తుపాను షెల్టర్లలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ 

0
198
అమరావతి, ఏప్రిల్‌ 18 : తీర ప్రాంతాల్లో నెలకొల్పిన తుఫాను షెల్టర్లలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుఫాను వచ్చే అవకాశం ఉన్నప్పుడు, భారీ వర్షాలు, వరదలు పొంచి ఉన్నప్పుడు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడానికి అత్యవసర సమాచార వ్యవస్థను నెలకొల్పనున్నారు. జాతీయ తుఫాను సన్నద్ధత ప్రాజెక్టు (ఎన్‌సీఆర్‌ఎమ్‌పీ) కింద 219 తుఫాను షెల్టర్లను నిర్మించింది.  వాటిలో తొలుత 145 షెల్టర్లలో అత్యవసర సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి డి.వరప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో వీటిని బహుళ ప్రయోజన తుఫాను షెల్టర్లుగా (ఎమ్‌పీసీఎస)గా పరిగణిస్తారు. వీటిల్లో అత్యవసర సమాచార వ్యాప్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రతీ షెల్టర్‌పైన ఐదు మీటర్ల పోల్స్‌ను ఏర్పాటు చేసి వాటికి సైరన్‌లను అమర్చుతారు. మరో డిజిటల్‌ మొబైల్‌ రేడియోను ఏర్పాటు చేస్తారు. తుఫానులు, వర్షాలు వచ్చే అవకాశం ఉంటే ముందుగా సైరన్‌ మోగించడం ద్వారా తీర ప్రాంత ప్రజలకు తెలియజేస్తారు. అలాగే, విపత్తుల గురించి డిజిటల్‌ రేడియో ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తారు. మండల స్థాయుల్లో అత్యవసర ఆపరేషన్‌ కేంద్రా(ఎంఈఓసీ)లను ఏర్పాటు చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here