చేదు మందు

0
198
మనస్సాక్షి
వెంకటేశానికి ఎప్పట్నుంచో ఓ కోరిక అలాగే ఉండిపోయింది…..అది డాక్టర్‌ కావాలని. తమ ఊళ్ళో సరయిన డాక్టర్‌ లేడాయె. అప్పుడెప్పుడో తన చిన్నప్పుడో డాక్టరుండేవాడు గానీ తర్వాత గుటుక్కుమన్నాడు. అప్పట్లో ఆ డాక్టర్‌ని అంతా దేవుడిలా చూసేవారు. అదిగో… అప్పట్నుంచీ వెంకటేశానికి డాక్టరయి జనాలకేదో  సేవ చేసేయ్యాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోలేక, డొనేషన్‌ కట్టలేక ఆ లైన్‌ వదిలేశాడు. దాంతో ఆ కోరికేదో అలాగే ఉండిపోయింది. అంతే యిన్నేళ్ళకీ మళ్ళీ ఆ కోరిక తీరే దారొకటి దొరికింది.
ఆ రోజు వెంకటేశానికి సింహాచలం నుంచి ఫోనొచ్చింది. సింహాచలమంటే వెంకటేశానికి చిన్నప్పటి ఫ్రెండే. అయితే  కొన్నేళ్ళుగా టచ్‌లో లేడు. మళ్ళీ యిన్నాళ్ళకీ ఫోన్‌ చేశాడు. మిత్రులిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్నాక అప్పుడు సింహాచలం అసలు విషయం చెప్పాడు. ” బి ఎస్‌ కన్సల్టెన్సీ పేరు విన్నావా” అన్నాడు. దానికి వెంకటేశం ”వినకపోవడం ఏట్రా” అదేదో ఫిలిప్ఫీన్స్‌లో 15 లక్షలకే ఎంబీబీఎస్‌ సీటు యిప్పించే సంస్థ కదా” అన్నాడు. అవతల నుంచి సింహాచలం అవునని” యింతకీ ఆ సంస్థ నాదేరా.. బిఎస్‌ అంటే బుర్రా సింహాచలం  అనిలే” అన్నాడు.దాంతో షాకవడం వెంకటేశం వంతయింది. యింతలో సింహాచలం ” మరేం లేదురా.. యింతకాలం ఫిలిప్ఫీన్స్‌కి స్టూడెంట్స్‌ని పంపి ఎంబీబిఎస్‌ చేయిస్తున్నా. యిప్పుడు  మా బిజినెస్సేదో  దక్షిణ కొరియాకి ఎక్స్‌పేండ్‌ చేద్దామనుకుటున్నా.. యిక్కడే నీ సహాయం కావాల్రా” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టుగా ” అందులో నేను చేసేదేం ఉంటుంది?” అన్నాడు. దానికి సింహాచలం ‘ మరేం లేదురా.. నా బిజినెస్‌ అయితే బాగానే జరుగుతుంది గానీ  యిలా మనవాళ్ళని వేరే దేశం పంపినప్పుడు అక్కడ వీళ్ళు బాగోగుల గురించి సమస్యగా ఉంటుంది. అక్కడ మన వాళ్ళు ఎవరూ ఉండరాయె. ఈ సారి వాళ్ళు వెళ్ళేటప్పుడు నువ్వూ వెడితే బాగుంటుంది. వయో పరిమితి లేదు. వాళ్ళతో ఎంబీబిఎస్‌ చదువుకోవడానికి ఫ్రీగా సీటు ఏర్పాటు చేస్తా. ఖర్చూ నాదే” అన్నాడు. అది వినగానే వెంకటేశం ఆనందాశ్చర్యాలకి లోనయ్యాడు. వెంటనే తన అంగీకారం తెలిపేశాడు కూడా. యింకో నెలలో వెంకటేశం డాక్టరీ చదవడానికి దక్షిణ కొరియాలో అడుగుపెట్టాడు.
——–
 సంవత్సరాలు గడిచాయి.
 వెంకటేశం దక్షిణ కొరియాలో మెడిసిన్‌ చేసి వచ్చేయ్యడం, యిక్కడ యిండియాలో ఎంసిఐ పెట్టిన పరీక్ష పాసయి డాక్టరనిపించుకోవడం జరిగాయి. యిక ఆ తర్వాత గవర్నమెంట్‌ హాస్పిటల్లో డాక్టర్‌గా చేరి కొత్త జీవితం ప్రారంభించాడు.
——–
వెంకటేశం బొత్తిగా నిరాశపడిపోయాడు.
అసలు తన ఊహించుకున్న దానికీ యిక్కడ వాస్తవంగా జరుగుతున్న దానికీ ఏ మాత్రం పొంతన లేదు. డాక్టరయి జనాలకి చాలా చాలా చేద్దామనుకుంటే  యిక్కడేవీ కుదిరి చావడం లేదు. చాలా దైన్యంతో వచ్చే పేషంట్లని చూస్తుంటే వాళ్ళకి ఏదయినా చేయాలనిపిస్తుంది. ఏం చేయాలన్నా సరయిన పరికరాలూ, సదుపాయాలు ఉండవాయె. మందులూ అంతంత మాత్రమే. యిదంతా ఒక్క కోణం. ఆ రోజు యింకో కోణం కూడా డాక్టర్‌ వెంకటేశానికి ఎదురయింది. ఆ రోజు ఎప్పటిలా డాక్టర్‌ వెంకటేశం తనకీ కేటాయించిన ఛాంబర్‌లో ఉండగా ఓ ముగ్గురు లోపలికొచ్చారు. అందులో ఓ శాల్తీ కొంచెం వీక్‌గా ఉంటే రెండు శాల్తీలు బలంగా ఉన్నాయి. వెంకటేశం సమస్య ఏంటన్నట్టుగా చూశాడు. దాంతో వారిలో బాబులు అనే శాల్తీ ” మా వాడి వొంట్లో నీరసంగా  ఉంది. బలానికి మందులు రాయాలి” అన్నాడు. అయితే వాళ్ళలా తనని ఏం మందులు రాయాలో డిక్టేట్‌ చేయడం వెంకటేశానికి బొత్తిగా నచ్చలేదు. అయినా వాళ్ళతో గొడవెందుకులే అని బీ కాంప్లెక్స్‌ టాబ్లెట్స్‌ రోజుకొకటి చొప్పున 30, యింకా విటమిన్‌ డి వారానికొకటి చొప్పున 4 రాశాడు. దాంతో బాబులు ‘ యిదిగో డాక్టరూ…. ఈ బలం బిళ్ళలు రోజుకి ఒకటి కాదు అరడజను వేసుకుంటాడు. అలా రాయి” అన్నాడు. దాంతో వెంకటేశం ‘అదెలా కుదురుద్దీ.. అవీ రోజుకొకటి వేసుకోవాలి” అన్నాడు. ఈసారి బాబులు ” యిదిగో డాక్టరూ..నీకు గంగారాం తెలుసా? అన్నాడు. దాంతో వెంకటేశం బుర్ర గోక్కుని ” తెలీదే..” అన్నాడు. దాంతో వచ్చినోళ్ళు అదేదో కొంపలంటుకుపోయినంత యిదిగా చూశారు. దాంతో వెంకటేశం కంగారుపడ్డాడు. యింతలో బాబులు ” మేము ఆ గంగారాం మనుషులమే” అన్నాడు. దాంతో వెంకటేశం ఏమనుకున్నాడో! ఆ బీ కాంప్లెక్స్‌ బిళ్ళలు 180, యింకా విటమిన్‌ డి 3 బిళ్ళలు 30, ఓ అరడజను టానిక్కూలూ, ఓ అర డజను ప్రొటీను పౌడర్లు రాసిచ్చాడు. ఉచితంగా వాళ్ళ స్టోర్‌ నుంచి పట్టుకుపోయారు. యింకో అరగంట తర్వాత అటెండరు ఓ పేపరు పట్టుకొచ్చాడు. దాంట్లో లోపల స్టోర్‌కి ఏం మందులు ఇండెంట్‌ పెట్టాలో రాసిన లిస్టుంది. ఆ లిస్టేదో యిచ్చి ” దీని మీద సంతకం పెట్టమన్నారు” అన్నాడు. ఆ లిస్ట్‌ చదివిన వెంకటేశం అదిరిపోయి ”యిదేంటీ.. యిప్పుడు మనకి చికున్‌ గున్యా పేషంట్లు రావడం లేదు కదా. అలాంటప్పుడు దానికి వాడే టాబ్లెట్స్‌  వంద బాక్స్‌లెందుకూ. యిదిగో యివి కేన్సర్‌ మందులు. చాలా ఖరీదుంటాయిలే. అయినా మన హాస్పిటల్లో కేన్సర్‌ వైద్యం లేదు కదా..” అన్నాడు. దాంతో ఆ అటెండరు జాలిగా చూశాడు. ఈలోగా వెంకటేశం మిగతా మందుల వివరాలు కూడా చూశాడు. అసలా మందులేంటో, అన్నేసి వందల బాక్స్‌లేంటో అంతా అయోమయంగా అనిపించింది. దాంతో సంతకం పెట్టలేదు. అప్పుడు అటెండరు ” సంతకం పెట్టయ్యండి సారూ.. ఏదో పెద్దోళ్ళ వ్యవహారం. మీరు సంతకం  పెట్టకపోతే రేపు మీ ప్లేసులో వచ్చే డాక్టర్‌ పెడతాడు. మీరు ఏ శ్రీకాకుళం అవతల ఒరిస్సా బోర్డరు అడవుల్లోలోనో పేషంట్లని చూసుకోవాలి” అన్నాడు. దాంతో ఏడ్చుకుంటూ వెంకటేశం ఆ సంతకమేదో గిలికాడు.
——–
 రెండు నెలల తర్వాత….
డాక్టర్‌ వెంకటేశం తన ఛాంబరులో ఉండగా ఓ పేషంటుని తీసుకొచ్చారు. ఆ పేషంటు డెంగీతో బాధపడుతున్నాడు. మొహంలో ప్రేతకళదో కన్పిస్తోంది. దాంతో వెంకటేశం టెస్టులవీ చేయించి, మందులు రాశాడు. అయితే వాళ్ళు స్టోర్‌కి వెళ్ళి అవేమీ లేవని వెనక్కి వచ్చి చెప్పారు. దాంతో వెంకటేశం అటెండరుని పిలిచి ” ఏంటీ.. లక్షల విలువయిన మందులు ఆర్డర్‌ పెట్టాం కదా. స్టోర్‌లో వీళ్ళకి కావలసిన మందులే లేవా” అన్నాడు. దాంతో అటెండర్‌ యింకో సారి వెంకటేశం మీద జాలిపడి ” సారూ..వీళ్ళకి కావల్సిన మందులేవీ స్టోర్‌లో లేవు గానీ.. కొనుక్కోమనండి అంతకీ కావలిస్తే మీ జేబులో డబ్బుల్తో తెప్పించండి” అన్నాడు. దాంతో వెంకటేశం తలపట్టుకున్నాడు.
——–
”అది గురూ గారూ. నాకొచ్చిన కల. అయినా నాకీ కలెందుకు వచ్చినట్టంటారు?” అన్నాడు వెంకటేశం. ఈలోగా గిరీశం ఓ చుట్ట  అంటించుకుని ” ఏవీ లేదోయ్‌. ఈ మధ్య 300 కోట్ల ఈఎస్‌ఐ మందుల కుంభకోణం జరిగింది కదా. అదేదో  నీ బుర్రలో దూరినట్టుంది. యిదంతా కుళ్ళిపోతున్న మన వ్యవస్థకీ సింబాలిజం అనుకో” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టు చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ” మరేం లేదోయ్‌.. ఓ పక్కన గవర్నరమెంటు హాస్పిటల్స్‌లో  కనీస సదుపాయాలూ, మందులు లేక ఎందరో  పేదలయిన పేషంట్లు యిబ్బందులు పడడం చూస్తున్నాం. యింకో పక్క అవే హాస్పిటల్స్‌లో వందల కోట్లు స్కామ్‌లు జరగడం చూస్తున్నాం. ఏం వ్యవస్థ యిని !” అన్నాడు. దాంతో వెంకటేశం ” అలాగయితే గురూ గారూ.. నా కలలో నేను  యిష్టం లేకపోయినా సంతకం పెట్టేశాను కదా. నేనూ నేరస్తుడినేనా” అన్నాడు. దాంతో గిరీశం ” అదే చెబుతున్నానోయ్‌.. యిలాంటి  స్కాముల్లో అసలయిన సూత్రధారులు కొందరుంటారు. యిక మరికొందరు నీలాటోళ్ళు భయపడో, తప్పని పరిస్థితుల్లోనో ఆ నేరంలో పాలు పంచుకుంటారు. రేపు ఈ స్కాం బయటపడితే వాళ్ళూ నేరస్తులుగా మిగిలిపోతారు. యిలాంటి పరిస్థితే  మొన్న థాయిలాండ్‌లో ఓ జడ్జి గారికి కూడా వచ్చింది. ఏ ఒత్తిళ్ళకు లోబడో తీర్పిచ్చేసి, తర్వాత ఆ మానసిక సంఘర్షణతో  ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. ఏతావాతా చెప్పేదేంటంటే వ్యవస్థ సమూలంగా ప్రక్షాళనం చేయాలి. లేకపోతే  ఎందరో అమాయకులు బలయిపోవడమో, అర్హులయిన ఎవరెవరికో చేరవలసిన ఫలాలు యింకెవరో అవినీతి తిమింగలాలకీ చేరటమో జరగొచ్చు” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here