చంద్రబాబే మనకు పెద్ద ధీమా

0
492

ఈ నిరంతర శ్రామికుడిని బలపర్చకపోతే నష్టపోయేది మనమే

(జి.కె.వార్తా వ్యాఖ్య)

సువిశాల భారత సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం ఎన్నో కష్టాలకు ఓరుస్తూ త్యాగాలు చేస్తూ మన సైనిక దళాల పహరాతోనే ప్రతి ఒక్కరూ గుండెలపై చేయి వేసుకుని ధీమాగా నిద్రించుగలుగుతున్నాం…ఎక్కడైనా, ఎప్పుడైనా మన సరిహద్దుల్లోకి ప్రవేశించి మన ఆత్మసైర్థ్యాన్ని దెబ్బతీయాలని, సరిహద్దుల్ని ఆక్రమించుకోవాలని, ఆయుధ సంపత్తిని కొల్లగొట్టుకోవాలని పాకిస్తాన్‌ వంటి పొరుగు దేశాలు ప్రయత్నించినా మన సైనిక శక్తి ఆ కుటిల యత్నాలను సమర్ధవంతంగా తిప్పిగొట్టిన సంఘటనలను మనం అనేకం చూశాం… ఆ ఘటనలు సైనిక పాటవంపై మనకున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. అలాగే రాజధాని లేకుండా అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగినా, ఆర్థిక లోటు ఉన్నా, మధ్యలో అనుకోని విపత్తులు హుద్‌ హుద్‌ తుఫాన్‌ వంటి ఘటనలు ఎదురైనా, ప్రపంచ స్థాయి అద్భుత రాజధాని, బహుళార్ధక సాధక పోలవరం ప్రాజక్ట్‌ నిర్మాణం జరుగుతుందన్న భరోసా ఏపీ ప్రజలకు ఉందంటే మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక్కరున్నారన్న ధీమా ఒక్కటి చాలు. ఆయన దీక్షా దక్షతలకు అనేక ఉదంతాలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీలోకి వచ్చినా నానాటికి పార్టీ బలోపేతం కావడానికి, నేటికి పార్టీకి 70 లక్షలకు పైగా సైన్యం ఉందంటే తెర వెనుక చంద్రబాబు దక్షత, శ్రమయే కారణం. లక్ష్మీ పార్వతి రంగ ప్రవేశంతో పార్టీ మనుగడకు ముప్పు ఏర్పడినప్పుడు తన వ్యూహచతురతతో పార్టీని కాపాడి వెన్నుపోటుదారునిగా ప్రత్యర్ధుల విమర్శలను రెండు పర్యాయాలు తిప్పిగొట్టి పార్టీని అధికార తీరానికి చేర్చిన ప్రజానాయకుడు చంద్రబాబు. జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసి ప్రజల వద్దకు పాలన వంటి విధానాలతో పాటు పాలనకు సాంకేతిక సొబగులను అద్దుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన మేటి నేత చంద్రబాబు. తెలుగు వారు ఎక్కడ కష్టాల్లో ఉన్నా వారి శ్రేయస్సే ముఖ్యమన్న సందేశాన్ని ఉత్తరాంచాల్‌ యాత్రలకు వెళ్ళి అక్కడ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా గమ్యాలకు చేర్చిన బాధ్యత గల ప్రజానేత అనడానికి నిదర్శనం. క్లిష్ట పరిస్థితుల్లో ఏపీకి చంద్రబాబు ఒక్కరే సమర్ధుడు అని భావించే ప్రజలు 2014 ఎన్నికల్లో ఆయనకు పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు కూడా అలాగే పనిచేస్తూ వస్తున్నారు. 67 ఏళ్ళ వయస్సులోనూ రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతూ వస్తున్నారు. చంద్రబాబు శక్తిని, యుక్తిని, సమర్ధతను మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో చూశాం…1996లో కోస్తా జిల్లాలను ముఖ్యంగా కోనసీమ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన తుపాను సంభవించినప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా జిల్లా యంత్రాంగం కంటే ముందుగా కోనసీమ ప్రాంతానికి చేరుకుని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్నే మినీ సెక్రటరియేట్‌గా మార్చి పాలన కొనసాగించి చాలా తక్కువ వ్యవధిలో సాధారణ పరిస్థితుల్ని నెలకొల్పిన దీక్షా దక్షుడాయన. కేంద్రంలో కాంగ్రెసేతర పక్షాలు మెజార్టీ సీట్లను సాధించుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న చంద్రబాబు తనకు జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే మిన్న అని పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారంటే ఏపీ పట్ల ఆయనకున్న తపన, దార్శనికత తేటతెల్లమవుతోంది. వెనకున్న శత్రువు కంటే ప్రక్కన ఉన్న మిత్రుడే ప్రమాదకారి అన్న విషయాన్ని గ్రహించలేక గత నాలుగేళ్ళగా రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేస్తుందని చకోర పక్షిలా ఎదురుచూసి ఆఖరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఆవేదన చెంది చంద్రబాబు దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా కేంద్రమంత్రి పదవులకు తమ ఎంపీలతో రాజీనామా చేయించి ఆ తర్వాత ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చి ఇప్పుడు కేంద్రంపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు. అధికారం కోసం అవినీతి అక్రమార్కుల దుష్ప్రచారాలను, శుష్క వాగ్ధానాలను నమ్మకుండా దార్శనికత గల నాయకునిగా, పాలకునిగా భవిష్యత్‌ తరాల కోసం… రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఈ నిరంతర శ్రామికుడిని గుర్తించి బలపర్చకపోతే నష్టపోయేది మనం, మన రాష్ట్రమే. అవరోధాల్ని అవకాశాలుగా మలుచుకుని పనిచేస్తూ ప్రజల కోసం, ప్రగతి కోసం పనిచేస్తున్న చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కోసం చేస్తున్న పార్టీ అధ్యక్షుని హోదాలో గాక సీఎం హోదాలో చేస్తున్న ఈ ధర్మ పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. చంద్రబాబు 2019లో మళ్ళీ సీఎం కాకపోతే ఆయనకు వచ్చిన నష్టమేమీ లేకున్నా ఈ రాష్ట్ర ప్రగతి మాత్రం 30 ఏళ్ళు వెనక్కి పోతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. సామాన్య రాజకీయవేత్తలా వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా భావించక భావి తరాల ఉజ్వల భవిష్యత్‌యే పరమావధిగా నిరంతర శ్రామికుడిలా పనిచేస్తున్న చంద్రబాబు వెంట మనం నడిచి శక్తివంతమైన ఆంధ్రప్రదేశ్‌ సాధనలో భాగస్వామ్యులవుదాం రండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here