్లాడి రుద్రయ్య, చింతాలమ్మ, కోశాధికారిగా వెత్సా రాంప్రసాద్‌ను నియమించామన్నారు. మరి కొంతమందిని త్వరలో నియమిస్తామని తెలిపారు. అర్బన్‌ జిల్లా కమిటీతో పాటు అనుబంధ సంఘాల నియామకాలను కూడా త్వరలోనే చేపడతామన్నారు. ఎంఆర్‌పి ధరలకే మద్యం విక్రయించాలని, రాత్రి పది గంటలకల్లా దుకాణాలను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేపట్టిన ఉద్యమంపై కొంతమంది బురద జల్లుతున్నారని, మద్యం వ్యాపారులు దిగివచ్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని,  ఎలాంటి ఒత్తిళ్ళకు వెనుకడుగు వేయబోమన్నారు. మద్యం దుకాణాల వద్ద ధరల పట్టికను ఏర్పాటుచేయాలని, అవసరమైతే దశలవారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు.  రాష్ట్ర కార్యవర్గసభ్యులు గరిమెళ్ళ చిట్టిబాబు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనుల్లో జరిగిన అవినీతిపై అధ్యయనం చేసి వారి భరతం పడతామని అన్నారు. విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణారావు, మీడియా ఇన్‌ఛార్జి దాస్యం ప్రసాద్‌, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ డైరక్టర్‌ యెనుముల రంగబాబు, కెవిఎం కృష్ణ,  నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.