తుపాను – టపాసు

0
384
 
”గురూగారూ… ఈ కయాంత్‌ తుపాన్‌ దెబ్బేసింది” అన్నాడు వెంకటేశం వస్తూనే. ఆపాటికి చుట్ట కాల్చుకుంటున్న గిరీశం” అదేంటోయ్‌… అదేదో రాకుండానే తుస్సుమనిపించింది కదా..” అన్నాడు. వెంకటేశం నిట్టూర్చి ”అదే దెబ్బతీసింది గురూగారూ… ఆ తుపాను గురించి తెగ ఊదర గొట్టేశారు కదా. అందుకే యిక దీపావళి జరుపు కోవడం ఉండదనిపించి ఏర్పాట్లేవీ చేసుకోలేదు. తీరా చూస్తే యిప్పుడా తుపానేదో తుస్సుమని పించేసింది” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ”ఆ…పెద్ద ఏర్పాట్లని… యింటి ముందు నాలుగు ప్రమిదలు వెలిగిం చడం, ఏవో నాలుగు మతాబులు కొనడం…అంతే కదా” అన్నాడు. దాంతో వెంకటేశం యిబ్బందిపడి  ”అంతేననుకోండి. నేను ఊరు వెళ్ళాలి గానీ కొంచెం ఈ వారం ప్రశ్నేదో లాగించెయ్యకూడదూ..” అన్నాడు. దాంతో గిరీశం ”అలాగే… ఈ తుపాన్లలాగే మన రాజ కీయ నాయకులు కూడా చాలా వేగంగా పైపైకి దూసుకుపోవడానికి ప్రయత్నిస్తుంటారు. అదెంతవరకూ కరెక్ట్‌?” అన్నాడు. దాంతో వెంక టేశం ఒక్క క్షణం ఆలోచించి ”యిదేదో చిన్న ఊహలా చెబుతా” అంటూ చెప్పడం మొదలెట్టాడు.
 
—–
 
దీపావళికి ముందురోజు… యింతకు ముందు సంవత్సరాల్లో  రోడ్ల మీద హడావిడేం కనపడడం లేదు. స్వీట్‌షాపుల్లో మాత్రం కొద్దిపాటి జనాలు ఉన్నారంతే.  వెంకటేశం అయితే రోడ్డుమీద నెమ్మదిగా నడుచు కుంటూ పోతున్నాడు. యింతకీ వెంకటేశం వెడుతోంది బజార్లో ఉన్న పటాసుల రామరాజు కొట్టుకి. పటాసుల రామరాజంటే 30 ఏళ్ళ నుంచీ ఈ పటాసుల వ్యాపారంలో ఉన్నవాడు. వెంకటేశాన్ని చూడ గానే ”రా వెంకన్న బాబూ” అంటూ సాదరంగా  ఆహ్వానించాడు. వెంకటేశం అక్కడున్న స్టూల్‌ మీద కూర్చుంటూ ”రేపు ఊళ్ళో పిల్ల కాయలకి పట్టుకెళ్ళాలి. ఓ వెయ్యి రూపాయల సామాను పేక్‌ చేసి యివ్వు” అన్నాడు. అలా అంటూ ఓ వెయ్యి రూపాయలు తీసిచ్చాడు. రామరాజు ఆ డబ్బేదో పుచ్చేసుకుని ఓ అరడజను అయిటెమ్స్‌ ఏవో తీసి టేబుల్‌ మీద పెట్టాడు. దాంతో వెంకటేశం ”అబ్బే… నాకు శాంపిల్సవీ చూపించక్కర్లేదు. మొత్తం సరుకంతే పేక్‌ చేసేయండి” అన్నాడు. దాంతో రామరాజు వెంకటేశం వంకబోల్డంత జాలిగా చూసి ”అబ్బే… యివేవీ శాంపిల్స్‌ కాదు బాబూ… ఆ వెయ్యి రూపా యలకీ వచ్చేవి యివే” అన్నాడు. ఈసారి అదిరిపోవడం వెంకటేశం వంతయింది. ”అదేంటీ… యింతకు ముందయితే యిదే వెయ్యి రూపాయలకి బోల్డన్ని పటాసులొచ్చేవి కదా” అన్నాడు. ఈసారి రామ రాజు నిట్టూర్చి ”ఆ.. అవన్నీ చైనా సరుకులే. యివన్నీ యిండియా తయారీ” అన్నాడు. దాంతో వెంకటేశం ”మరి యిప్పుడెలా?” అన్నాడు దిగాలుగా. ఈసారి రామరాజు గొంతు తగ్గించి ”యిదిగో వెంకన్నబాబూ… ఓ పనిచెయ్‌… ఈ పక్క వీధిలోనే మా యిల్లుంది. ఎవర్నడిగినా చెపుతార్లే. అక్కడో కుర్రోడుంటాడు. నేను పంపించానని చెప్పు. ఆ చైనా సరుకులిస్తాడు” అన్నాడు. దాంతో వెంకటేశం హుషారుగా అక్కడికి బయల్ద్దేరాడు…
 
———
 
దీపావళి రోజు సాయంత్రం… వెంకటేశం తన సొంతూళ్ళో సొంత యింటి దగ్గర  దున్నేస్తున్నాడు. వీధిలో యింకా ఎవరూ క్రాకర్సవీ కాల్చడం మొదలెట్టలేదు. వెంకటేశం మాత్రం అందరికంటే ముందుగా తను తెచ్చిన మందులేవో కాల్చే పనిలో పడ్డాడు. అయితే  అప్పుడో విశేషం జరిగింది. ఆ వీధిలో వాళ్ళంతా మందులు కాలుస్తున్న తననే చూస్తున్నట్టుగా వెంక టేశానికి అనిపించింది. యిదేదో వెంకటేశానికి కొంచెం గర్వంగా  కూడా అనిపించింది. దాంతో ఆ కాల్చేలేవో కొంచెం ఫోజుపెట్టి మరీ కాల్చడం మొదలెట్టాడు. యిదంతా బాగానే ఉందిగానీ ఆ మందులే బొత్తిగా కాలి చావడం లేదు. యింతలో ఆ పక్కింట్లో ఉండే రాంబాబు తన మూడేళ్ళ మనవరాలు టింకూని అక్కడికి తీసుకొచ్చాడు. వస్తూనే ”యిదిగో… వెంకటేశం బాబూ… నువ్వు కడ్నుంచో చైనా టపాసులు తెచ్చావంట కదా. కొంచెం వాటిని మా టింకూకిచ్చి కాల్పించు. ఈ చైనా మందులయితే తుస్సుమంటాయి కాబట్టి కాలుతాయన్న భయం ఉండదు. దాంతో మందులు కాల్చాలంటే భయం పోతుంది. ముందా భయంపోతే అప్పుడు నేను కొని తెచ్చిన మన యిండియా టపాసుల్ని కాల్చుకుంటుంది” అన్నాడు. ఈలోగా వీధిలో మిగతా పిల్లలంతా అలాగే వచ్చేశారు. దాంతో వెంకటేశం నోరెళ్ళబెట్టాడు.
 
——-
 
”అది గురూగారూ… చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. గిరీశం తల ఊపి ”బావుందోయ్‌ నీ తుస్సు వ్యవహారం. సరే.. యిదేదో కొంచెం రాజకీయాలకి అన్వయించి చెప్పు” అన్నాడు. ఈసారి వెంకటేశం యింకొంచెం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”అసలు యిందులో ఉన్నది పెరుగుట విరుగుట కొరకే అనేలాంటి పీటర్స్‌ ప్రిన్సిపుల్‌ అనబడే గొప్ప సిద్ధాంతం. ఆ సిద్ధాంతం చెప్పేదేంటంటే ఏ వృత్తిలో వారయినా, ఎవరయినా ఎదుగుతారు..యింకా ఎదుగుతారు.. యింకా యింకా ఎదుగుతారు. అలా ఎదిగి ఎదిగి ఎక్కడో ఒకచోట తమ అసమర్థత నిరూపించుకుంటారు. యిక అక్కడ్నుంచి కిందకి జారిపోతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి టీచర్‌గా పాఠాలు బాగా చెపుతూ బ్రహ్మాండం అనిపించుకోవచ్చు. దాంతో హెడ్మాస్టర్‌ని చేసేస్తారు. యిక అక్కడా ఓహో అనిపించుకోవచ్చు. ఆ తర్వాత యింకా ఎదిగి డి.ఈ.వో. అయిపోవచ్చు. యిక అక్కడ తన అసమ ర్థత నిరూపించుకుని యింత పనికిమాలిన ఆఫీసరు యింకెక్కడా ఉండడు’ అనిపించుకోవచ్చు.అలాగే సైరస్‌ మిస్త్రీని తీసుకున్నా అంచె లంచెలుగా ఎదిగి చివరికి టాటా గ్రూప్‌ చైర్మన్‌ స్థాయిలో ఫెయిలయి పోయి పాతాళానికి జారిపోయాడు. యిక పొలిటీషియన్స్‌ని తీసు కున్నా యిదే వర్తిస్తుంది” అన్నాడు. దాంతో గిరీశం ”అలా అయితే యింక రాజకీయాల్లో ఎవరూ పైకి ఎదగకూడదటోయ్‌?” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ”లేదు గురూగారూ… ఎదగాలి. అలా ఎదుగుతూ ఉండాలి. అయితే అదేదో ఒక స్థాయి వరకే. ఏ స్థాయి వరకూ అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఏ స్థాయిలో తమ విజయ ప్రస్థానం కొనసాగించగలమో అక్కడ పైకి ఎదిగే ప్రయత్నం ఆపి ఆత్మావలోకనం, దిద్దుబాటు కార్యక్రమాలు కొనసాగించాలి. అలాగే ఈ ప్రభుత్వాలు కూడా అధికారం చేతిలో ఉంది కదాని తమ సింగ పూర్‌ స్నేహితులకి యిష్టానుసారంగా కాంట్రాక్టులు కట్టబెట్టుకుంటూ పోతే అదీ ఎక్కడో బెడిసికొడుతుంది. స్విస్‌ ఛాలెంజే దానికి ఉదా హరణ” అంటూ వివరించాడు. వెంకటేశం చెప్పిందానికి సంతృప్తి పడ్డట్టుగా గిరీశం రెండు మూడుసార్లు చుట్ట గుప్పుగుప్పుమనిపించాడు.
 
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి