టిక్కు టక్కులు

0
291
మనస్సాక్షి  – 1151
‘సప్త సముద్రాలూ ఈది యింటి వెన కాల మురిక్కాలవలో పడి చచ్చాట్ట’… అన్నట్టుంది గిరీశం పరిస్థితి. లేకపోతే  ఊళ్ళోవాళ్ళ పెద్ద పెద్ద సమస్యలకి ఈజీగా సలహాలు చెప్పి పారేసే గిరీశం యింట్లో సమస్యకి తలపట్టుకోవలసి వస్తుంది. యింతకీ ఆ యింట్లో సమస్య తన శిష్యుడూ, బామ్మర్దీ అయిన వెంక టేశానిది. ఓ పక్కన వెంకటేశానికి  భూమి కున్నంత వయసొచ్చేస్తుందాయె. యింకో పక్క పెళ్ళి సంబంధాలు చూస్తుంటే వాళ్ళడిగే ప్రశ్న ‘అబ్బాయి ఏం చేస్తు న్నాడా?’ అని. మొత్తానికి వెంకటేశం ఓ ఉద్యోగం వాడయితేగానీ యింటివాడు కాలేడని అర్థమయి పోతుంది. దాంతో గిరీశం ఎడాపెడా ఆలోచించే పనిలో పడ్డాడు. సరిగ్గా అప్పుడు గురొచ్చాడు వామన్రావు. యింతకీ వామన్రావు అంటే గిరీశానికి చిన్నప్పటి నుంచీ మంచి ఫ్రెండ్‌. క్లాస్‌మేట్‌ కూడా. తర్వాత్తర్వాత అదేదో ఫుడ్స్‌ కంపెనీలో మంచి జాబ్‌లోకి వెళ్ళి పోయాడు. వామన్రావు గుర్తుకొచ్చేసరికి గిరీశం హుషారుగా ఫోన్‌ చేశాడు. ”రేయ్‌ వామూ.. నేన్రా.. నువ్వింకేం చెప్పకుండా నాకో పనిచేసి పెట్టాలి. మీ కంపెనీలో మావాడికో మంచి ఉద్యోగం చూడాలి” అన్నాడు. అవతల వామన్రావు ఆ మాటలకి నవ్వేసి ”తప్ప కుండా చూస్తాలే. బందరులో మా బ్రాంచ్‌ మేనేజర్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ అంత గొప్పగా లేదు. అలాగని తీసేద్దామంటే అల్లరయిపోతుంది. ఒకవేళ ఏరోజయినా ఆ పోస్ట్‌ ఖాళీ అయితే అది ఖచ్చితంగా మీ వాడికే” అన్నాడు. దాంతో గిరీశం హుషారుగా ఫోన్‌ పెట్టేశాడు. యింకో అరగంటలో వెంకటేశం వచ్చింతర్వాత గిరీశం విషయం అంతా వివరంగా చెప్పి ”మొత్తానికి ఏదోరోజు నీకా ఉద్యోగం ఖాయం” అన్నాడు. వెంకటేశం తలూపి, ఒకలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
——
నాలుగురోజుల తర్వాత.. గిరీశం టీవీ చూస్తుండగా వెంకటేశం హుషారుగా వచ్చాడు. వస్తూనే ”గురూగారూ.. అర్జంటుగా మంచి ముహూర్తం చూడండి” అన్నాడు. గిరీశం తలూపి ”చూస్తాగానీ.. కొంపదీసి పెళ్ళిగానీ కుదిరిందటోయ్‌..” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ”ఉద్యోగంలో చేరడానికి లెండి. బందరులో సుందరం ఫుడ్స్‌ మేనేజరు కింద” అన్నాడు. దాంతో గిరీశం షాకై ”అంటే అక్కడ పాత మేనేజరు వెళ్ళిపోయినట్టా? అయినా ఈ విషయం నాకు వామ న్రావు ఫోన్‌ చేయలేదే?” అన్నాడు. దాంతో వెంకటేశం ”యింకా పాత మేనేజరు వెళ్ళలేదులెండి. యింకో రెండ్రోజుల్లో పోతాడు” అన్నాడు. గిరీశం బొత్తిగా అర్థంకానట్టుగా ”నీకెలా తెలుసు? కొంప దీసి ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏదయినా బుర్రలో దూరిందా?” అన్నాడు. వెంకటేశం నవ్వేసి ”దీనికి కాలజ్ఞానం అక్కర్లేదు. జ్ఞానం ఉంటే చాల్లెద్దరూ” అంటూ బయటికిపోయాడు. గిరీశం మనసులో ‘ఏంటో.. అప్పట్లో వీళ్ళ తాత వెంకటేశం కూడా యిలాగే తలా తోకా లేకుండా మాట్లాడేవాడంట. వీడూ అలాగే తయారయ్యాడు అని తిట్టుకున్నాడు.
——
రెండ్రోజుల తర్వాత.. ఆరోజు గిరీశానికి వామన్రావు నుంచి ఫోనొ చ్చింది. బందరులో వాళ్ళ బ్రాంచ్‌ పాత మేనేజర్‌ ఆరోజే వెళ్ళి పోయినట్టూ, వెంకటేశాన్నొచ్చి ఉద్యోగంలో చేరమన్నట్టూ ఆ ఫోన్‌ సారాంశం. యింతలోనే వెంకటేశం వచ్చాడు. గిరీశం అయితే తలమునకలయ్యేంత ఆశ్చర్యంతో ”అసలిది ఎలా సాధ్యం? పాత మేనేజర్‌ పోతాడని నీకు ముందే ఎలా తెలుసు?” అన్నాడు. దాంతో వెంకటేశం జరిగిందంతా చెప్పసాగాడు.
——
బందరులోని సుందరం ఫుడ్స్‌ ఆఫీసు.. ఆపాటికి బ్రాంచి మేనేజర్‌ గోపాలం తీరిగ్గానే ఉన్నాడు. యింతలోనే వెంకటేశం లోపల కొచ్చాడు. వస్తూనే తన విజిటింగ్‌ కార్డ్‌ యిచ్చి ”నేను టిక్‌ టాక్‌ నుంచి వస్తున్నా సార్‌.. నేను ఆ కంపెనీ మార్కెటింగ్‌ ఆపరేషన్స్‌ చూస్తుంటా” అన్నాడు. టిక్‌ టాక్‌ నుంచి వచ్చాననేసరికి గోపాలం మొహం యింతమంది. కొంచెం విస్మయంగా ”చెప్పండి.. చెప్పండి” అన్నాడు. వెంకటేశం ”మరేం లేద్సార్‌.. టిక్‌ టాక్‌ గురించి మీరు వినే ఉంటారు. యిప్పటికే పబ్లిక్‌లో మంచి క్రేజుంది. అదేదో యింకా పెంచాలన్న ఉద్దేశ్యంతో ఓ డ్రైవ్‌ చేపట్టాం. అందులో భాగంగా మీకులాంటి కొన్ని కొన్ని కంపెనీల్ని సెలక్ట్‌ చేసుకున్నాం” అంటూ ఆపాడు. అప్పటిదాకా ఆసక్తిగా వింటున్న గోపాలం” అంటే యిప్పుడు మేం విరాళాల్లాంటివేవయినా యివ్వాలా?” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ”అక్కర్లేదు.. మీరు కొంచెం మీలో టేలెంట్‌.. అదే.. డేన్స్‌ టేలెంట్‌ బయటికి తీస్తే చాలు” అన్నాడు. గోపాలం అదేం టన్నట్టుగా చూశాడు. అప్పుడు వెంకటేశం ”మరేం లేద్సార్‌.. మీరు మీ ఆఫీసు స్టాఫ్‌ అంద రితో కలిసి సరదాగా డేన్స్‌ చేయాలి. దాన్ని రికార్డ్‌ చేసి టిక్‌టాక్‌లో పెట్టాలి. దాని వలన మీకూ, మీ స్టాఫ్‌కీ మధ్య సాన్ని హిత్యం పెరుగుతుంది. యింకా మీ కంపెనీకో మంచి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది” అన్నాడు. దాంతో గోపాలం అనుమా నంగా ”మరి నాకు యింత బొజ్జ ఉంది కదా. నేను డేన్స్‌ చేస్తే బాగుంటుందా?” అన్నాడు. వెంకటేశం తేలిగ్గా ”సార్‌.. ఆ డేన్స్‌లవీ మీలాంటివాళ్ళు చేస్తేనే అది సెన్సేషన్‌. సన్నగా రివటల్లా ఏ ప్రభుదేవాలా ఉన్నోళ్ళు డేన్స్‌ చేస్తే యింట్రస్టే ముంటుందని?” అన్నాడు. దాంతో గోపాలం హుసారుగా ”మరి తీసిన వీడియెలవీ టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయడం ఎలా?” అన్నాడు. అదెలాగన్నది వెంకటేశం వివరంగా చెప్పేసి, అక్కడ్నుంచి బయటికి నడిచాడు. యిక ఆ క్షణం నుంచీ గోపాలం ఆఫీసులో వాతావరణం కాస్తా మారిపోయింది. గోపాలం అయితే ఆఫీసులో పనిచేసే అమ్మాయి లతో కలిసి రకరకాల డేన్స్‌లు చేశాడు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే తమ బాస్‌ అలా డేన్స్‌లు చేయడానికి ప్రోత్సహించేసరికి అంతా రెచ్చిపోయి మరి డేన్స్‌లు చేశారు.
——
అలా ఆ రోజంతా డేన్స్‌లు చేయడం, టిక్‌టాక్‌లోకి అప్‌లోడ్‌ చేయడం, అవన్నీ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోవడం జరిగాయి. ఈలోగా యింకో విశేషం జరిగింది. హైదరాబాద్‌లో ఉండే సుందరం ఫుడ్స్‌ ఎమ్‌.డి.కి ఎవరో ఫోన్‌ చేసి ”సార్‌.. మీ కంపెనీ అంటే ఎంతో క్రమశిక్షణ, విలువలతో నడిచేది. అయితే బందరు బ్రాంచ్‌లో అదంతా నాశనం అయిపోతోంది. అక్కడ మేనేజరు గోపాలం ఆఫీసులో అమ్మాయిలతో డేన్స్‌లు చేస్తూ వీడియో తీసి నెట్‌లో పెడుతున్నాడు. ఆ వీడియోలన్నీ మీకిప్పుడే షేర్‌ చేస్తా” అని ఫోన్‌ పెట్టేశారు. అంతేకాదు. టిక్‌టాక్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఆ వీడియోలేవో ఎమ్‌.డికి చేరడం, యింకో అరగంటలో గోపాలాన్ని  ఉద్యోగంలోంచి పీకెయ్యడం జరిగిపోయాయి.
——
”అది గురూగారూ.. జరిగింది” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం అదిరిపోయి ”అసాధ్యుడివోయ్‌.. వంద  అబద్ధాలాడయినా ఓ పెళ్ళి చేయమన్నారు. మొత్తానికి ఒకట్రెండు మోసాలు చేసి పెళ్ళి చేసు కున్నావన్నమాట” అన్నాడు. వెంకటేశం అందంగా సిగ్గుపడ్డాడు.
——
”అది గురూగారూ.. నాకొచ్చిన కల. దీనర్ధం ఏంటంటారు?” అన్నాడు వెంకటేశం. దానికి గిరీశం ”మరేంలేదోయ్‌..ఈరోజు టిక్‌టాక్‌ అనేది ఒక వ్యసనంలా అయిపోయింది. చూడటమే కాదు. తమ వీడి యోలు పెట్టుకునేలా. అందరిలో నిబిడీకృతం అయిపోయి ఉండే టేలెంట్‌ని బయటికి తీసే ఈ కాన్సెప్ట్‌ మంచిదే. కానీ జరుగుతోంది తెలుసా? వ్యక్తుల్లోని విశృంఖలత్వాన్ని బయటికి తీసే ప్రమాదకర మయిన సాధనంగా తయారయింది.  దాంతో సంసారాలు నాశనం అయిపోవడం, ఉద్యోగాలు పోవడం, యింకా ప్రాణాలు పోవడం లాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యిందులో పెట్టే  వీడియోల మీద సెన్సారింగ్‌ అనేది ఉంటే ఈ పరిస్థితిని  అదుపు చేయవచ్చు.  అన్నిటికీ మించి తమని తాము నియంత్రించుకునే సెల్ఫ్‌ సెన్సారింగ్‌ అనేది అందరిలో ఉండాలి.  తాము అప్‌లోడ్‌ చేసే వీడియోలు తమ స్థాయిని పెంచేలా, మన సంస్కృతికీ, మన సమాజ కట్టుబాట్లకి అనుగుణంగా ఉండాలి” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here