తెలుగుదేశం ఆధ్వర్యాన సందడిగా కార్తీక వన సమారాధన 

0
42
రాజమహేంద్రవరం,నవంబర్‌ 25 : తెలుగుదేశం పార్టీకి రాజమహేంద్రవరం కంచుకోట వంటిదని ఆ పార్టీ నాయకులు అన్నారు.తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టే సామర్ధ్యం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదని, అందుకు గతంలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికలు, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడమే నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఆధ్వర్యంలో స్థానిక జవహర్‌ లాల్‌ నెహ్రూ రోడ్డులోని ప్రభు గారితోటలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కార్తీక వన సమారాధన జరిగింది. ముందుగా తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శాసనమండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ వివివి చౌదరి (కూర్మాపురం అబ్బు),  పార్టీ జిల్లా అధ్యక్షులు నామన రాంబాబు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు ఆనందరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాగంటి రూప, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) తదితరులు మాట్లాడారు. పని ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఆ అభివృద్ధి అంతా కుంటుపడిందన్నారు. సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను గౌరవించుకుంటూ యువతను పార్టీలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆ ఆత్మహత్యలన్నింటికి ముఖ్యమంత్రి జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టేసి… దోచుకో, దాచుకో అనే నినాదంతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వానికి అంతిమకాలం దగ్గరపడిందని, రానున్నది మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. అందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల ఇన్‌చార్జులు, ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, సుమారు 10 వేల మంది పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కార్తీక వన సమారాధన సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కూచిపూడి నృత్యం, వెస్ట్రన్‌ డ్యాన్సులు, చిన్నారుల నృత్యాలు, మ్యాజిక్‌ షోలు ఆకర్షణగా నిలిచాయి. కార్తీక వన సమారాధన సందర్భంగా సిటీ నియోజకవర్గం పరిధిలోని 42వ డివిజన్లలో పంపిణీ చేసిన లక్కీ  టిక్కెట్లను డ్రా తీసి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేశారు.ఈ సందర్భంగా పలు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here