చెట్టు పేరు – తాత నెయ్యి

0
535
యిల్లంతా ఒకటే హడావిడిగా ఉంది. ముందు బాబీగాడు పరిగెడుతుంటే వెనకాలే వాడిని పట్టుకో డానికి గిరీశం వెంటపడుతున్నాడు. మొత్తానికి యిదేదో టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంది. వెంకటేశం వచ్చేసరికి కనిపించిన దృశ్యమిది. వెంకటేశానికైతే యిదేవీ అర్థం కాలేదు. అయినా ఎందుకయినా మంచిదని చటుక్కున లోపలికి పోయి బాబీగాడిని పట్టేసుకున్నాడు. ఈలోగా గిరీశం దగ్గరకొచ్చేశాడు. వెంకటేశం ఆసక్తిగా ”ఏంటి గురూగారూ… దొంగ తనంలాంటిదేవయినా చేశాడా?” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి ”దాదాపు అలాంటిదే అనుకో. పరీక్షల్లో కాపీ కొట్టాడు. లేకపోతే అన్నిటిలో నూటికి 95 మార్కులొచ్చాయి. అసలు మొన్న పరీక్షలప్పుడు ఏం చేశాడని… ఆ టీవీ చూస్తూ గడిపేశాడు. యిన్ని మార్కులెలా వచ్చాయని?” అన్నాడు. వెంకటేశానికి అదీ నిజమేననిపించింది. దాంతో బాబీగాడి వైపు తిరిగి ”ఏరా.. కాపీ కొట్టావా?” అన్నాడు. దాంతో బాబీగాడు ”ఛ…ఛ…లేదు బాబాయ్‌.. నిజంగా అవన్నీ నాకొచ్చిన మార్కులే” అన్నాడు. ఈసారి గిరీశం ”మరేం చదవకుండా అన్నేసి మార్కులు ఎలా వచ్చాయిరా?” అన్నాడు. ఈసారి బాబీగాడు ”అవును. ఏం చదవలేదు. పరీక్షల్లో అడిగిన ప్రశ్నలూ నాకు రానివే. అందుకే నేను ‘చంద్రగుప్తుడి పాలన గురించి రాయమంటే ‘చంద్రగుప్తుడి  పాలన చక్కగా సాగింది.’ అని మొదలెట్టి తర్వాత మీరిద్దరూ మాట్లాడుకునే మాటలూ, యింకా టీవీ సీరియల్స్‌  కథలూ శుభ్రంగా పేజీలకి పేజీలు రాసి పారేశాను. అన్ని పరీక్షలూ యింతే. మరి దిద్దేవాళ్ళు ఏవనుకున్నారో ఏంటో అన్నీ 95లు వేసేశారు” అన్నాడు. దాంతో గురుశిష్యులిద్దరూ అదిరిపోయి నోరెళ్ళబెట్టారు. ఈలోగా ఎందుకయినా మంచిదని బాబీగాడు అక్క డ్నుంచి తుర్రుమన్నాడు. ఈసారి గిరీశం ”చూశావుటోయ్‌ వెంక టేశం… ఏ సరుకూ లేకపోయినా ఉన్నట్టే భ్రాంతి కలిగిస్తే చాలు. దున్నేయొచ్చు” అన్నాడు. వెంకటేశం అవునన్నట్టుగా తలూపాడు. యింతలో గిరీశం ”అయితే ఈ వారం ప్రశ్నేదో దీనిమీదే లాగిం చేద్దాం. రాజకీయాల్లో యిలా సత్తా లేకపోయినా దున్నేసే వ్యవహారం గురించి చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం ఆలోచించి చిన్న ఊహలాంటిది చెప్పడం మొదలెట్టాడు.
—–
వెంకటేశానికి హఠాత్తుగా దురదలు మొదలయ్యాయి. అవేవీ అర్జంటుగా డాక్టర్‌ దగ్గరకెళ్ళి చూపించుకోవలసిన దురదలు కాదు. రాజకీయాల్లో దూరాలన్న దురదలు. యింకేముంది… ఊళ్ళో సభొకటి ఏర్పాటు చేశాడు. అసలే తనంటే ఊళ్ళో బోల్డంత మంచి పేరుందని వెంకటేశం నమ్మకం. తన సభకి తండోపతండాలుగా జనా లొస్తారని లెక్కలేశాడు. అయితే అలాగేం జరగలేదు. ఏదో వందల్లో  వచ్చారంతే. దాంతో వెంకటేశం చాలా నీరసం పడిపోయాడు. ఏదో అలా అలా మాట్లాడాననిపించాడు. మరి తన సభకి జనాల్ని రప్పిం చడం ఎలాగా అని ఆలోచనలోపడ్డాడు. అప్పుడొచ్చిందా ఆలోచన. దాంతో గబగబా పాపారావు దగ్గరికి పరిగెత్తాడు. పాపారావంటే ఎవరో కాదు. ‘కళాకుటీర్‌’ అనే సంస్థ పేరుతో సన్మానాలవీ చేసి జనాల్ని ప్రమోట్‌ చేసే బాపతు. అలాంటి పాపారావు దగ్గరకెళ్ళి తేలిగ్గా ”ఓస్‌ అంతేనా… ముందు మీ తాతముత్తాతల వివరాలవీ చెప్పు” అన్నాడు. వెంకటేశం యింత నోరేసుకుని ఆ వివరాలేవో చెప్పాడు. మర్నాడే ఊరిలో కొన్ని బోర్డులు వెలిశాయి. ‘అగ్నిహోత్రావధాన్లు గారికి స్వయానా ముని మన వడయిన వెంకటేశం గారు రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. తన ముత్తాతగారిలాగే ఆయనా నిప్పులాంటివాడని అందరికీ తెలిసిందే. ఆయన ఆశయం కూడా అవినీతిరహిత సమాజాన్ని స్థాపించడం. ఆ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఆయన ప్రసంగిస్తారు. రావలసింది.. యిలా సాగాయవి. మొత్తానికి అనుకున్నరోజు రానే వచ్చింది. యిక జనాలయితే బ్రహ్మాండంగా వచ్చారు. యిక వెంకటేశమయితే  తనదైన శైలిలో మాట్లాడి అందర్నీ కట్టిపడేశాడు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చింది అవినీతి రహిత సమాజం కోసం. దాని కోసం ఓ ఉద్యమం నడపబోతున్నా. అయితే అందు కోసం నేనెవరినీ ఏ నిధులూ అడగదలుచు కోలేదు. అయితే నేను చేపట్టే ఉద్యమం మన వ్యవస్థకి ఉపయోగకరమని మీరు భావిస్తే స్వచ్చం  దంగా సాయం చెయ్యండి” అన్నాడు. వెంకటేశం మాట లేవో అందరినీ సూటిగా తాకాయి. దాంతో ఆ మీటింగేదో పూర్తయ్యే సరికి అక్కడ పెట్టిన డిబ్బీలన్నీ డబ్బులతో నిండిపోయాయి. ఆ ఒక్క మీటింగ్‌లోనే కాదు. ఆ రోజు నుంచీ జిల్లావ్యాప్తంగా జరిగిన అలాంటి యింకొన్ని మీటింగ్‌లలోనూ అదే స్పందన. పైగా ‘అపర చాణక్యుడు లాంటి గిరీశం గారి మనవడు గిరీశం కూడా వెంకటేశం వెనక ఉన్నా రంట’ అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. దాంతో జనాలు యింకా హుషారుగా తరలిరావడం, డిబ్బీలు నిండడం మామూలైపోయింది.
—-
”అది గురూగారూ.. చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”ఆ…బాగుందోయ్‌… మొత్తానికి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే వ్యవహారం అన్నమాట. అయినా మనలో మాట. మీ ముత్తాత అగ్ని హోత్రావధాన్లు గారు అంత గొప్ప వ్యక్తేం కాదు. కొంచెం కక్కుర్తి వ్యవ హారమే” అన్నాడు. దాంతో వెంకటేశం గుర్రుమని ”ఆ…ఆ మాటకొస్తే మీ తాత గిరీశం గారు మాత్రం ఎన్ని లీలలు చేశారని…” అన్నాడు. దాంతో గిరీశం కంగారుపడి ”సర్లే..సర్లే.. యిప్పుడా చర్చలు ఎందు కంట… యిందాక నువ్వు చెప్పిందాన్ని కొంచెం వాస్తవాలకి అన్వయించి చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఈ తరహా వ్యవహారాలు అటు రౌడీయిజంలోనూ, యిటు రాజకీయాల్లోనూ బాగా కనిపిస్తున్నాయి.  ఆ మధ్య ఎన్‌కౌంటరైపోయిన  నయీమ్‌కి అనుచరులమంటూ ఎవరెవరో దందాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. యిక రాజకీయాల్లోకి వస్తే… ఈ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే వ్యవహారం అనబడే వారసత్వ రాజకీయాలు బాగా కనిపిస్తున్నాయి. తమలో అంత సత్తా లేకపోయినా చాలామంది నాయకులు తమ తాతల పేరో, తండ్రిపేరో చెప్పి నెట్టు కొట్టేస్తుంటారు. వందేళ్ళ పార్టీనే తీసుకుంటే.. యిందిరాగాంధీ ఎంత పవర్‌ఫుల్‌ లీడరని… యిప్పుడు మూడో తరం వచ్చేసరికి ఆ వారసులు ఎంతమాత్రం ప్రభావం చూపించలేని నామమాత్రులుగా మిగిలి పోయారు. అయినా తమ నాన్నమ్మ పేరు చెప్పుకుని  లాగించేస్తున్నారు. అన్ని పార్టీలలో యిలాంటి పరిస్థితి కన్పిస్తోంది. చెప్పేదేంటంటే… ఎవరయినా యిలా వారసత్వంతో కాకుండా తమ టాలెంట్‌ నిరూపించు కోగలిగితేనే రాణించేది” అంటూ తేల్చాడు. అంతా విన్న గిరీశం ”బాగా చెప్పావోయ్‌” అన్నాడు చుట్ట అంటించుకుంటూ. వెంకటేశం తలూపి పైకి లేస్తూ ”ఆ…నా సమాధానం దేవుంది గానీ… రేపెలాగా నేను రాజ కీయ ఆరంగేట్రం చేస్తా కదా. ఈలోగా మా ముత్తాత, మీ తాతల ఫొటోలు సంపాదించి పెట్టకూడదూ.. నాకు పని జరుగుతుంది” అన్నాడు…!
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి