జైజై గణేషా..  బైబై గణేషా

0
77
కట్టుదిట్టమైన భద్రతల మధ్య నిమజ్జనోత్సవం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 12 : నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ఉత్సాహంగా, వైభవంగా జరుగుతున్నాయి. విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గోదావరి గట్టున వాటర్‌ వర్క్స్‌ ప్రక్కన ఉన్న పాత ఇసుక ర్యాంపులో ఏర్పాట్లు చేశారు. గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతల మధ్య విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, ఇతర ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించిన కమిటీ సభ్యులు ఆ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి నిమజ్జనాలు చేస్తున్నారు. పాత ఇసుక ర్యాంపు వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో పాటు రెవిన్యూ, మున్సిపల్‌ శాఖాధికారులు నిమజ్జనోత్సవంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సబ్‌ కలెక్టర్‌ రావిరాల మహేష్‌కుమార్‌, అర్బన్‌ ఎస్పీ షిమోషి భాజ్‌పాయ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ తదితర అధికారులు ఏర్పాట్లను, నిమజ్జనోత్సవాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అపశృతులకు తావులేకుండా గోదావరిలోకి కమిటీ సభ్యులను అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  గోదావరి వరద ఉధృతి కారణంగా సాయంత్రం 7 గంటలలోపే నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని అర్బన్‌ ఎస్పీ ఇప్పటికే కోరిన సంగతి విదితమే. గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here