జగన్‌ పాలనపై ప్రజల్లో కానరాని సంతృప్తి

0
194
రుణ మాఫీలో రైతులకు నమ్మకద్రోహం
మాటలకు.. చేతలకు పొంతనలేని పాలన : గన్ని కృష్ణ ధ్వజం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26:  జగన్మోహనరెడ్డి నాలుగు నెలల పాలనపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని, రద్దుల ప్రభుత్వంగా పేరొందిన జగన్‌ సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు విడిచిపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం రైతులకు షాకిచ్చిందని, రైతు ప్రభుత్వం అని పదేపదే చెప్పే జగన్‌ వారికి నమ్మకద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేకున్నా రైతు రుణ మాఫీని చంద్రబాబు ప్రకటించారని, దీనిపై జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేసి అది సాధ్యం కాదని ప్రకటనలు చేశారని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సహాయం కోరితే వారు నిరాకరించారని,అయితే ఇచ్చిన మాటకు చంద్రబాబు కట్టుబడి ప్రతి ఏటా రైతు రుణమాఫీ చేశారని అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు అనుసరించాయని గుర్తు చేశారు. మూడేళ్ళ పాటు రూ.14,124 కోట్లు రద్దు చేసిన చంద్రబాబు నాలుగో ఏటా రూ.374 కోట్లు రద్దు చేసి మిగిలిన రూ.7,900 కోట్ల బకాయికి గాను రైతులకు బాండ్లు అందించిందన్నారు.అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ఆ బాండ్లకు సంబంధించిన రుణమాఫీకి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడం దారుణమన్నారు. జగన్‌ సర్కార్‌ రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చిందని,అయితే కేంద్రప్రభుత్వం రైతులకు ఇచ్చే రూ.6,000తో రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 కలిపి ఇస్తాననడం దుర్మార్గమని మండిపడ్డారు.
వారి నోట అవినీతి రహిత పాలన మాటలు ప్రజల దురదృష్టం
అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి కోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్‌, విజయసాయిరెడ్డి నోట అవినీతిరహిత పాలన అనే మాటలు వినడం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిన సిఎం ఆంధ్రప్రదేశ్‌కు ఉండటం దౌర్బాగ్యమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఐటి శాఖ ద్వారా లాండ్‌ సర్వే జరిపించారని, అయితే జగన్‌ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ల్యాండ్‌ సర్వే జరిపించాలని నిర్ణయించి టెండర్లు పిలిచారని అన్నారు. తక్కువకు టెండర్లు వేసిన వారికి కాకుండా ఎక్కువకు వేసిన వారికి ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఐటి శాఖ సెక్రటరీ అనూప్‌సింగ్‌పై ఒత్తిడి తెచ్చినా ఆయన ఒప్పుకోకపోవడంతో బదిలీ చేయలేదా అని ప్రశ్నించారు.
బ్రాండెడ్‌ మద్యం విక్రయాల వెనుక మతలబు ఏమిటో ?
 మద్యం వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వమే నిర్వహించడానికి నిర్ణయించిందని,అయితే కొన్ని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తానని ప్రకటించడంలో మతలబు ఏమిటని గన్ని ప్రశ్నించారు. ఆ కొన్ని కంపెనీలతో జగన్‌ బృందం లావాదేవీలు జరుపుకుందా అన్న అనుమానాలు అందరిలో ఉన్నాయన్నారు. పై స్థాయిలో మాత్రం అవినీతికి పాల్పడుతూ క్రింద స్థాయిలో మాత్రం నిజాయితీ అనే మాటలు వినిపించడం సరికాదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో గెలవకపోతే మళ్ళీ జైలుపాలు తప్పదని భావించి అభూతకల్పనలు చేసి అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మబలికించి గద్దె నెక్కారని అన్నారు.
పింక్‌ డైమండ్‌ మాయంపై అవాస్తవ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆరాధ్యదైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్‌ డైమండ్‌ పోయిందని, అది చంద్రబాబు నివాసంలో ఉందని కొందరు, బ్రాహ్మణి నెక్లస్‌లో ఉందని మరి కొందరు దుర్మార్గమైన ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిటిడి బోర్డు వారు కోర్టులో పరువునష్టం దావా వేశారని తెలిపారు. అయితే జగన్‌ ప్రభుత్వం టిటిడి జెఈఒ గా నియమించిన ధర్మారెడ్డి అసలు టిటిడికి పింక్‌ డైమండ్‌ లేదని స్పష్టం చేశారని అన్నారు. జగన్‌ సర్కార్‌ ఇటీవల భారీ స్థాయిలో టిటిడి పాలకమండలిని నియమించిందని, అందులో ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువ అవకాశం కల్పించారని అన్నారు. జగన్‌ నియామకం చేస్తే తెలంగాణకు చెందిన టిటిడి సభ్యులు కెసిఆర్‌ని కలిసి కృతజ్ఞతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో వేరే రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని నియమిస్తే గగ్గోలు పెట్టిన జగన్‌ బృందం ఇప్పుడు మహరాష్ట్రకు చెందిన నలుగురిని నియమించడంపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జయలలిత సిఫార్సు మేరకు శేఖరరెడ్డి అనే వ్యక్తిని టిటిడి బోర్డు సభ్యునిగా నియమించారని, అయితే పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆయన వద్ద పెద్ద స్థాయిలో నగదు దొరకగా టిటిడి బోర్డు మెంబర్‌ పదవి కోసం నారా లోకేష్‌కి శేఖరరెడ్డి రూ. వంద కోట్లు ఇచ్చారని చెప్పిన వైసిపి నాయకులు ఇప్పుడు టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా జగన్‌ నియమించడం వెనుక ఎన్ని కోట్లు చేతులు మారాయో చెప్పాలన్నారు.
అవినీతి జరగలేదని కేంద్రం చెప్పినా ఇదేం తీరు ?
పిపిఎ వలన అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఎక్కవగా ఉండటం వలన పరిశ్రమలు రావడం లేదని సిఎం జగన్‌ ప్రధానికి లేఖ రాసారని అన్నారు.దీనిపై కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రి ఆర్‌.కే.సింగ్‌ స్పందిస్తూ మిగతా రాష్ట్రాల కన్నా ఏపిలోనే ధరలు తక్కవని, ఎక్కడా అవినీతి జరగలేదని అన్నారు.రాష్ట్రానికి రూ. 5500 కోట్లు నష్టం వాటిల్లిందని జగన్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారని,వెంటనే పిపిఎను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా అది కుదరదని చెప్పినా ఇంకా అడగడం విడ్డూరంగా ఉందన్నారు.
మేథావులు, ఉద్యమకారులు నోరు మెదపరేమీ?
జగన్‌ అసమర్ధ పాలనపై మేధావులు, ఉద్యమకారులు మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. బోటు ప్రమాదంలో అసలు ఎంతమంది చనిపోయారో, బోటు వెలికితీతకు జాప్యం ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. దీనిపై మాజీ ఎంపి హర్షకుమార్‌ వ్యాఖ్యలు చేస్తే మండిపడిన పర్యాటక మంత్రి మళ్ళీ మౌనం దాల్చారని అన్నారు. గతంలో మంటూరు వద్ద బోటు ప్రమాదం జరిగితే అప్పటి సిఎం చంద్రబాబు దగ్గరుండి బోటు వెలికితీయించారని, ఆ సంఘటన ప్రభుత్వ హత్యలన్న వైసిపి నాయకులు దీనిని ఏమనాలో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తీవ్ర వరదల మధ్య బోటు ప్రయాణానికి ఎలా అనుమతించారో, దేవీపట్నం వద్ద ఎస్సై అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎవరు సిఫార్సు చేశారో అన్ని విషయాలు బయటకు రావాలన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు మంచిదే అయినప్పటికి తమ అస్మదీయులకు పోస్టులు కట్టబెట్టడం దారుణమని,ఈ విషయాన్ని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి బహిరంగంగా చెప్పారని అన్నారు. అభ్యర్ధుల ఎంపికలో పారదర్శకత లేదని అన్నారు.
పదోన్నతుల్లో ‘జగన్‌ సామాజిక న్యాయం’ తప్పు కాదా?
గత ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన 35 మందికి ప్రమోషన్లు ఇచ్చారని అసత్య ప్రచారాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చేసిందని, వారి నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రమోషన్లు వచ్చాయన్నారు. జగన్‌ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లో కీలక పోస్టింగ్స్‌లో వారి సామాజిక వర్గానికి చెందిన 200 మందికి కట్టబెట్టారని అన్నారు. గ్రామ వాలంటీర్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఏజెంట్లను నియమించుకున్నారని,వారి ఆగడాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు,ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌,కురగంటి సతీష్‌, బుడ్డిగ రాధా, యిన్నమూరి రాంబాబు, తంగెళ్ళ బాబి, ఉప్పులూరి జానకిరామయ్య, మళ్ళ వెంకట్రాజు, వానపల్లి శ్రీనివాసరావు, వానపల్లి సాయిబాబా, సెనివాడ అర్జున్‌, జి.కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here