ట్రాఫిక్‌ పోలీస్‌ అవతారమెత్తిన గోరంట్ల 

0
2449
జెండాపంజా రోడ్డులో స్వయంగా వాహనాల నియంత్రణ
త్వరలో సమస్య పరిష్కారానికి అధికారులతో సమావేశం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 18 :  నిత్యం రద్దీగా ఉండే జెండాపంజా రోడ్డులో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కాసేపు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అవతారం ఎత్తారు. మెయిన్‌రోడ్డుకు అనుసంధానమై అస్తవ్యస్తమైన పార్కింగ్‌తో అనుక్షణం అందునా రాత్రి వేళ మహా రద్దీగా ఉండే ఆ రహదారిలో వెళుతున్న గోరంట్ల కొద్దిసేపు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో వాహనంలోనే కూర్చుని తన దర్పాన్ని ప్రదర్శించకుండా… ట్రాఫిక్‌ పోలీసులపై చిందులు వేయకుండా కారు దిగి స్వయంగా ట్రాఫిక్‌ను నియంత్రించే పని మొదలెట్టారు. ప్రవాహాంలా వస్తున్న వాహనాలు క్రమపద్ధతిలో వెళ్ళేలా సూచనలు ఇస్తూ దుకాణాల ముందు అస్తవ్యస్తంగా పార్కింగ్‌ చేసి ఉన్న వాహనదారులతో వాటిని తొలగింపజేయడానికి ఓ పావు గంట పాటు శ్రమించి ట్రాఫిక్‌ను చక్కదిద్ది అందరి ప్రశంసలు అందుకున్నారు. కాగా పెరిగిన జనాభాతో, వాహనాలతో నగరంలో జఠిలమైన ట్రాఫిక్‌ సమస్యను  చక్కదిద్దేందుకు త్వరలోనే పోలీస్‌ యంత్రాంగంతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా గోరంట్ల ప్రకటించారు. నగరంలో మహా రద్దీగా ఉన్న కొన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ సమస్య పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటామని గోరంట్ల చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here