టైలర్స్‌ స్థితిగతులు మార్చేందుకు ఫెడరేషన్‌ 

0
155
దర్జీలకు అండగా ఉంటాం : టైలర్స్‌డేలో ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28 : రాష్ట్రంలోని టైలర్స్‌ స్థితి గతులను మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైలర్స్‌ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రజక కళ్యాణమండపంలో గురువారం రాజమహేంద్రవరం అర్బన్‌ అండ్‌ రూరల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన టైలర్స్‌ డే వేడుకల్లో ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు బాలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వాసు మాట్లాడుతూ అసోసియేషన్‌ నాయకులు తమను సంప్రదించిన నేపధ్యంలో ఫెడరేషన్‌ ఏర్పాటుకు తమ వంతు కృషి చేసామన్నారు. దర్జీల సంక్షేమ కొరకు అన్ని విధాల అండదండలు అందజేస్తామన్నారు. వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దర్జీలు తమ పిల్లలను వృత్తిలోనే పెట్టకుండా బాగా చదివించి, వారి కెరీర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు బాలు మాట్లాడుతూ ఫెడరేషన్‌ ఏర్పాటుకు సహకరించిన ఆదిరెడ్డి కుటుంబానికి టైలర్స్‌ రుణపడి ఉంటారని, వారికి టైలర్స్‌ అంతా అండగా ఉంటారన్నారు. ఫెడరేషన్‌ ఏర్పాటు పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ, 200 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని, కొన్ని వృత్తి దారులకు అందజేస్తున్న విధంగా 50ఏళ్ళు దాటిన టైలర్స్‌కు ఫించన్లు అందజేయాలని, రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా విద్యార్ధుల యూనిఫారంలు కుట్టే అవకాశాన్ని పేద దర్జీలకు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. అడిషనల్‌ లేబర్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పింఛను పధకంలో ప్రతి ఒక్క టైలర్‌ చేరాలన్నారు. అలాగే కార్మికుల కుమార్తె పెళ్ళికి రూ.20 వేలు, భార్య లేదా కుమార్తె ప్రసవానికి రూ.20వేలు ఇవ్వడం జరుగుతుందని, కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు, పూర్తి అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.3 లక్షలు ఇవ్వడం జరుగుతుందని ఇటువంటి పధకాలు పట్ల అవగాహనతో వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా అనాధ బాలలకు ముఖ్య అతిధి ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా మణి టైలర్స్‌ అధినేత పి వెంకట్రావు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు తిరుపతి వెంకటరవి, నగర అధ్యక్షులు రాము, ఆదర్శ టైలర్స్‌ అధ్యక్షులు రాజ్‌కుమార్‌, రాష్ట్ర ప్రచారకార్యదర్శి అడ్డాల నాగేశ్వరరావు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు కె కనకం, కార్యదర్శి వీరబాబు, ఎఎస్‌ఎన్‌, వానపల్లి రమణ, తాతాజీ, పెద్దఎత్తున దర్జీలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here