గోదావరిలో ఫ్లోటింగ్‌ వేదిక

0
350
కొలతల సేకరణకు కొత్త పరికరం -స్వచ్ఛ సర్వేక్షణలో కార్పొరేషన్‌
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 28 : గోదావరి నదిలో తేలియాడే సాంస్కృతిక కార్యక్రమాల వేదికను ఏర్పాటు చేయనున్నట్లు నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు తెలిపారు. స్ధానిక కోటిలింగాలరేవు పక్కనే ఉన్న  చింతాలమ్మ ఘాట్‌ వద్ద గోదావరి నదిలో ఉన్న రిజర్వాయర్‌ను తేలియాడే వేదికగా రూపొందించనున్నట్లు చెప్పారు. చింతాలమ్మ ఘాట్‌లో  ప్రేక్షకులు కూర్చుని కార్యక్రమాలను తిలకించవచ్చన్నారు.  ఈ వేదికను నగర ప్రజలు, వివిధ సంస్ధలు వి నియోగించుకోవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ భారత్‌ అమలుపై స్వచ్ఛ రక్షణ పేరిట సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వేలో రాజమహేంద్రవరం కూడా పాల్గొంటుందన్నారు.  స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రతినిధులు స్వతంత్రంగా వచ్చి సర్వే నిర్వహిస్తారన్నారు. ఉత్తమ ర్యాంక్‌లు సాధించిన నగరాలు, పట్టణాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతాయన్నారు. నగర పాలక సంస్థ  ఈ సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకింగ్‌ సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ సర్వేలో  ప్రజలను కూడా భాగస్వాములను చేస్తారన్నారు. ఇందుకోసం స్వచ్ఛ భారత్‌పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నగరంలోని  ప్రధాన మార్గాల్లో రోజుకు రెండు పూటలా పారిశుద్ధ్య పనులు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. నగర పాలక సంస్ధలో పన్నుల మదింపు, ఇతర కొలతల కోసం లేజర్‌ లాజిక్స్‌ అనే కొత్త డిజిటల్‌ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు విజయరామరాజు చెప్పారు. ఈ పరికరం ద్వారా  కేవలం ఒకే వ్యక్తి ఎంత వైశాల్యమైనా కొలతలు వేసి, రీడింగ్‌ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తాను అధికార బాధ్యతలు చేపట్టాక ఏడాదిలో నగర పాలక సంస్థ ఆదాయాన్ని రూ. 9 కోట్లు అదనంగా పెంచేందుకు, కార్పొరేషన్‌ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి పదవ తరగతిలో ఉత్తీర్ణతా శాతాన్ని మరో మూడు శాతం పెరిగేలా కృషి చేశానని కమిషనర్‌ తెలిపారు.