టిక్కెట్ల కేటాయింపులపై పునరాలోచన చేయాలి

0
171
బిఎస్‌పి జిల్లా అత్యవసర సమావేశం డిమాండ్‌
రాజమహేంద్రవరం, మార్చి 20 :  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బహుజన సమాజ్‌ పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తును స్వాగతిస్తున్నామని, అయితే టిక్కెట్ల కేటాయింపుల విషయంలో జనసేన పార్టీ అధినాయకుడు పవన్‌ కళ్యాణ్‌ పునరాలోచన చేయాలని బిఎస్‌పి జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. స్థానిక క్వారీ ఏరియాలోని ఎస్‌కె ఫంక్షన్‌ హాల్లో బిఎస్‌పి జిల్లా కమిటీతోపాటు, జిల్లాలోని 19 నియోజకవర్గాలకు చెందిన కమిటీలు మంగళవారం అత్యవసర సమావేశంలో పాల్గొన్నాయి. బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిఎస్‌పి రాష్ట్ర కార్యదర్శులు యాళ్ళ దొరబాబు, తాడేపల్లి వియ్‌కుమార్‌, కార్పొరేటర్‌ బర్రే హనుహెలేనియా, జిల్లా కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, వివిధ నియోజకవర్గాలకు చెందిన అధ్యక్షులు ఈ సమావేశంలో మాట్లాడారు. బిఎస్‌పి, జనసేన పొత్తులో భాగంగా రాష్ట్రంలో బిఎస్‌పికి మూడు పార్లమెంటు స్థానాలతోపాటు, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే బిఎస్‌పి బలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాతోపాటు, ఉత్తరాధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కనీసం టిక్కెట్లు కేటాయించకపోవడం దారుణమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పి.గన్నవరం, అమలాపురం, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పొత్తుతో బిఎస్‌పి పోటీ చేస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని, అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో ఏ ఒక్కటీని బిఎస్‌పికి కేటాయించకపోవడం బాధాకరమన్నారు. జనసేన పార్టీకి బలంలేని, అభ్యర్థులు లేని నియోజకవర్గాలను బిఎస్‌పికి కేటాయించి, తమ ఓట్లను పొందాలనే కుట్రలు చేయడం దారుణమన్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత్రి మాయావతి దృష్టికి రాష్ట్ర కమిటీ ద్వారా తీసుకెళ్లాలని తీర్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here