జాంపేట అర్బన్‌ బ్యాంక్‌లో ఎన్నికల సందడి  

0
320
రేపు నామినేషన్ల దాఖలు- అవసరమైతే 6న పోలింగ్‌ 
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  27 :  జాంపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. ప్రస్తుత చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ సారధ్యంలోని పాలకవర్గం కాలపరిమితి ముగియనున్న నేపధ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చేనెల ఆరవ తేదీన జరగనున్న ఎన్నికలకు రేపు నామినేషన్లను స్వీకరిస్తారు. మొత్తం 12 డైరక్టర్‌ స్ధానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.ఇందుకు రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ మరునాడు అంటే 29న ఉదయం 11 గంటల నుంచి జాంపేటలోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఎన్నిక అనివార్యమైతే  నవంబర్‌ 6న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. దానవాయిపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూలు, సిమెట్రీపేట ఎలిమెంటరీ పాఠశాల పక్కనున్న డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ కమ్యూనిటీ హాలులో ఈ పోలింగ్‌ ప్రక్రియ సాగుతుంది.అదే రోజు కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఎన్నికలు జరిగితే నవంబర్‌ 7 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జాంపేటలోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక జరుగుతుంది. ఏకగ్రీవమైతే ఈ నెల 31న పాలక మండలి ఎన్నిక ఉంటుంది.ఓటింగ్‌లో పాల్గొనే సభ్యులు ఫోటొ గుర్తింపు కార్డుతో హాజరు కావలసి ఉంటుంది. ఈ ఎన్నికలకు వి.త్రిమూర్తులు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.