జిఓ 279ని రద్దు చేసేవరకు పోరాటం

0
292
కార్పొరేషన్‌ను ముట్టడించిన మున్సిపల్‌ జేఏసీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 8 : జి.ఓ 279ని రద్దు చేసే వరకు మున్సిపల్‌ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని రాష్ట్ర నాయకుడు రామారావు వెల్లడించారు. మున్సిపల్‌ కార్మికులు హానికలిగిస్తున్న జిఓను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసారు. నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సోమవారం రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేవరకు మున్సిపల్‌ కార్మికులు వెనక్కి తగ్గబోరన్నారు. జి.ఓ నెంబర్‌ 150 ప్రకారం వేతనాలు పెంచి బకాయిలతో చెల్లించాలని డిమాండ్‌ చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి చాలాసార్లు మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లనే నిరవధిక సమ్మెకు దిగామన్నారు. వివిధ దశల్లో ఆందోళనలు కొనసాగిస్తు వస్తున్నామన్నారు. ఎన్ని రోజులైనా ప్రభుత్వం స్పందించేవరకు నిరవధిక సమ్మెను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు మున్సిపల్‌ జేఏసీ సిద్ధమైందని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మీసాల సత్యనారాయణ అన్నారు. వేలమంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తుంటే ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని, జిఓ 279ని రద్దు చేయాలని, జిఓ 150 అమలు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కార్పొరేషన్‌ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. వీరి ఆందోళన సమాచారం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here