చంద్రబాబుకు ఈ ఏడాది చుక్కలు చూపిస్తాం

0
324

రూలింగ్‌ను ట్రేడింగ్‌గా మార్చేసి కోట్లు దిగమింగుతున్నారు

ఉద్యమాన్ని ఈవెంట్‌గా మార్చేసి రూ. 30 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం

ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

మళ్ళీ తెదేపాను అధికారంలోకి రానివ్వబోము : బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 21 : రూలింగ్‌ను ట్రేడింగ్‌గా మార్చేసి ఏపీకి చేసిన సహాయాన్ని మరుగునపరుస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ పరిపాలన కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు ఈ ఏడాది చుక్కలు చూపిస్తామని బిజెపి జాతీయ కార్యవర్గసభ్యులు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలో నిన్న సీఎం చేసిన ధర్మపోరాట దీక్షలో ప్రధానమంత్రిపై ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు నవ్వుతూ ఆస్వాదించారని, తాము క్షమాపణలు కోరబోమని, బాలకృష్ణపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నామని, చంద్రబాబు సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినందున ఆయనను సాక్షిగా చేస్తామని వీర్రాజు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

సీఎం ఉపయోగించే భాష ఇదేనా!

పవిత్రమైన రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతూ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ప్రభుత్వాధినేతగా ‘మాతో పెట్టుకోకండి’ అంటూ ప్రధానిని ఉద్ధేశించి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. అయినా స్వచ్ఛ భారత్‌ కింద మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణ నిధులు నాకేసిన మీలాంటి వాళ్ళతో తనకు వచ్చిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ. 100 కోట్లను బాలల సంరక్షణ నిమిత్తం ఇచ్చిన మోడీ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నేతలు ఎందుకు పెట్టుకుంటారని సోము వీర్రాజు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే నిన్న ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు ఎదురుగా బాలకృష్ణ ప్రధానమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే నివారించవలసింది పోయి నవ్వుతూ ఆస్వాదించారని, జలం, మట్టి ఎంతో పవిత్రమైనవని, తెదేపా నాయకులు చివరికి వాటిని కూడా కించపర్చారని వీర్రాజు అన్నారు. చంద్రబాబు నుంచి దిగువ స్థాయి నేతలు వరకు మోడీని నిత్యం దుమ్మెత్తి పోస్తున్నా ప్రధానమంత్రి నోరు మెదపకుండా హుందాగా వ్యవహరించారని, తాము వారిలా దిగజారి అటువంటి భాషను ఉపయోగించడం లేదని ఆయన అన్నారు.

2019 పరిస్థితి చంద్రబాబుకు ఇప్పటికే అర్ధమైంది

2019లో ఏం జరుగుతుందో చంద్రబాబుకు కళ్ళకు కట్టినట్టు కనబడుతోందని, గతంలో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీకి పరిస్థితులు బాగోనప్పుడు అత్యవసర పరిస్థితి కనబడిందని, అలాగే చంద్రబాబుకు 2004 ఎన్నికల్లో అలిపిరి ఘటన కనబడిందని, తిరిగి చంద్రబాబుకు 2019లో కూడా అదే కనపడుతోందని వీర్రాజు మర్మగర్భంగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా ప్రధానమంత్రి పనిచేస్తూ నిరసన దీక్ష చేశారని, అయితే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగపరుస్తూ దీక్ష చేసి దానిని ప్రచారానికి ఉపయోగించుకుని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేశారని ఆయన ధ్వజమెత్తారు. అయినా ఏ కార్యక్రమం చేసినా ఈవెంట్‌లా నిర్వహించడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. కాగా చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అక్రమాలను బిజెపి ప్రశ్నిస్తుందని, తమ కార్యకర్తలు నిద్రపోకుండా ప్రజల్లోకి తెదేపా అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతారని, ఈ ఏడాది చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమంటున్నారన్న ఆ పార్టీ వారి డిమాండ్‌ను ప్రస్తావిస్తూ బిజెపి వల్ల కూడా అధికారం వచ్చిన చంద్రబాబు ముందు రాజీనామా చేస్తే ఆ తర్వాత తాను రాజీనామా చేస్తానని వీర్రాజు సమాధానమిచ్చారు. హోదాతో ఒరిగేదీ ఏమీ లేదని గతంలో చెప్పి ఆ తర్వాత యూ టర్న్‌ తీసుకుని హోదా ఇవ్వాల్సిందేనని తానే గందరగోళంలో పడి చిత్తశుద్ధి లేని ఉద్యమాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ కాలపరిమితి ముగియడానికి ఇంకా ఏడాది వ్యవధి ఉన్నందున ఈ సంవత్సర కాలంలోనైనా పాలనను గాడిలో పెట్టి ప్రజాధనం దుర్వినియోగాన్ని, అవినీతిని అరికట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బంద్‌ వల్ల నష్టమని హోదా దీక్షకు రూ. 30 కోట్ల ఖర్చా ?

హోదా బంద్‌ వల్ల ఆర్టీసికి రూ. 12 కోట్ల నష్టం వచ్చిందని చెప్పిన చంద్రబాబు నిన్న తాను చేసిన ధర్మపోరాట దీక్షకు రూ. 30 కోట్లు ఖర్చు పెట్టిన దానికి ఏం సమాధానం చెబుతారని సోము ప్రశ్నించారు. అలాగే హోదా కావాలంటున్న చంద్రబాబు గతంలో హోదా కోసం ఉద్యమించిన వారిపై పెట్టిన కేసులను ఇంతవరకు ఎత్తి వేయలేదని ఎద్దేవా చేశారు. కేంద్రం వివిధ పథకాలకు పెద్ద ఎత్తున నిధులిచ్చినా ఖర్చు చేయలేని అసమర్ధత ప్రభుత్వం దేశంలో ఏపీ ఒక్కటేనన్నారు. రాష్ట్రానికి ఎవరొచ్చినా రియల్‌ టైం గవర్నెన్స్‌, డ్యాష్‌బోర్డు అంటూ పెద్ద ప్రజంటేషన్‌ ఇస్తున్నారని, వాస్తవంలో క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాష్ట్రం పెట్టుబడిగా వ్యాపారం చేసుకోవడానికి టక్కు టమారాల తెదేపాకు మరో ఐదేళ్ళు అవకాశమివ్వబోమని, ప్రజల్ని చైతన్యపర్చి వాస్తవాలను వెలుగులోకి తెచ్చి గాడి తప్పిన ఏపీని తిరిగి గాడిన పెట్టే బాధ్యతను బిజెపి తీసుకుంటుందని ఆయన తెలిపారు. పవన్‌కళ్యాణ్‌ను నాలుగేళ్ళు ఉపయోగించుకుని ఇప్పుడు వారి కుటుంబాన్ని కూడా కించపర్చే స్థాయికి తెదేపా వారు దిగజారారంటే వారు ఎంత అవకాశవాదులో అర్ధమవుతోందని సోము అన్నారు. విలేకరుల సమావేశంలో బిజెపి నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణ, కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, పార్టీ నాయకులు ధార్వాడ రామకృష్ణ, పొట్లూరి రామ్మోహనరావు, యెనుముల రంగబాబు, నల్లమిల్లి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here