జాన్‌ హత్య : 2 నాగరికతల సంఘర్షణ

0
246
అండమాన్‌ నికోబార్‌లోని నార్త్‌ సెంటినల్‌ దీవిలో నెలకోజులక్రితం అమెరికా పర్యాటకుడు జాన్‌ అలెన్‌ చౌ(27) హత్య ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ దీవిలో నివసించే ఆదివాసీ తెగ సెంటినలీస్‌ గురించి, వారి మనుగడపై చర్చ జరుగుతోంది. నాగరికతల మధ్య సంఘర్షణ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ ఆదివాసీ తెగ నాగరిక మానవుని నీడను కూడా భరించలేదు.. సహించలేదు. నాగరికులు ఎవరైనా ఆ దీవిలోకి అడుగుపెడితే హతమారుస్తారు. బాహ్య ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా దాదాపు 30వేల సంవత్సరాలుగా బంగాళాఖాతంలోని ఉత్తర సెంటినల్‌ దీవిలో ఈ ఆదిమ తెగవారు జీవిస్తున్నారని ఆంత్రపాలజిస్టులు చెబుతున్నారు. నీటిలో చేపల కదలికలను గమనిస్తూ బాణాలు విసరగల సమర్థులు. అత్యంత ప్రమాదకరమైన తెగగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఒంటిపై దుస్తులు లేకుండా చేతిలో బాణాలతో కనిపిస్తారు. వారి భాష, సంస్క తి, విశ్వాసాలు, అసలు ఈ తెగవారు ఎంతమంది ఉన్నారనేది కూడా స్పష్టంగా తెలియదు. దాదాపు 20 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవుల్లో వారు చాలా సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారనేది మాత్రం తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ తెగకు చెందిన వారు 150 నుంచి 140 వరకూ ఉండవచ్చని భావిస్తున్నారు. తమ బతుకేదో తాము బతుకుతామనే రీతిలో వ్యవహరిస్తున్న సెంటినలీస్‌ను మచ్చిక చేసుకునేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా.. వాటిని వారు తీవ్రంగా ప్రతిఘటించారు. బ్రిటీష్‌ మిలటరీ 1880లో సెంటినలీస్‌పై దాడి చేసి వ ద్ధ దంపతులు, నలుగురు సంతానాన్ని పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకొచ్చింది. కొన్ని రోజులకే దంపతులు చనిపోవడంతో ఆ సంతానాన్ని మళ్లీ అడవుల్లో వదిలేసింది. ఆ తెగవారు నాగరికుల సామీప్యాన్ని తట్టుకొని నిలవగలిగే నిరోధకశక్తి లేకపోవడమే ఆ దంపతుల మ తికి కారణమని నిర్ధారించారు. దీంతో, వారిని అక్కడే స్వేచ్ఛగా జీవించేలా వదిలేయాలనీ, వారి మనుగడకు ఎటువంటి అవరోధం తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఆ తర్వాత భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అనుమతి లేకుండా ఆ దీవి వైపు వెళ్లడాన్ని కూడా నిషేధించింది. 2004లో సునామీ దెబ్బకు సెంటినలీస్‌ సర్వం కోల్పోయినా.. భారత ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా జారవిడచిన ఆహారాన్ని కూడా వారు ముట్టుకోలేదంటే నాగరిక మానవుల నీడను కూడా అంగీకరించని స్థితిలో జీవనం సాగిస్తున్నారు. అంతేకాదు, అలా ఆహారం విడిచిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు హెలికాప్టర్లపై బాణాలతో దాడిచేశారు. 1974లో నేషనల్‌ జియోగ్రఫిక్‌ చానల్‌ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీద్దామని నార్త్‌ సెంటినలీస్‌ దీవికి అల్యూమినియం పాత్రలు, కొబ్బరిబోండాలు, ఓ పందిని అక్కడకు తీసుకువెళ్లారు. తీరంలో అడుగుపెట్టారో లేదో.. వారిపై బాణాల వర్షం కురవడంతో ఆ బహుమతులను అక్కడే వదిలి పారిపోయి వచ్చారు. సెంటినలీస్‌లు కొబ్బరిబోండాలు, కొన్ని పాత్రలు తీసుకెళ్లారేగానీ, ఆ పందిని అక్కడే చంపి పాతిపెట్టారు. అయితే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో టీఎన్‌ పండిట్‌ కొంత సఫలమయ్యారు. 1967లో ఈ పురాతత్వ శాస్త్రవేత్త సెంటినలీస్‌ తెగవారిని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు అడవుల్లోకి పారిపోయారు. 1991లో మాత్రం ఆయన పాక్షిక విజయం సాధించారు. ఆయన ఉన్న పడవలోకి కొందరు సెంటినలీస్‌ తెగవారు ఎక్కడమేగాక, ఆయన వద్ద ఉన్న వస్తువులను ఆసక్తిగా తడిమి చూశారు. ఇంతకుమించి వారితో సన్నిహితంగా మెలిగిన వారెవరూ లేరు. ఈ తెగ గురించి పూర్తి అవగాహన ఉన్న అలెన్‌కు తాను అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో అడుగుపెడుతున్నానని తెలిసే తన మరణాన్ని తనకు తానుగా కొనితెచ్చుకున్నాడు. నిజానికి, అతను సాహసి, పర్వతారోహకుడు, క్రిస్టియన్‌ మత ప్రచారకుడు. ఓక్లహౌమాలోని ఇవాంజిలికల్‌ ఓరల్‌ రాబర్ట్స్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్నాడు. తన మిత్రులకు ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌లో సెంటినలీస్‌ తెగవారికి ఏసు ప్రభువు బోధనలను పరిచయం చేయాల్సిన సమయం ఇదే. అందుకే నేను ఈ సాహసానికి పాల్పడుతున్నానని తెలిపాడు. ‘దేవుడా.. నాకు చనిపోవాలని లేదు’ అంటూ ప్రాణాలను పణంగా పెట్టి దీవిలోకి ప్రవేశించాడు. టూరిస్టు వీసా మీద ఐదారుసార్లు అండమాన్‌ సందర్శించిన ఇతడికి స్థానికులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దీవికి పోయేందుకు గతంలో ఎవరూ అతనికి సహకరించలేదు. కానీ, ఈసారి పాతికవేలు పెట్టి డింగీ తీసుకొని, చిదియాటాపు ప్రాంతంలోని ఏడుగురు మత్స్యకారులను మచ్చిక చేసుకొని దీవికి చేరుకున్నాడు. ఈ ఏడాది నవంబరు 14న తీరంలోకి అడుగుపెట్టగానే సెంటినల్‌ తెగవారు బాణాలతో దాడికి దిగారు. అయినా అలానే అలెన్‌ ముందుకు వెళ్లడంతో అతన్ని చుట్టుముట్టి బంధించారనీ, రెండు రోజుల పాటు వారి వద్దనే ఉంచుకొని నవంబరు 17న అతన్ని హత్యచేసి తీరంలో మ తదేహాన్ని సగం పూడ్చిపెట్టారని జాలర్లు చెబుతున్న కథనం. గతంలో ఇద్దరు మత్స్యకారులు తీరం చేరుకోవడంతో వారిని బాణాలతో హతమార్చారు. అలెన్‌పై బాణాలతో దాడి జరగడంతో అప్పటి బాణాల దాడి గుర్తుకు వచ్చి భయంతో తాము పారిపోయి వచ్చినట్లు, తిరిగి రెండోరోజు వెళ్లేటప్పటికి తీరంలో మ తదేహం కనిపించినట్లు జాలర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని అలెన్‌ స్నేహితుడు మతబోధకుడు అలెక్స్‌కు తెల్పడంతో, అతను అలెన్‌ కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. వారు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అలెన్‌ మృతదేహాన్ని తీసుకురావడం అధికారులకు కష్టమైన పనే కావచ్చును కానీ, దానిని అలాగే వదిలివేస్తే ఆ తెగ ప్రజల మనుగడకు ముప్పుతెచ్చే ప్రమాదం ఉన్నది. అలెన్‌ మృతదేహం అక్కడ ఎంతకాలం ఉంటే ఈ ఆదివాసుల ఆరోగ్యానికి ముప్పు అంతగా పెరుగుతుంది. ఆ మ తదేహాన్ని బయటకు తీసుకువచ్చేందుకు కొబ్బరికాయలు, ఇనుప ముక్కలు సాధనాలుగా ఉపయోగపడవచ్చని మానవ పరిణామ, విజ్ఞాన శాస్త్రవేత్త టీఎన్‌ పండిట్‌ సూచిస్తున్నారు. తీరంలో ఆ తెగవారు లేరని నిర్ధారించుకొని మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళ వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంలో మన ప్రభుత్వ వ్యవస్థల బలహీనత బట్టబయలవుతోంది. ఆంక్షలు, నిషేధాలు విధిస్తే సరిపోదనీ, పటిష్టమైన నిఘా, గస్తీ అవసరమని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఈ ఆదిమజాతికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టడంలోనూ మన పాలకులు తమ సహజ తీరునే ప్రదర్శించారని స్పష్టమవుతోంది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న ఈ తెగవారు నేడు వంద, ఆపైగా మాత్రమే ఉన్నారు. ఆఫ్రికాలోని ఆదిమ మానవ సంతతికి చెందిన ఈ తెగవారిని ఇకనైనా స్వేచ్ఛగా జీవించనివ్వడానికి నిర్దిష్టమైన, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టవలసిన అవసరాన్ని మన ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here