తెదేపా నేతల భాష  అభ్యంతరకరం

0
126
రాజమహేంద్రవరం,డిసెంబర్‌ 30 : అభివృద్ది వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రయత్నిస్తుంటే  రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ,మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా  ప్రథమ చైర్మన్‌ గన్ని కృష్ణలు  మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా ఉందని వైకాపా నగర నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక జమిందార్‌మెట్టపై ఉన్న వైఎస్‌ఆర్‌సిపి నగర కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్‌ ఆకుల సత్యనారాయణలతో కలిసి  పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ శ్రిఘాకొళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ప్రతిపక్షంగా తెదేపా నేతలు  ప్రభుత్వం తప్పుచేస్తే విమర్శించడంలో తప్పులేదని.. అయితే వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేస్తూ ఇంకా రాజమహేంద్రవరాన్ని తామే ఏలుదామన్న ప్రయత్నం చేయడం మాత్రం దారుణంగా ఉందన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీలో నెలకొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించుకుంటే మంచిదన్నారు. రాజధాని పేరుతో అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసి 16 వేల కోట్ల ప్రజధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంపై కేబినెట్‌ సబ్‌కమిటీ దృష్టిసారించడమే తెదేపా నేతల్లో ఉలికిపాటుకి కారణమన్నారు. 13 జిల్లాల్లోనూ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సిఎం జగన్‌ విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయవిభాగాలను ఏర్పాటు చేయాలని యోచిస్తే వీరేందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజధాని మార్పుపై  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మూడు రాజధానులపై విధాన ప్రకటన జారీచేయకుండానే రాష్ట్రాన్ని అల్లకల్లోలం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతులకు అన్యాయం చేయడానికి ప్రభుత్వం ఎక్కడా ప్రయత్నం చేయడం లేదని, అమరావతి నుంచి రాజధాని  తరలిస్తామని ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదని స్పష్టం చేసారు. మూడు రాజధానులు అని ప్రకటించగానే ఇక్కడ టీడీపీ నాయకులు జనాల్లేని పార్టీల నాయకులతో అఖిలపక్షం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. అఖిలపక్షం టిడిపి నేతల జేబులో ఉండిపోవడం బాధాకరమన్నారు. రాజమహేంద్రవరంలో గతంలో జరిగిన అవకతవకలపైనా, ఉన్న సమస్యలపైనా అఖిల పక్ష సమావేశాలు నిర్వహిప్తే బాగుండేదన్నారు. ప్రజలు రోడ్లపైకి రావాలని అఖిలపక్షం పిలుపునివ్వడం చాలా బాధాకరమన్నారు. అసలు ప్రజలకి ఏం నష్టం జరిగిందని రోడ్లపైకి వస్తారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువులు 400 ఎకరాలు ముందే కొనుగోలు  చేసి ఆ తరువాత సిఆర్‌డిఎ పరిధిలో చేర్చారని ఇది ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆమోదంతో జగన్‌ సిఎం అయ్యారని ప్రజలకు ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసన్నారు. చంద్రబాబు చారిత్రాత్మక తప్పులు కారణంగానే రాష్ట్రం పరిస్థితి ఇలా తయారైందని రౌతు వ్యాఖ్యానించారు. అసలు అమరావతిని రాజధానిగా గుర్తించడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పన్నారు. 13 జిల్లాల్లో సమాంతరంగా వికేంద్రీకరణతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో సిఎం జగన్‌ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సంకల్పించారని డాక్టర్‌ ఆకుల అన్నారు. సమావేశంలో వైసిపి మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, జాంపేట బ్యాంక్‌ చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, పార్టీ నాయకులు ఎండి కరీంఖాన్‌, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, ప్రసాదుల హరినాధ్‌, మజ్జి అప్పారావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here