జగన్‌ ప్రభుత్వం భూస్థాపితం ఖాయం

0
296
అమరావతినే రాజధానిగా కొనసాగించాలి..
జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతల డిమాండ్‌
రాజధాని గ్రామాల్లో పర్యటించాలని హర్షకుమార్‌కు ఆహ్వానం
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3 :  ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వం త్వరలో భూస్థాపితం కావడం ఖాయమని అమరావతి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నాయకులు పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా సీఎం వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.మాజీ ఎంపీ జివి హర్షకుమార్‌ను జేఏసీ నాయకులు జి.తిరుపతిరావు, సుంకర పద్మశ్రీ, కిరణ్‌  ఈరోజు కోరుకొండ రోడ్‌లో ఉన్న ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడటంతో పాటు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలని విన్నవించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతిరావు మాట్లాడుతూ ‘సేవ్‌ అమరావతి’ పేరుతో ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలు, వృద్ధులు, చిన్నారుల పట్ల పోలీసులు అత్యంత పాశవికంగా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. వైసిపికి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజధాని తరలించడానికి ఇష్టం లేకపోయినా వారు సిఎం జగన్‌ చెప్పినట్టే ఆడుతున్నారని విమర్శించారు. కొన్ని వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు 8 నెలలుగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిందన్నారు. అధికారం మారితే రాజధాని మారుస్తారా అని నిలదీసారు. రాజధాని మారుస్తారనే భయంతో మనోవ్యధకు గురై 30 మంది రైతులు చనిపోతే ఇప్పటివరకు పక్కనే నివాసం ఉంటున్న జగన్‌ వారిని పరామర్శించడానికి కూడా రాలేదన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయుల్ని పంపి రాజధాని ఉద్యమంలో చిచ్చుపెట్టేలా ప్రయత్నించడం దారుణమన్నారు. రాజధాని రాకుండా చేయడానికి ఆయనను రైతుల వద్దకు పంపారనే అనుమానం కూడా గ్రామస్తుల్లో ఉందన్నారు. సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ దళితుల ముద్దు బిడ్డ హర్షకుమార్‌పై అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైలుపాలు చేసారని ఆరోపించారు. దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాల పట్ల జగన్‌ వైఖరి గర్హనీయమన్నారు. జగన్‌ ప్రభుత్వం భూస్థాపితం ఖాయమని హెచ్చరించారు. హర్షకుమార్‌ మాట్లాడుతూ దళితులు అధికంగా నివాసం ఉంటున్న రెండు నియోజకవర్గాల్లో రాజధాని ఉండటం జగన్‌కు ఇష్టం లేదోమోననే అనుమానం కూడా తమకు కలుగుతుందన్నారు. వేల ఎకరాల భూములిచ్చిన రైతుల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానుల నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో జగన్‌ పార్టీ రాజధాని అమరావతిగా మద్ధతుగా తీర్మానం చేస్తే అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని డిమాండ్‌ చేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చామని ఇష్టమొచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే ఎలాగని నిలదీసారు. అక్కడ ఉన్న సెక్రటేరియట్‌, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను తాను గతంలోనే పరిశీలించడం జరిగిందని, వాటి  నిర్మాణం బాగుందని, అయితే దానికంటే బాగా చేస్తే కేసీఆర్‌ ఏమన్నా అంటారనో, చంద్రబాబుకి పేరొచ్చేస్తుందనో ఇంకో ప్రాంతానికి మార్చడం సమంజసం కాదన్నారు. ఇప్పుడు ధైర్యంగా జగన్‌ రైతులు, ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదని వారు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయమన్నారు. సమావేశంలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్‌, నాయకులు ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, నలబాటి శ్యామ్‌, గోలి రవి, కె.కుమారి, పట్టాభి, శ్రీనివాసరావు, పిశిపాటి రవీంద్ర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here