గోదావరి తీరాన జూనియర్‌ జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలు

0
242
రాజమహేంద్రవరం వేదికగా డిసెంబర్‌ 24 నుంచి నిర్వహణ
రాజమహేంద్రవరం, నవంబర్‌ 2 : దేశంలో అతిపెద్ద జూనియర్‌ జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలకు రాజమహేంద్రవరం వేదిక కాబోతోంది. వచ్చే నెల 24 నుంచి 30వ తేదీ వరకు జాతీయ  బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొడాలి తనూజ వెల్లడించారు. స్థానిక షెల్టాన్‌లో ఈరోజు జరిగిన విలేరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌), ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ (ఎపిబిఎ) అనుమతిలో తూర్పు గోదావరి జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుందన్నారు. నారాయణపురంలోని మున్సిపల్‌ సిటీ బ్యాడ్మింటన్‌ స్టేడియం, ఆఫీసర్స్‌ క్లబ్‌,  కెఎస్‌ఎన్‌ స్టేడియంలో జరిగే ఈ జాతీయ బ్యాడ్మింటన్‌ అండర్‌ -19 పోటీల్లో సుమారు అన్ని రాష్ట్రాల నుంచి 400 మంది వరకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. మొదటి రెండ్రోజులు ఆల్‌ ఇండియా ఇంటర్‌ జోనల్‌ జూనియర్‌ టీమ్‌ చాంపియన్స్‌ షిప్‌ పోటీలు జరుగుతాయన్నారు. అండర్‌-19 బాల బాలికలకు సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు. 50 నుంచి 100 మంది వరకు టెక్నికల్‌ టీమ్‌ సభ్యులు ఈ టోర్నీకి విచ్చేస్తున్నారన్నారు. యోనెక్స్‌ సన్‌రైజ్‌ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌-జక్కంపూడి రామ్మోహనరావు మెమోరియల్‌ 44వ జూనియర్‌ అండర్‌-19 నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌గా పేరు నిర్ణయించినట్టు తెలిపారు.  క్రీడాకారులు, టెక్నికల్‌ అఫీషియల్స్‌ అందరికి ఉచిత, భోజన, వసతి, రవాణా సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి 10 మంది క్రీడాకారులతో పాటు కోచ్‌, మేనేజర్‌ ఇతర సభ్యులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు 60 నుంచి 70 లక్షల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి నిధుల సేకరణ విషయంలో వైసిపి పార్లమెంటరీ చీఫ్‌విప్‌, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల సహకారం తీసుకుంటున్నట్టు తనూజ పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌కు చీఫ్‌ ప్యాట్రన్‌గా మార్గాని భరత్‌రామ్‌, ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌గా జక్కంపూడి రాజా,  ఆర్గనైజింగ్‌ కమిటీ కో చైర్మన్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా కొడాలి తనూజ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపరేషన్స్‌గా డి.త్రినాధ్‌, ప్రదాన కార్యదర్శిగా కాండ్రపు రాజా రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొత్తపల్లి బాలు, ఉపాధ్యక్షులుగా ప్రకాష్‌, రవి, పరిశీలకుడిగా గోవిందరాజు, రూమ్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌కు బెజవాడ వెంకట్‌ పనిచేస్తారు. రాజమహేంద్రవరం కీర్తి పతాకాన్ని ఎగురవేసేలా జాతీయ స్థాయి టోర్నీని అందరి సహకారంతో నిర్వహిస్తామని దూడల త్రినాధ్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here