తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు

0
142
జగన్‌ పరిపాలనలో లోపించిన వాస్తవ దృక్పథం : గోరంట్ల
రాజమహేంద్రవరం, జులై 18 : కక్ష సాధింపు చర్యగా ప్రజావేదికను కూల్చి తప్పు చేసిన సిఎం జగన్‌ ఆ తప్పును సమర్ధించుకోవడానికి వేల తప్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని టిడిపి సీనియర్‌ నాయకులు, శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపుగా 74వేల 70 నిర్మాణాలను అక్రమంగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని కూల్చివేసి అందరినీ నిరాశ్రయులను చేస్తారా? అని ప్రశ్నించారు. నదీ తీరాన్నే పుణ్యక్షేత్రాలుంటాయని, కాశీ, ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాల్లో ఆలయాలన్నీ నదిని ఆనుకుని ఉంటాయన్నారు. కేవలం చంద్రబాబును అభాసుపాలు చేయడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, జగన్‌ పరిపాలనలో వాస్తవ దృక్పథం లోపించిందన్నారు. గతంలో కరకట్టలపై నిర్మాణాలకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలోనే అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు ఎలా కాదంటారని ప్రశ్నించారు. 74వేల నిర్మాణాలను తొలగించినా, సంబంధిత వ్యక్తులను నిరాశ్రయులను చేసినా సహించబోమని హెచ్చరించారు. శతాబ్ధాలుగా, దశాబ్దాలుగా నదీ గర్భంలో లంకలు ఏర్పడ్డాయని, ఎంతోమంది పేదలు అక్కడ నివసిస్తున్నారన్నారు. అసెంబ్లీలో విపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని, మైక్‌ కట్‌ చేయడం, టీవీ ప్రసారాల్లో చూపకపోవడం సరికాదన్నారు. త్వరలో జరగనున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here