చంద్రన్న బీమాలో చేరితే దీమాగా ఉండొచ్చు

0
361
మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 21  : మత్స్యకారులు తప్పనిసరిగా చంద్రన్న బీమా పథకంలో పేర్లు నమోదు చేయించుకోవాలని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు కోరారు. నిత్యం వరదలు, తుపాన్లు ఎదుర్కొనే మత్స్యకారులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. గోదావరి మాత ఫిషర్‌మెన్‌ సంఘం, శ్రీ గోదావరి మాత మహిళా మత్స్య సహకార సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి గట్టున జీవకారుణ్య సంఘం ఎదురుగా ఉన్న ఇసుక ర్యాంప్‌లో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గోదావరి మాత ఫిషర్‌మెన్‌ సంఘం అధ్యక్షులు వెలమ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, క్రైం డిఎస్పీ త్రినాధరావు, వైకాపా సీజీసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, స్ధానిక కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులను చంద్రన్న బీమా పథకంలో చేపట్టేందుకు ఓ ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామని అన్నారు. మత్స్యకారుల నుంచి ఎవరైనా ఆశీలు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గోదావరి వరదల సమయంలో మత్స్యకారులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి భోజన వసతులను ప్రభుత్వం సమకూరుస్తోందని, భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిసో ్తందని అన్నారు. మత్స్యకారులు తమ పిల్లలను కులవృత్తికే పరిమితం చేయకుండా బాగా చదివించాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ మత్స్యకారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తన హయాంలో మత్స్యకారుల కోసం చేపల మార్కెట్లు నిర్మించామన్నారు. జక్కంపూడి విజయలక్ష్మీ మాట్లాడుతూ మత్స్యకారులకు గోదావరి జీవనాధారమని, అటువంటి గోదావరిని కాలుష్యం బారిన పడకుండా చూడాలని కోరారు. అనంతరం గోదావరిలో 75 వేల చేప పిల్లలను, 50 వేల రొయ్య పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ పొలసానపల్లి హనుమంతరావు, యజ్జవరపు మరిడయ్య, వెలమ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.