గేట్లు ఎత్తేసారు !

0
307
మనస్సాక్షి
 అప్పటికే బారెడు పొద్దెక్కింది. ఆ పాటికి గురుశిష్యులిద్దరూ గిరీశం గారి యింటరుగు మీద సెటిలయి కబుర్లలో పడ్డారు. గిరీశం అయితే  ఎప్పటిలాగే నోట్లో చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తున్నాడు. యింతలో వెంకటేశం  హఠాత్తుగా ” ఏంటో గురూ గారూ… వ్యవస్థ రోజు రోజుకీ దిగజారిపోతోంది” అన్నాడు. దాంతో గిరీశం గతుక్కుమని ” ఈ చుట్ట గురించే కదోయ్‌…. దీని వలనే మా తాత గారి నుంచి నా దాకా యింత గుర్తింపు” అన్నారు. దాంతో వెంకటేశం ” అబ్బబ్బ.. మీ చుట్ట గురించి కాదులెండి. రోజురోజుకీ పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలూ, దాంతో జరిగే హత్యల గురించీ ” అన్నాడు. దానికి గిరీశం ఏదో అనబోతుంటే  ఆనందం వచ్చాడు. ఆనందం అంటే  ఆ వీధిలోనే మూడో యింట్లో ఉంటాడు. పేరుకి తగ్గట్టే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అయితే యిప్పుడు మొహంలో అలాంటి ఆనందాలేవీ కనపడ్డం లేదు. ఏదో చెప్పడానికొచ్చాడు. అయితే తీరా వచ్చాక  అక్కడున్న వెంకటేశాన్ని  చూసి ” మళ్ళీ వస్తాన్లే గురూ గారూ” అన్నాడు. దాంతో గిరీశం ” మరేం ఫరవాలేదు.. మా వాడే! ఏదయినా మేం కలిసే వింటాం, మాట్లాడుకుంటాం !” అన్నాడు దాంతో ఆనందం అరుగుమీద సెటిలై, అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ముందు కొంచెం సేపు మాటలు రాకపోయినా, తర్వాత ఆ మాటలేవో  ప్రవాహంలా రావడం మొదలెట్టాయి. నాకు ఈ మధ్య మా ఆవిడ మీద అనుమానం వచ్చింది. ఎంక్వయిరీ చేస్తే  ఆ భుజంగం గాడితో సంబంధం ఉందని తెలిసింది. అయినా నిర్ధారణ  చేసుకోవడానికి ఓ ఆడియో రికార్డింగ్‌ డివైస్‌ని బెడ్రూంలో పెట్టేసి బయటకెళ్ళిపోయా. నా అనుమానం నిజమయింది” అన్నాడు. దాంతో గిరీశం, వెంకటేశం ఆసక్తిగా చూశారు. యింతలో ఆనందరావు, ఆ ఆడియో రికార్డింగ్‌ డివైస్‌ని తన కూడా తెచ్చుకున్న  ల్యాప్‌టాప్‌లో పెట్టి ప్లే చేశాడు. ఆ రికార్డయిందాంట్లో దాదాపు రెండున్నర గంటల టైం తర్వాత ఏవో మాటలూ, శబ్ధాలూ వినిపించడం మొదలయింది. మొత్తానికి అదంతా  వింటుంటే భుజంగం రావడం, ఆనందం భార్య భాగ్యంతో  అక్రమ సంబంధం ఉండటం స్పష్టంగా అర్ధమయ్యాయి. అదంతా అయిం తర్వాత ఆనందం ” యిప్పుడు  ఈ ఆధారంతో  కోర్టుకి వెళదామనుకుంటున్నా. దాంతో ఆ  భుజంగం గాడూ, మా ఆవిడా లోపలికి పోతారు” అన్నాడు. గిరీశం తలూపి ” సరే.. అయిందేదో అయింది. వాడి సంగతి తేలుద్దాం. మరి మీ ఆవిడతో  కాపరం వద్దనుకుంటున్నావా ?” అంటూ అడిగాడు. దాంతో ఆనందం మొహం అసహ్యంగా పెట్టి ” ఛీ.. ఛీ.. యింత జరిగాక దాంతో కలిసుండేదే లేదు. అయితే నా కసి తీరాలి  కదా. అందుకే  పోలీస్‌ కంప్లయింట్‌ యిద్దామనుకుంటున్నా. మీ సలహా ఏంటీ? అన్నాడు. గిరీశం తలూపి ” ఐపీసిలో 497 సెక్షన్‌ ఒకటుందోయ్‌.. దాని ప్రకారం యిలాంటి వ్యవహారాల్లో  పురుషుడికి గట్టిగానే…. అంటే సంవత్సరాల్లో శిక్ష పడొచ్చు. స్త్రీకి ఏ శిక్షా ఉండదు” అన్నాడు. దాంతో ఆనందం నిరాశపడి ” మరలాగయితే నా కసెలా తీరుతుందని…. లేకపోతే ఆ వెధవ మా యింట్లో ఉన్నప్పుడు యింటి బయట తలుపులకి తాళం వేసేసి అందరినీ పిలిచి అల్లరి చేసి, యిద్దరినీ రోడ్డు మీద పెట్టెయ్యాలంతే” అంటూ వెళ్ళిపోయాడు.
 యింతలో వెంకటేశం ” అయినా గురూ గారూ…. యిదేం న్యాయం? పురుషుడికో న్యాయం, స్త్రీకో న్యాయం ఏంటంట?” అన్నాడు. దాంతో గిరీశం అలా అని కాదోయ్‌… మనది ఓ రకంగా పురుషాధిక్య ప్రపంచం. అన్నిట్లోనూ పురుషుడికి అవకాశాలెక్కువ. స్త్రీని సులభంగా లొంగదీసుకోగలుగుతాడు. అందుకే యిలాంటి సందర్భాల్లో శిక్షేదో పురుషుడికే అని చట్టం చేసుండొచ్చు” అన్నాడు. తర్వాత యిద్దరూ కబుర్లలో పడ్డారు. యింకో గంట గడిచింది. అప్పుడింకో  విశేషం జరిగింది. అటూ యిటూ చూసుకుంటూ లత వచ్చింది. లత అంటే భుజంగం భార్య! దాంతో గిరీశం ఈవిడొచ్చిందేంటీ ?… ఆనందం భార్యతో తన భర్త ఎఫైర్‌ గురించి మాట్లాడ్డానికి కాదు కదా….’ అనుకున్నాడు. యింతలోనే లత మెట్లేక్కేసి ” నమస్కారం అన్నయ్య గారూ… కొంచెం మీతో మాట్లాడాలి” అంది. దాంతో గిరీశం నోట్లో చుట్ట పక్కనబెట్టి  ” చెప్పమ్మా” అన్నాడు. అప్పుడు లత  ” ఏం లేదండీ.. మా ఆయన తెలసు కదా .. భుజంగరావు. ఈ మధ్య ఆ మూడో యింట్లో ఉండే ఆనందం గారి భార్య భాగ్యాన్ని మరిగాడని తెలిసింది. అసలయితే  మా ఆయన బంగారం లాంటి మనిషి. యింతకు ముందు బాగానే ఉండేవారు. యిదిగో.. యిప్పుడే   ఆ మాయలాడి  మా ఆయన్ని  వలలో వేసుకుంది” అంది. దాంతో జరిగే భాగోతమంతా ఆవిడకి తెలుసని గిరీశానికి అర్ధమయిపోయింది. యింతలోనే లత ” మరేంలేదన్నయ్య గారూ… ఎవరికే సమస్యసొచ్చినా  మీరు సలహాలు చెపుతారు కదా. అందుకే  మీ దగ్గరకొచ్చా. ఆ మాయలాడి బంగారం లాంటి  నా కాపరంలో నిప్పులు పోసింది. దానికి సరయిన బుద్ధి చెప్పాలి ” అంది. దాంతో గిరీశం ” నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా… అయితే నువ్వు కోర్టుకెళ్ళినా యిటు మీ ఆయన్ని గానీ అటు ఆ భాగ్యాన్ని గానీ లోపలేయించలేవు. చట్టం అలా ఉంది” అన్నాడు. దాంతో లత బాధపడిపోతూ ” మరలాగైతే  ఆ మాయలాడిని ఏం చేయలేమా.. లేకపోతే ఏ టీవీ 9 వాళ్ళనో పిలిచి యిద్దరినీ  రోడ్డుకి లాగెయ్యాలంతే ” అంది. దాంతో గిరీశం ” అంతదాకా  ఎందుకు లేమ్మా… అయినా అలా చేస్తే  నీకు న్యాయం జరుగుతుందా?” అన్నాడు. లత తల అడ్డంగా ఊపి ” నాకు న్యాయం జరక్కపోయినా ఆ మాయలాడి మీద నా కసి తీరుద్ది కదా” అంది. దాంతో గిరీశం ” దానితో పాటు మీ ఆయన కూడా రోడ్డున పడిపోతాడు కదా… అంత జరిగిం తర్వాత మీ ఆయన కూడా రోడ్డున పడిపోతాడు కదా…అంత జరిగిం తర్వాత మీ ఆయన నీతో కలిసుంటాడా? అన్నాడు. దాంతో లత ఆలోచనలో పడింది. యింతలోనే గిరీశం ” తొందరపడకమ్మా… దీనికేదో దారి చూద్దాం” అంటూ  అనునయించి లతని పంపించేశాడు.
 వారం రోజుల తర్వాత…
 వెంకటేశం ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే ” గురూ గారూ…కొంపలంటుకున్నాయి. అవతల సుప్రీం కోర్టు ఐపీసిలో సెక్షన్‌ 497 ని ఎత్తేసింది. అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా ఎలాంటి శిక్షా ఉండదు. అసలది నేరమే కాదట. ఈ లెక్కన భుజంగం శుభ్రంగా తప్పించేసుకున్నట్టే ” అన్నాడు. గిరీశం తలూపాడు. యింతలో వెంకటేశం ” అయినా సుప్రీంకోర్టు యిదేం పని గురూ గారూ… యిలా చేయడం వల్ల వివాహేతర సంబంధాల్ని ప్రోత్సహించినట్టు కాదా? అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ” అయితే నువ్వూ సగటు మనిషిలాగే ఆలోచిస్తున్నావన్నా మాట. యిక్కడ గమనించవలసిన  విషయం ఒకటుంది. సుప్రీంకోర్టు  యిలా సెక్షన్‌ 497 ని ఎత్తేయడం  ఈ వివాహేతర సంబంధాల్ని ప్రోత్సహించడం కాదు. యింతకాలం  జరుగుతుంది ఎప్పుడో  బ్రిటీష్‌ వాళ్ళ కాలంలో పెట్టిన ఈ సెక్షన్‌  497 వలన యిలాంటి కేసుల్లో  పురుషుడికి మాత్రమే శిక్ష పడడం,  యిలాంటి కేసుల్లో పురుషుడే స్త్రీని లొంగదీసుకుంటాడని భావించడం వలనే  ఆ శిక్షేదో పురుషులకే పడుతూ వస్తోంది. అయితే యిక్కడ గమనించవలసిందేంటంటే… జరుగుతున్న  దాంట్లో స్త్రీకి అన్యాయం జరుగుతూ వస్తోంది. అదెలాగంటే..తన భర్త పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ సంబంధం పెట్టుకున్న  స్త్రీ మీద ఎలాంటి కేసూ పెట్టలేని పరిస్థితి ఆ స్త్రీకి ఉంది. అసలీ వివాహేతర బంధం విషయంలో  పాత్ర అనేదీ ఆ  స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ శిక్షేదో  పురుషుడికే పడడం సరికాదని సుప్రీంకోర్డు భావించి ఉండొచ్చు. అలాగని స్త్రీకి కూడా ఆ శిక్షేదో పడేలా చేయకుండా మొత్తం ఆ సెక్షన్నే ఎత్తేయడం జరిగింది. అసలు వివాహ బంధం అంటే యిద్దరు స్త్రీ పురుషులు యిష్టపడి కలిసి ఉండడానికి ఓ పవిత్ర బంధంలా  అడుగు పెట్టడం. ఓ రకంగా యిద్దరూ  లోక జ్ఞానం తెలిసి బాధ్యతాయుతమయిన పౌరులే. అలాంటి వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటే దానర్థం తమ బంధాన్ని  అవమానించడమే. అటువంటి పరిస్ధితుల్లో ఆ భార్య భర్తలు కలిసుండడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే  చట్టబద్ధంగా విడిపోవడానికి వీలుగా విడాకులు ఆప్షన్‌ ఉండనే ఉంది. యిక వివాహేతర సంబంధాల  విషయంలో  సుప్రీంకోర్టు వైఖరిని యింకో కోణంలో చూద్దాం. సిగరెట్లు,  మద్యపానంలాంటివి ఆరోగ్యానికి హానికరమే. అయితే వాటి అమ్మకాలన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నాయి. అంతమాత్రం చేత వాటి వినియోగాన్ని  కోర్టు ప్రోత్సహిస్తుందని కాదు. వాటిని వినియోగించి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమనేది జనాల యిష్టమంతే. అలాగే వివాహేతర సంబంధాల్ని తీసుకున్నా నైతిక విలువలకు కట్టుబడి వాటి జోలికిపోకూడదనేది స్త్రీ పురుషులు నిర్ణయించుకోవాలి.అన్నిటి కంటే ముఖ్యంగా యిలాంటి అక్రమ సంబంధాల విషయంలో  కోర్టు శిక్ష వేయకపోవచ్చు. అయితే ఈ విషయమేదో బయటకొచ్చి నలుగురూ అసహ్యంగా మాట్లాడుకుంటే అంతకు మించిన శిక్షలేనే లేదు” అంటూ వివరించాడు.
 డా. కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here