జమ్ము- కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు 

0
111
కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటన – రాజ్యాంగంలో అధికరణ 370 రద్దు
వ్యతిరేకించిన మెజార్టీ రాజకీయ పార్టీలు – దేశంతో కాశ్మీరుని అనుసంధానించామన్న కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 5 : ఉగ్రవాదుల కదలికలతో, సరిహద్దు దేశం పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలతో అను నిత్యం యుద్ధ వాతావరణంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జమ్మూ కాశ్మీరు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత నాలుగైదు రోజులుగా ఆ రాష్ట్రంలో వేగంగా మారిన పరిణామాలతో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఈ ఉదయం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌  కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసింది. జమ్మూ కాశ్మీరుకు ప్రత్యేక ప్రత్తిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసింది. తద్వారా జమ్మూకాశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయింది. కేంద్రం తాజా నిర్ణయంతో జమ్ము- కాశ్మీరును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. దీంతో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము కాశ్మీరును ప్రకటించారు. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను గుర్తించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అధికరణ 370 రద్దు చేశారు. ఈ రద్దు ద్వారా జమ్ము కాశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయింది. కాగా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఆర్టికల్‌ 370ను రద్దు , 35(ఏ) రద్దు, రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన బిల్లును ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అదే సమయంలో ఆర్టికల్‌370 రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో భారతరాజ్యాంగం పూర్తి  స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్‌ 370(3)తో జమ్ముకశ్మీర్‌ లెజిస్లేటీవ్‌ అసెంబ్లీగా మారుతుంది. దీంతో జమ్ముకశ్మీర్‌  అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి అమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది.
జమ్ము కాశ్మీర్‌ను దేశంతో అనుసంధానించాం: అమిత్‌ షా
జమ్ము కశ్మీర్‌ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. భారత  రాజ్యాంగం మొత్తం జమ్ము కశ్మీర్‌లో అమలవుతుందన్నారు. మూడు కుటుంబాలు కలిసి జమ్ముకశ్మీర్‌ను దోచుకున్నాయన్నారు. 370 కారణంగా కశ్మీర్‌కు చెందిన చాలా కుటుంబాలు అక్కడ దరిద్రంలో జీవిస్తున్నాయని,  దీనిని అడ్డం పెట్టుకొని కొన్ని కుటుంబాలు అక్కడి ప్రజలను దోచుకొన్నాయన్నారు. మహారాజ హరిసింగ్‌ చేత భారత్‌లో కలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేశారని, అప్పట్లో ఆర్టికల్‌ 370 లేదని, ఆ తర్వాత వచ్చిందన్నారు. ఆర్టికల్‌ 370 జమ్ము కశ్మీర్‌ను భారత్‌తో మమేకం కానివ్వలేదు. కశ్మీర్‌ను అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేశాయి. మోదీ ప్రభుత్వానికి ఆ అవసరం లేదు. సభ్యులు అందరూ చర్చించాలి.  ఆర్టికల్‌ 370 వచ్చాకే కశ్మీర్‌లో అరాచకాలు మొదలయ్యాయి. కశ్మీర్‌లో దళితులకు రిజర్వేషన్లు దక్కలేదనే విషయం దేశానికి తెలియాలి. కశ్మీర్‌లోకి వెళ్ళే అత్యధిక నిధులు ఎక్కడి పోతున్నాయో చర్చించాలి. నేను ప్రతి  దానికి సమాధానం ఇస్తాను. ఆర్టికల్‌ 370 తొలగించడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు.” అని అమిత్‌ షా రాజ్యసభలో పేర్కొన్నారు. కాగా మరో వైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అయితే బహుజన సమాజ్‌ పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు మాత్రం మోడీ సర్కార్‌ నిర్ణయాన్ని సమర్థించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here