తప్పుడు ఫిర్యాదులతో భయభ్రాంతుల్ని చేస్తారా?

0
106
తెదేపా నాయకులపై పోలీసులకు రౌతు ఫిర్యాదు
రాజమహేంద్రవరం, మార్చి 7 : ఓట్లు తొలగిస్తున్నారంటూ తమ పార్టీ నాయకులపై తెలుగుదేశం  పార్టీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మండిపడ్డారు. తెదేపా  నాయకుల దుష్ప్రచారంపై స్థానిక త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో గత రాత్రి ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ 37వ డివిజన్‌కు చెందిన వైకాపా ఇన్‌చార్జ్‌ సబ్బారపు సూర్యనారాయణ వైసిపిలో క్రియాశీలకంగా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నందున ప్రజల నుంచి ఆదరణ వస్తుండటంతో  అది చూసి ఓర్వలేక స్థానిక తెలుగుదేశం నాయకులు అసూయతో రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఆయనపై తప్పుడు ఫిర్యాదు చేసారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున అన్ని వార్డుల ఎన్నికల పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల కన్వీనర్లు, వార్డు ఇన్‌చార్జ్‌ల పేర్లు, ఫోన్‌ నెంబర్లను స్థానిక తహశీల్దార్‌ కోరిక మేరకు వైకాపా నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌ ఇచ్చారన్నారు. పార్టీలో  చురుగ్గా పనిచేస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు కొంత మందితో కుమ్మక్కై ఆ వివరాలతో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఓటరు ఫోటోలను స్కానింగ్‌ చేసి ఇంటర్నెట్‌ ద్వారా ఫారమ్‌-7తో సంతకాలు ఫోర్జరీ చేసి ఓటర్లను తీసివేయాలని తప్పుడు ఫిర్యాదులను ఎన్నికల అధికారులకు పంపుతున్నారని ఆరోపించారు. సూర్యనారాయణను వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలోకి ఆహ్వానించారని ఆయన అంగీకరించకపోవడంతో భయబ్రాంతులకు గురిచేసి అక్రమంగా కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని రౌతు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, నాయకులు పోలు విజయలక్ష్మి, ఇసుకపల్లి శ్రీనివాస్‌, కట్టా సూర్యప్రకాశరావు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, ముప్పన ప్రభాకర్‌, సయ్యద్‌ హసన్‌, మజ్జి అప్పారావు, మాసా రామజోగ్‌, సంకిస భవానీప్రియ, సాలా సావిత్రి, సుంకర చిన్ని, నీలం గణపతి, మార్తి లక్ష్మి, వరుణ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here