తీరానికి చేరువగా ‘ఫొని’

0
180
శ్రీకాకుళానికి పొంచి ఉన్న ముప్పు – తగ్గిన ఉష్ణోగ్రతలు
అమరావతి, మే 2 : బంగాళాఖాతంలో ఫొని తుపాను నేడూ, రేపూ తీరానికి దగ్గరగా వస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఒడిశాతో పాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో, బెంగాల్‌లోని దిగాకు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక తమై ఉంది. విజయనగరం జిల్లాకు కాస్త దగ్గరగా, శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుపాను మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఈశాన్య  దిశలోనే కదులుతూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వరకు ప్రచండగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖలు తెలిపారు. ఫొని తుపానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే తీర ప్రాంతంలో పెద్దఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి.  ఒకటిన్నర మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఫొని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here