తస్మదీయ రాష్ట్రం

0
120
మనస్సాక్షి  – 1148
కృష్ణశాస్త్రి చిన్న యిబ్బందిలో పడ్డాడు. సదరు కృష్ణశాస్త్రి తాత ముత్తాతల నుంచి ఆస్తిపరులు. అదొక్కటే కాదు. హిందూ ధర్మాన్ని కాపాడాలనో, పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచాలనో ఉద్దే శ్యంతో వేద పాఠశాలలు నడిపినవాళ్ళు. అప్పట్లో ఆ వేద పాఠశాలలేవో ఊరికి దూరంగా ఉన్న ప్రశాంత వాతావర ణంలో ఉండేవి. పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో అక్కడ చేరి శ్రద్ధగా చదువు కునేవారు. అయితే కృష్ణశాస్త్రి టైం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి.  ఎక్కడికో వెళ్ళి వేద పాఠశాలల్లో చేరే ఆసక్తి పిల్లల్లో తగ్గిపోయింది. దాంతో కృష్ణశాస్త్రి రాజమండ్రిలోనే బ్రహ్మాండమయిన ఆశ్రమ వేద పాఠశాల కట్టించేశాడు. పాఠాలు చెప్పడానికి వేద గురువులని నియమించాడు. పిల్లలు కూడా బాగానే వచ్చి చేరారు. అయితే సమస్యల్లా ఆ పాఠశాల పర్యవేక్షణలో నడిపే వార్డెన్‌లాంటి వ్యక్తిని ఎవరిని పెడదామా అని. ఎవరో ఒకర్ని పెట్టడానికి వీల్లేని పోస్టది. అటు సాంప్రదాయ కుటుంబంలోనివాడు కావాలి. యిటు ఆధునిక కాలపు లౌక్యం వంట పట్టించుకుని ఉండాలి. దాంతో ఆ పోస్ట్‌ కోసం చిన్నపాటి యింటర్వ్యూ నిర్వహించడం, దాంతో ఆ పోస్ట్‌ కోసం చిన్నపాటి యింటర్వ్యూ నిర్వహించడం, అందులో ‘నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌’ అనే గిరీశాన్ని సెలక్ట్‌ చేయడం జరిగింది. యిక ఆరోజు నుంచీ ఆ వేద పాఠశాల నిర్వహణ గిరీశం చేతికొచ్చింది.
——
వేద పాఠశాల అయితే బాగానే నడుస్తోంది. పిల్లలు బుద్ధిగా చదువు కుంటున్నారు. యిక గిరీశం మేనేజ్‌మెంట్‌ సరే. అలా మూడు నెలలు గడిచుంటాయేయో.. అప్పుడు మొదలైంది అసలయిన తమాషా. పిల్లలకి ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనంతోపాటు చక్ర పొంగలి, దద్దోజనం, పులిహోరలాంటివి ఏదో ఒకటి  రోజుకొకటి చొప్పున పెడుతుంటారు. అయితే వాటి స్థానంలో వెజిటబుల్‌ పలావు గానీ, వెజిటబుల్‌ ప్రైడ్‌ రైస్‌ గానీ పెడదామనుకుంటు న్నట్టు గిరీశం ఓ పేపరు ప్రకటన విడుదల చేశాడు. అది చదివి కృష్ణశాస్త్రి ‘యిదేంటీ.. గిరీశం యిలా చేస్తున్నాడు..!’ అనుకున్నాడు. యింకొన్ని రోజులు గడిచాయి. ఈసారి యింకో విశేషం జరిగింది. ఎంత వేద పాఠశాలయినా పిల్లలికి కేవలం చదువే కాదు. యితర వినోదాలూ ఉండాలి. అందుకే రిక్రియేషన్‌ కోసం వారిచేత క్రికెట్‌ ఆడించే ఏర్పాట్లు చేస్తున్నాననీ, దాని కోసం సింగపూర్‌ నుంచి ప్రత్యేకంగా క్రికెట్‌ బ్యాట్లు తెప్పిస్తున్నాననీ, ఆఫ్రికా నుంచి క్రికెట్‌ బాల్స్‌ తెప్పిస్తున్నాననీ ప్రకటించాడు. యిదంతా తెలిసేసరికి కృష్ణశాస్త్రి చాలా అసహనానికి గురయ్యాడు. దాంతో తన అకౌంటెంట్‌కి ఫోన్‌ చేసి ”యిదిగో చారిగారూ… ఈనెల మన వేద పాఠశాలకి పంపే చెక్‌ ఆపండి” అంటూ పురమాయించాడు. పదో తారీకైనా ఆ చెక్కేదో రాక  పోయేసరికి గిరీశం అకౌంటెంట్‌కి ఫోన్‌ చేశాడు. అవతల్నుంచి అకౌం టెంట్‌ ”యింతకాలం బాగానే పంపించాం కదా.. కంగారు పడకండి. పంపించేస్తాం” అని శెలవిచ్చాడు. చివరికి ఆ నెలాఖరుకి అప్పుడు బిల్లుపెట్టిన దాంట్లో సగానికి చెక్‌ వచ్చింది. దాంతో గిరీశం మళ్ళీ ఫోన్‌ చేశాడు. ఈసారి అకౌంటెంట్‌ ” ఆ..దగ్గర్లోనే మిగతా మొత్తానికీ చెక్‌ పంపించేస్తాం” అని సమాధానం చెప్పాడు. తీరా బ్యాంకులో వేస్తే ఆ చెక్‌ కూడా క్లియర్‌ కాలేదు. పెండింగ్‌లో పెట్టమన్నారన్న సమా ధానం వచ్చింది. దాంతో గిరీశం పని చేతులు కట్టేసినట్టయ్యింది. ఈలోగా కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో  ఆ వేద పాఠశాల ట్రస్ట్‌ సభ్యులు సమా వేశం కావడం, దాంట్లో ‘యింతకాలం గిరీశం అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యిక విశ్రాంతి తీసుకోండని’ కోరుతూ ఒక తీర్మానం చేయడం జరిగింది. యిక ఆ తర్వాత అదేస్థానంలోకి కొత్త రక్తాన్ని..అదే..వెంకటేశాన్ని తీసుకోవడం జరిగింది.
—–
వేద పాఠశాల ఎప్పటిలాగే నడుస్తోంది. రెండునెలలు గడిచేసరికి అప్పుడు వెంకటేశం బాపతు పరిపాలనా ముద్ర మొదలయింది. ఓ రోజయితే వెంకటేశం పాఠశాల పిల్లలందరినీ పిలిచి ”యిదిగో పిల్లలూ.. మీకె న్నేసి జతల బట్టలున్నాయి?” అని ఎంక్వయిరీ చేశాడు. అంతా రెండేసి జతలున్నాయని చెప్పారు. దాంతో వెంకటేశం ‘ఏంటీ.. రెండు జతలే..ఏం సరి పోతాయని.. అందరికీ తలో పది జతలూ కుట్టిస్తా’ అని ప్రకటించాడు. యిదంతా పేపర్లో వచ్చింది. యిది జరిగిన కొన్నాళ్ళకి వెంకటేశం యింకో సంస్కరణ చేపట్టాడు. యిక్కడ చదువుకునే పిల్లలందరి తల్లి దండ్రులకి వాళ్ళ యిళ్ళకి నెలనెలా ఆ నెలకి సరిపడే పప్పు, ఉప్పు బియ్యం పంపించడం. పిల్లలు ఎప్పుడయినా శెలవు లకి యింటికెళ్ళినప్పుడు కూడా ఏ విధమ యిన లోటూ ఉండకూడదన్నది వెంక టేశం లోతయిన ఉద్దేశం కావచ్చు. యిదీ పేపర్లో వచ్చింది. దాంతో ట్రస్ట్‌ సభ్యులు ఆలోచనలో పడ్డారు. యింతలోనే వెంకటేశం యింకో ట్విస్ట్‌ యిచ్చేశాడు.  ఆ వేద పాఠ శాలకి ఆనుకునే యింకో భవనం ఉంది. ప్రస్తుతం ఉన్న భవన మయితే పిల్లలకి పాఠాలు చెప్పడానికి సరిపోవడంలేదనీ. అందుకే ఆ భవనం కూడా కలిస్తే యింకా బాగుంటుందనిపించింది. దాంతో వెళ్ళి ఆ భవనం యజమానిని అడిగేశాడు కూడా. దానికా బిల్డింగ్‌ ఓనర్‌ ‘అబ్బే.. యిది అద్దెకిచ్చే ఉద్దేశం లేదు’ అని తేల్చి చెప్పేశాడు. అయినా ‘ఎంతయినా అద్దె యిస్తా’ అని వెంకటేశం పట్టు పట్టేశాడు. దాంతో ఆ బిల్డింగ్‌ ఓనర్‌ యిరవై వేలకి.. అంటే.. అంతకు ముందు వచ్చే పది వేలకి రెట్టింపుకి యిచ్చాడు. వెంకటేశం యిదంతా ఆ నెల బిల్లులో పెట్టాడు. అయితే దానికి చెక్‌ రాలేదు. అంతేకాదు. దగ్గర్లోనే  ‘వెంక టేశం సేవలకి ధన్యవాదాలు తెలియజేస్తూ యిక విశ్రాంతి తీసు కొమ్మని ఓ ఉత్తరం కూడా వచ్చింది.
—–
అది గురూగారూ.. రాత్రి అలాంటి గమ్మత్తయిన కలొచ్చింది. అసలా కలెందుకు వచ్చిందన్నది బొత్తిగా అర్థమయి చావడం లేదు. దానర్ధం ఏంటంటారు? అన్నాడు వెంకటేశం. ఈలోగా గిరీశం ఓ చుట్ట అంటించుకుని ”అసలిదంతా కేంద్రం తీరులా ఉందోయ్‌..ఎన్నో సంవత్స రాలుగా బడ్జెట్‌లో ఆంధ్రాకి అన్యాయం జరిగిపోతుందన్న వాదన విని పిస్తూనే ఉంది. గత అయిదేళ్ళ విషయం తీసుకుంటే ఆ దిగిపోయిన సీఎం గారంటే కేంద్రానికి పడకపోవడం వల్లనో, తాము ఎన్ని నిధు లిచ్చినా ఆ క్రెడిట్‌ ఏదో తమకి యివ్వకపోవడం వల్లనో లేకపోతే యిచ్చే నిధులన్నీ రాజధాని షోకులకి పట్టిసీమకీ ఖర్చు పెట్టేస్తు న్నారనో బడ్జెట్‌లో ఆంధ్రాని పట్టించుకోలేదనే అంతా అనుకున్నారు. యిప్పుడొచ్చిన కొత్త సీఎం అయితే కేంద్రానికి విధేయుడే. కేంద్రం ఏవిచ్చినా అలా అని ప్రకటించేస్తున్నాడు కదా. పైగా పెట్టే ఖర్చంతా జనాలు పథకాల కోసమే. దాంతో ఈసారి బడ్జెట్‌లో ఆంధ్రాకి చాలా పెద్దపీట వేస్తారనే అంతా అనుకున్నారు. అయితే అలాగేం జరగలేదు. షరా మామూలే. ఆంధ్రాకి ఈసారీ మొండి చెయ్యే. ఏతావాతా తేలేదేంటంటే… తమని పూర్తిగా తిరస్కరించిన ఆంధ్రావాళ్ళకి తామెం దుకు చేయాలి అన్న  భావం పైవాళ్ళలో ఉండి ఉండొచ్చు. అయితే అంత ఉన్నతస్థానంలో ఉన్నవాళ్ళు ఈ విషయం గురించి విజ్ఞతతో ఆలోచించి, ఆంధ్రా కూడా తాము పాలించే ప్రాంతంలో ఓ భాగమే అని ఆలోచించి వ్యవహరిస్తే ఎంతో హుందాగా ఉంటుంది.  అలా చేస్తే అది ఈ రాష్ట్ర వర్తమానానికీ తద్వారా ఆ పార్టీ భవిష్యత్తుకీ ఉపయోగపడుతుంది” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here