చర్చకు సిద్ధమే !

0
560
నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుందాం
ప్రాంతం – వేదిక – తేదీ మీరే నిర్ణయించడండి
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునికి ఉండవల్లి ఆహ్వానం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 6 : నవ్యాంధ్ర రాజధాని అమరావతి, పోలవరం, పట్టిసీమ ప్రాక్ట్‌లు, రాజధాని నిర్మాణానికి బాండ్ల ద్వారా నిధుల సమీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చెరుకూరి కుటుంబరావుతో చర్చకు తాను సిద్ధమేనని పార్లమెంట్‌ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రకటించారు.  అంతే గాక ఈ చర్చ సజావుగా, సాఫీగా, నిరాటంకంగా జరిగేలా కేవలం తాను, కుటుంబరావులు ఓ అజ్ఞాత ప్రదేశంలో నాలుగు గోడల మధ్య కూర్చుని  మాట్లాడుకుందామంటూ ఓ వినూత్న విధానాన్ని కూడా ఉండవల్లి సూచించి అందుకు కుటుంబరావు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ చర్చలో తామిద్దరూ మాట్లాడుకున్న విషయాలపై ఎవరికి  వారు ఓ సీడీని విడుదల చేసి సారాంశాన్ని ప్రజలకు తెలియజేయవచ్చని ఆయన సూచించారు. ఆ సారాంశం ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని ఆయన అన్నారు.  ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి బాండ్ల విడుదల, విక్రయం తీరుపై తాను సంధించిన ప్రశ్నలు అధికార తెలుగుదేశం పార్టీకి ఆగ్రహం తెప్పించినట్లు అర్ధమవుతోందని, వాస్తవాలు మాట్లాడితే ఉలుకుతో వారు తనపై ఎదురుదాడి చేస్తున్నట్లు అర్ధమవుతోందని అన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని, అయితే ఆచరణ, అమలులో మాత్రం  అవినీతి, అక్రమాలతో అతిక్రమణలు జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అవినీతికి ఎవరు మాత్రం రసీదు ఇస్తారని, అంతా నిబంధనల ప్రకారం జరుగుతోందనే చెబుతారని ఆయన అన్నారు. కాగా గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై తెదేపా ముద్రించిన ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ అనే పుస్తకంలోని అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమేనని కుటుంబరావు ప్రకటించడాన్ని తాను అభినందిస్తున్నానని పేర్కొంటూ 2009 ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడిన పార్టీలన్నీ నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై విడుదల చేసిన ‘గుడ్‌ బ్యాడ్‌ అండ్‌ అగ్లీ’ అనే పుస్తకంతో పాటు ఇతర అంశాలపై కూడా తాను చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. గతంలో ఇలాగే తాను, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి బహిరంగ చర్చకు సవాళ్ళు చేసుకుంటే పోలీసులు అనుమతించకపోగా తన కదలికలపై ఆంక్షలు విధించి నిర్బంధించారని,ఈ దృష్ట్యా పోలీసులకు శ్రమ కలిగించకుండా,  దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా వినూత్నంగా కుటుంబరావు రాజమహేంద్రవరం వచ్చినా, లేదా తనను ఆయన ఎక్కడికి రమ్మన్నా వెళ్ళి నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చించడానికి తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను చూపిస్తూ  చర్చకు తాను సిద్ధమేనని ఉండవల్లి ప్రకటించారు. అందుకు కుటుంబరావు సిద్ధపడి తేదీ, ప్రదేశాన్ని, సమయాన్ని తనకు మాత్రం తెలియజేస్తే చాలని, ఆ రోజు అన్నీ అంశాలపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆ తర్వాత చర్చల్లో తాము మాట్లాడిన సారాంశాన్ని ఎవరికి వారు పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చనన్నారు. తానేదో సీఎంపై ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడుతున్నానని తెదేపా వారు, కుటుంబరావులు ఆరోపించడం హాస్యాస్పదమని, తాను ఇప్పుడు ఏ పార్టీలోనూ లేనని, రాష్ట్రాభివృద్ధి కాముకుడిగా ప్రజాధనం సద్వినియోగమై విభజన కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాత్రమే కోరుకునే తనకు సీఎంపై వ్యక్తిగత ద్వేషం, ఈర్ష్య ఉండవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. సీఎంతో సమాన స్థాయిలో లేని తనకు ఆయన అంటే ఎందుకు కోపం ఉంటుందని ఎదురు ప్రశ్న వేశారు.  అయితే తన మాట తీరే  వేరుగా ఉండి వెటకారంతో మాట్లాడుతున్నట్లు అంతా అనుకుంటారని, నిజానికి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలన్నదే తన అభిమతమని, ఈ కోణంలో తాను మాట్లాడే మాటలు కొందరికి ఇష్టంగా, మరికొందరికి కష్టంగా ఉంటే తానేమీ చేయలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా  ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేని తాను వైఎస్‌తో పాటు ఎందరో మిత్రుల సహకారంతో ఇప్పటి వరకు రెండు పర్యాయాలు అసెంబ్లీకి, రెండు పర్యాయాలు పార్లమెంట్‌కు పోటీ చేసి రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యాయని, తనపై అభిమానంతో రాజకీయంగా తనను ప్రోత్సహించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే తనకు అభిమానం ఉన్న మాట వాస్తవమే అయినా ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డితో తనకెలాంటి సంబంధాలు లేవని, తాను ఏ పార్టీలో చేరడం లేదని, ఈ విషయంలో తెదేపా నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.  వైఎస్‌ పాలనలో అవినీతి కనపడలేదా అని తెదేపా వారు తనను ప్రశ్నిస్తున్నారని, అధికారంలో తెదేపా ఉన్నా, కాంగ్రెస్‌ ఉన్నా నిప్పులా, సచ్ఛీలంగా పాలన సాగుతోందని, మద్యం ధరలు, విక్రయాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని తాను అనడం లేదని, అధికారంలో ఎవరు ఉన్నా ఇలాగే ఉంటోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారికి కొందరు ధన సహాయం చేయడం, దాని ద్వారా పార్టీ కార్యకలాపాలు కొనసాగడం అనాదిగా వస్తూనే ఉందని, అయితే కలక్షన్‌తో పాటు కరప్షన్‌ పెరిగిపోవడం ప్రమాదకరమని, వైఎస్‌ హయాంలో కలక్షన్‌ తప్ప కరప్షన్‌ లేదని, ప్రస్తుత తెదేపా హయాంలో కలక్షన్‌తో పాటు కరప్షన్‌ విపరీతంగా పెరిగి వ్యవస్థ అవినీతిమయమవుతోందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.  గతంలో వైఎస్‌ హయాంలో ఉన్న కాంట్రాక్టర్లు, వ్యక్తులే ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఉన్నారని, అందుకు తెదేపా వారు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. అంతే గాక శాసనవ్యవస్థకు, రాజకీయ వ్యవస్థకు కూడా తెదేపా హయాంలో తేడా లేకుండా పోతుండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుని హోదాలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించవలసిన కుటుంబరావు అధికార పార్టీ ప్రతినిధిగా మాట్లాడటం బాధాకరమని, అలాగే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించవలసిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెదేపా ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఇటీవల సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం చూస్తే ఆవేదన కలుగుతోందని, అయితే ఈ విషయాలపై తాను మాట్లాడటం లేదని, అన్నీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని పిడి వాదం చేస్తున్న తెదేపా నేతల తీరునే ప్రశ్నిస్తున్నానన్నారు. తాను కాగితం పులినని తెదేపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వారు రియల్‌ టైగర్లు అయితే తాను చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. విలేకరుల సమావేశంలో చెరుకూరి రామారావు, అల్లు బాబి, జామిశెట్టి గాంధీ, నందం కుమార్‌ రాజా, పసుపులేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here