తల్లిదండ్రులను మరువొద్దు

0
321
గొందేశి దంపతుల సేవలకు కమిషనర్‌ ప్రశంసలు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 23 : కని పెంచి పోషించిన తల్లిదండ్రులను మర్చిపోకుండా వారిపేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించాలని నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు అన్నారు. స్ధానిక 19 వ డివిజన్‌ తెదేపా నాయకులు గొందేశి  హరనాథరెడ్డి తండ్రి గణపతిరెడ్డి నాల్గవ వర్ధంతి సందర్భంగా డివిజన్‌లోని శ్రీనివాస రామానుజ నగర పాలక సంస్ధ పాఠశాలలో ప్రతిభ చూపిన 10 మంది విద్యార్ధులకు హరనాథరెడ్డి, ఆయన సతీమణి, కార్పొరేటర్‌ గొందేశి మాధవీలతలు రూ. 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య  అతిధిగా కమిషనర్‌ విజయరామరాజు పాల్గొని విద్యార్ధులకు నగదు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి  ఒక్కరూ బాధ్యతగా చదువుకుని ఉన్నత స్ధానాలకు చేరుకోవాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము  చేయకుండా కష్టపడి చదువుకోవాలన్నారు. తండ్రి పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న హరనాథరెడ్డి, మాధవిలతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, డివిజన్‌ జన్మభూమి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.