చంద్రబాబు ఎన్నికల నాటకాలు ఇక సాగవు

0
220

హోదా కోసం రాజీలేని పోరు చేస్తున్న జగన్‌పై విమర్శలా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు జక్కంపూడి విజయలక్ష్మీ,రౌతు ధ్వజం

రాజమహేంద్రవరం, మార్చి 17 : ప్రత్యేక హోదా అంశంతో సహ పలు విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌ పట్ల పూర్తి వివక్ష చూపుతున్న బిజెపితో తెగతెంపులు చేసుకున్నామని, హోదా కోసం రాజీ లేని పోరాటం చేస్తామంటూ తెదేపా జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబునాయుడు ఇపుడు ప్రకటించడం ఎన్నికల నాటకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపితో నాలుగేళ్ళుగా అంటకాగి హోదా గురించి గట్టిగా అడగకుండా అదేమీ సంజీవిని కాదంటూ కబుర్లు చెప్పి ఆ తర్వాత ప్రజల్లో హోదా సెంటిమెంట్‌ బలంగా ఉందని గ్రహించి ఈ విషయంలో గట్టిగా పోరాడుతున్న తమ పార్టీ అధినేత జగన్‌కు పరిస్థితులు అనుకూలంగా మారుతుండటంతో చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారని అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి తదితరులతో కలిసి విజయలక్ష్మీ విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు వస్తే ఏదో ఒరుగుతుందని ప్రజలు భావించగా అదంతా భ్రమ అని తేలిపోయిందన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అని నాలుగేళ్ళగా ఒకే మాటపై పోరాడుతున్న నాయకుడు జగన్‌ అని, చంద్రబాబే కాసేపు ప్యాకేజీ బాగుందని, ఆ తర్వాత హోదా కావాలని, ఇలా గందరగోళ ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. ఓ వైపు రాష్ట్రానికి కేంద్రం వేల కోట్లు ఇచ్చామని చెబుతుంటే అందుకు సరైన సమాధానం లేదని, ఓటుకు నోటు కేసులో ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి 29 సార్లు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రాన్ని కనికరించలేదంటూ నాలుగేళ్ళ తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందంటూ కబుర్లు చెబుతున్న చంద్రబాబు నాటకాలు ఇక సాగవని విజయలక్ష్మీ అన్నారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కి అబద్ధాలతో కాలక్షేపం చేస్తూ 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అంటూ అందరిచేత పొగిడించుకోవడం తప్ప చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, మాట మీద నిలబడే నైజం లేని బాబుకు మడమ తిప్పని, మాట తప్పని జగన్‌ను విమర్శించే అర్హత లేదని ఆమె అన్నారు. ఇపుడు ఏపీయే గాక దేశం అంతా జగన్‌ వైపు చూస్తోందని, నరేంద్రమోడీ సర్కార్‌పై అవిశ్వాసానికి నోటీసులిచ్చి హోదాపై చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. జగన్‌ను బలహీనపర్చడానికి ఆయనో పెద్ద ఆర్థిక నేరస్తుడని, పలు కేసుల్లో నిందితునిగా ఉన్న ఏ1 జగన్‌, ఏ2 విజయసాయిరెడ్డిలు కేసుల మాఫీ కోసం ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారంటూ తెదేపా వారు దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే జగన్‌పై ఉన్న 14 కేసుల్లో 8 ఇప్పటికే వీగిపోయాయని, మిగిలిన కేసులు కూడా వీగిపోతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్‌పై వైకాపా అవిశ్వాసానికి మద్ధతు ఇస్తామని ముందు చెప్పి ఆ తర్వాత తామే ప్రతిపాదిస్తామని మాట మార్చారని, ఏపీ పట్ల తెదేపా అనుసరిస్తున్న ద్వంద వైఖరి, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 19న సంకల్ప మానవహారం ఏర్పాటు చేయనున్నట్లు విజయలక్ష్మీ తెలిపారు.

ఈ దుస్థితికి కారకుడు చంద్రబాబే

ఏపీకి ఈ దుస్థితికి చంద్రబాబే కారకుడని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగించుకోవడం చంద్రబాబు నైజమని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలకతీతంగా సమైక్యంగా పనిచేసే తమిళనాడులోని రాజకీయ పార్టీలను చూసి బుద్ధి తెచ్చుకుని ఏపీకి హోదా కోసం పోరాడుతున్న జగన్‌తో కలిసి పనిచేయడానికి తెదేపా ముందుకు రావాలని ఆయన అన్నారు. జగన్‌పై అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయంటున్న తెదేపా వారు అసలు ఆ కేసులను గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టించిన విషయాన్ని మరువరాదన్నారు. చంద్రబాబుకు రాష్ట్రం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, హోదా అంశం ఇంతవరకు బ్రతికుందంటే జగనే కారణమని రౌతు అన్నారు. గతంలో జగన్‌పై ఆరోపణలు వస్తే నాడు సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీబిఐ విచారణ జరిపించాలని కోరారని, అయితే నేడు లోకేష్‌పై పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు చేస్తే విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని రౌతు అన్నారు. ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి మాట్లాడుతూ ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తూ పూటకో మాట సులభంగా మార్చివేయడంలో చంద్రబాబు దిట్టఅని,నాలుగేళ్ళగా హోదా కోసం పోరాడుతున్న నేత జగన్‌ ఒక్కరేనని అన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు బొంత శ్రీహరి, పిల్లి నిర్మల, పార్టీ నేతలు నరవ గోపాలకృష్ణ, ఉప్పాడ కోటరెడ్డి, మాసా రాంజోగ్‌, పెంకే సురేష్‌, కుక్కా తాతబ్బాయ్‌, కుమార్‌, ఆనంద్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here