తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో..

0
295
సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా విజయం అంతే ఖాయం : గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 17 : తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో జరిగిన ఎన్నికల్లో మోడీ, కేసీఆర్‌, జగన్‌లకు చెంప పెట్టులాంటి ఫలితాలు వచ్చి తెలుగుదేశం పార్టీ  విజయం సాధించడం అంత నిజమని, పార్టీ కుటుంబ సభ్యులు సందేహపడవలసిన అవసరం లేదని గన్ని కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు, ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఇటీవల ప్రతిపక్షనేత జగన్‌ కొంతమంది విశ్రాంత ఐఏఎస్‌లు గవర్నర్‌ను కలిసి చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదులు చేశారని, వీరికి ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపాలు కనపడలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఫారమ్‌-7 ద్వారా గుజరాత్‌, బీహార్‌, ఢిల్లీ నుంచి ఓట్లను తొలగించడానికి జరిగిన కుట్రను వీరు గమనించలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో వివాదాలు తలెత్తకుండా, అసాంఘిక శక్తులు చెలరేగకుండా పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించాల్సిన ఎన్నికల సంఘం తూతూమంత్రంగా సాయుధ బలగాలను రప్పించిందని, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా పట్టించుకోలేదన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వెంట పెద్ద ఎత్తున మహిళామణులు, వృద్ధులు అండగా నిలిచారని, ఓటు వేసేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారని పేర్కొన్నారు. ఈవిఎంలు మొరాయించినా అర్థరాత్రి వరకు వేచి ఉండి పెద్దన్నయ్యగా నిలిచిన చంద్రబాబుకు అండగా నిలిచారన్నారు. ఈ పరిస్థితుల్లో  కొంతమంది అభూత కల్పనలు సృష్టిస్తున్నారని, ఎవరూ రూమర్స్‌ నమ్మద్దన్నారు. ఓటింగ్‌కు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళామణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here