గోదావరి దోబూచులు 

0
159
రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ- మళ్ళీ పెరిగే అవకాశాలు
రాజమహేంద్రవరం, ఆగస్టు 5 : ఎగువన కురిసిన వర్షాల కారణంగా పెరిగిన గోదావరి వరద క్రమేణా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహించిన వరద ఇపుడు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. కాటన్‌ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 13.70 అడుగులుగా ఉంది. సముద్రంలోకి 12.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఫ్లడ్‌ కన్జవేటర్‌ మోహన్‌రావు తెలిపారు. కాగా వరదల కారణంగా పలు లంక గ్రామాలు, ఏజన్సీలోని దేవీపట్నం తదితర ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే  గోదావరి దోబూచులాడుతోంది. కాగా ఎగువన వర్షాలు తగ్గుముఖం పడితేనే వరద పూర్తిగా శాంతించే అవకాశాలున్నాయి. అయితే సోమవారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో సోమవారం సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటి ప్రవాహం ఉండే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.10 అడుగులు నమోదు అయ్యింది. భద్రాచలం వద్ద 42.30 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. ఇది సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ 175 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 11 లక్షల 96 వేల 903 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. పుష్కరాల రేవు పాత వంతెన వద్ద 54 అడుగులను తాకుతూ వరదనీరు ప్రవహిస్తోంది. గోదావరి నది మధ్యలో ఉన్న లంక గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి తరలించారు. దేవీపట్నం పోచమ్మగండి ఆలయంలోకి కూడా వరదనీరు భారీగాచేరింది. అమ్మవారి ముక్కుపుడకను తాకుతూ గోదావరి ముందుకు సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here