తీరం దాటిన పెథాయ్‌ – తప్పిన పెను ముప్పు

0
191
ఒడిశా వైపుగా దిశ మార్చుకున్న తుపాన్‌ –  జిల్లా అంతటా ఎడతెరిపిలేని వర్షం
బస్సులు, రైళ్ళు రాకపోకలకు తీవ్ర అంతరాయం – పెరిగిన చలి తీవ్రత
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 17 : పెథాయి తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏడు జిల్లాలపై తుపాను ప్రభావం చూపుతోంది.  తుపాను ఈ మధ్యాహ్నం 3.15 గంటలకు కాకినాడ యానాం మధ్య తీరాన్ని దాటింది. ఇది క్రమంగా బలహీనపడి ఒడిశా వైపు  దిశ మార్చుకుంది. కాగా తీరం దాటే సమయంలో తుపాను అల్లకల్లోలం సృష్టిస్తుందని అధికార యంత్రాంగం భయపడగా అది తీరం దాటే సమయంలో బలహీనపడటంతో గాలుల తీవ్రత తగ్గింది. వర్షం కూడా కాస్త తెరిపినివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ రాత్రి వరకు  వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. తుపాన్‌ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది. గంటకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చలికి తుపాను తోడు కావడంతో చలి పులి మరింత విజృంభించింది. తుపాను ప్రభావంతో కోనసీమలో పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని కోనసీమలో 10 మండలాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. దీంతో ఆయా మండలాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. ఆర్టీసి పలు సర్వీసులను రద్దు చేయగా రైల్వే శాఖ కూడా పలు రైళ్ళను రద్దు చేయడంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక  రైళ్ళను విజయవాడ, విశాఖ, సామర్లకోట స్టేషన్లలో నిలిపివేశారు. కాజులూరు మండలం పల్లిపాలెం చలి గాలులతో ఓ వృద్ధురాలు మరణించింది. తుపాను తీరాన్ని తాకినప్పటికీ  ఈ రాత్రికి  గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలియజేశారు. తుపాను హెచ్చరికల నేపధ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్ధలకు సెలవు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కోనసీమలో తుపాను ప్రభావిత మండలాల్లో అధికారులు పర్యటిస్తూ లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏలూరు రేంజి డిఐజి రవికుమార్‌ మూర్తి జిల్లాలోనే మకాం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని పర్యవేక్షిస్తున్నారు. అల్లవరం మండలం వద్ద సముద్రం కోతకు గురైంది. కాగా సహాయ చర్యలకు మండలాలా వారీగా అధికారుల్ని నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here