చంద్రబాబుది ఉత్తుత్తి ఆదరణ.. జగన్‌తోనే బిసిలకు ఆదరణ

0
197
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  బిసి అధó్యయన కమిటీ అధ్యక్షుడు జంగా
రాజమహేంద్రవరం, నవంబర్‌ 15 :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌తోనే బిసిలకు ఆదరణ లభిస్తుందని వైకాపా బిసి అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బిసిలకు అన్ని సౌకర్యాలు కల్పించారని, రాజకీయంగా కూడా ముందుకు తీసుకుని వెళ్లేందుకు విశేష కృషిచేసారన్నారు. రాజమహేంద్రవరం జాంపేట ఉమారామలింగేశ్వర కల్యాణ మండపంలో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా బిసి అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగా మాట్లాడుతూ బిసిలను అన్ని విధాలా మోసగించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. జగన్‌ ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా బిసిల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై విషయాన్ని అధ్యయనం చేయాలని సూచించారన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బిసిల సమస్యలను తెలుసుకుంటున్నామని వివరించారు ఒకటి బై మూడో వంతు బిసిలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. చంద్రబాబు పాలనలో బిసిలు పూర్తిగా నిరాదరణకు గురయ్యారని వారందర్నీ వైఎస్‌ఆర్‌సిపి వైపు ఆకర్షించేలా చేసి జగన్‌ను సిఎం చేయడం ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పిస్తామన్నారు. బిసిలకు రాజకీయంగా రిజర్వేషన్‌ ఉన్న చోట సీట్లు కేటాయించడంతో పాటు ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ పదవుల్లో కూడా అవకాశం ఇస్తామని జగన్‌ ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో జగన్‌తోనే బిసిలకు న్యాయం జరుగుతుందన్న భరోసా కలిగిందన్నారు. ఏటా 10 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్‌, బిసి సబ్‌ప్లాన్‌, నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని నమ్మించి చంద్రబాబు బిసిలను మోసం చేసారని ధ్వజమెత్తారు. బిసిలకు ఏం చేసారో తెలుగుదేశం ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. అధ్యయన కమిటీ సమావేశాల్లో బిసి కులాల నుంచి వచ్చిన సూచనలను, విజ్ఞప్తులను జగన్‌కు నివేదిక రూపొందించి అందచేసారు. ఆ అంశాలను మేనిఫెస్టోలో చేర్చి డిక్లరేషన్‌ ఇస్తారని చెప్పారు. జనాభాలో 52 శాతం ఉన్న 144 బిసి కులాలు కనీస రాజకీయ ప్రాధాన్యత లేకుండా అట్టడుగు స్థాయిలో జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. బిసి వర్గాలు ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకుని ఎవరి వల్ల మేలు జరుగుతుందన్న దానిపై సమష్టి నిర్ణయం తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని కోరారు. దీనికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి హాజరైన బిసి సంఘీయుల అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో అధ్యయన కమిటీ సభ్యులు హెచ్‌బి నర్సే గౌడ, మేకా శేషుబాబు, తానేటి వనిత, సుగుమంచిపల్లె రంగమ్మ, వినుకొండ సద్ధారావు, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌, వైకాపా సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైకాపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మార్గాని భరత్‌రామ్‌, కో ఆర్డినేటర్లు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కర్రి పుల్లయ్య, జి.శ్రీనివాసగౌడ్‌, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, కోరుమెల్లి అనురాధ, పార్టీ నాయకులు మార్గాని నాగేశ్వరరావు, అంగర ఉమ, మజ్జి అప్పారావు, నరవ గోపాలకృష్ణ, మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here