జంగాల కాలనీ…..కన్నీటి సంద్రం

0
381
కొంతమూరులో అగ్ని ప్రమాదం – 110 పూరిళ్ళు దగ్ధం
ఆస్తి నష్టం రూ. 50 లక్షలు – కట్టుబట్టలతో బయటపడిన బాధితులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 7 : నగర శివారు కొంతమూరు జంగాల కాలనీలో ఈ ఉదయం సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 110 పూరిళ్ళు దగ్ధమయ్యాయి. ఉదయం 8.30  గంటల ప్రాంతంలో ఒక పూరింటి నుంచి వెలువడిన అగ్నికీలలు క్షణాల్లో సమీప ఇళ్ళను కూడా కబళించడంతో ఆ ప్రాంతమంతా బూడిదకుప్పగా మారింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో ఇళ్ళలో ఉన్న వారు భయాందోళనలకు గురై కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. ఇళ్ళలోని సామగ్రిని బయటకు తెచ్చేలోగా అవి బూడిదగా మారాయి. ఆస్తి నష్టం రూ. 50 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.  అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.  ఈ ప్రమాదంలో 110 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతి కావడంతో రెక్కాడితే గాని డొక్కాడని వారు  కన్నీరుమున్నీరుగా విలపించారు. కొన్ని ఇళ్ళలో గ్యాస్‌ సిలెండర్లు పేలడంతో సమీప నివాశితులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎం.పి. మిడియం బాబూరావు, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎన్‌.వి.శ్రీనివాస్‌ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామని గోరంట్ల హామీ ఇచ్చారు. రూరల్‌ తహసీల్దార్‌ భీమారావు, రెవెన్యూ ఇనస్పెక్టర్‌ కుమారి, ఇతర అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.