చైతన్యంతోనే ప్లాస్టిక్‌ వినియోగాన్ని ఆపగలం 

0
305
ప్లాస్టిక్‌ రహిత గోదావరి కృషీవలులకు ఓఎన్జీసీ ప్రశంస  – అభినందించిన కమిషనర్‌
రాజమహేంద్రవరం, జులై 2 :  ప్రజల్లో చైతన్యం వచ్చి ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా మానేస్తే గోదావరితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మేలు జరుగుతుందని కార్పొరేషన్‌ కమీషనర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ అన్నారు. ఓఎన్‌జిసి రాజమహేంద్రవరం అసెట్‌ మేనేజర్‌, ఇడి డిఎంఆర్‌ శేఖర్‌ నేతృత్వంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి రేవుల్లో ప్లాస్టిక్‌, గుర్రపుడెక్క తొలగించడానికి సహకరించిన వారందరికి కమీషనర్‌ సోమవారం బేస్‌ కాంప్లెక్స్‌లో ధృవీకరణ పత్రాలు అందచేసారు. ఓఎన్‌జిసి కష్టపడి అందరి సహకారంతో ప్లాస్టిక్‌ తొలగిస్తే మళ్లీ 15 రోజుల్లో యథాతధ స్థితి వచ్చిందన్నారు. దీన్ని నిర్మూలించాలంటే ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపితే తప్ప సత్ఫలితాలు రావన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గోదావరిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలవకుండా చేస్తేనే నదిని కాపాడేందుకు  వీలవుతుందన్నారు. భవిష్యత్తులో కూడా మళ్లీ ఒఎన్‌జిసి సహకారాన్ని కోరతామన్నారు. ఇడి డిఎంఆర్‌ శేఖర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత గోదావరికి సహకరించిన ఓఎన్‌జిసి మహిళా సమితి, ఎస్‌పిఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఆఫ్‌, నైట్‌ షెల్టర్‌ పొందుతున్న వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. 15 రోజులు పాటు స్వచ్ఛభారత్‌, స్వస్థ భారత్‌ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. ప్రజల్లో స్వచ్ఛఅభియాన్‌పై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, పలురకాల పోటీలు, ఉచిత వైద్య శిబిరాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి, నమ్మా టాయిలెట్లకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అనంతరం కమీషనర్‌ సుమిత్‌కుమార్‌ను జ్ఞాపిక, దుశ్శాలువాతో సత్కరించారు. స్వచ్ఛప్లాస్టిక్‌కి సహకరించిన అధికారులు భాషా, డిఎస్‌కె రాజు, ఎన్‌.ఆనంద్‌, జి.శ్రీహరి, మల్లిఖార్జునరావు, ఎవిఎస్‌ నాగరాజు, జివివిఎస్‌ఎన్‌ రాజు, డి.ఆంజనేయులు, జమీల్‌పాషా, హమీద్‌ తదితరులు అభినందనలు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here