దటీజ్‌ మోడీ !

0
496
జి.కె.వార్తా వ్యాఖ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి హైదరాబాద్‌ నడిబొడ్డు బేగంపేటలో విమానాశ్రయం ఉండేది. పెరిగిన ప్రయాణికుల రద్దీ, జంట నగరాల ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో సకల సౌకర్యాలతో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించారు. శంషాబాద్‌ విమానాశ్రయం తమకు దూరమైపోయిందంటూ దీనిపై అప్పట్లో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. కనీసం డొమెస్టిక్‌ టెర్మినెల్‌నైనా బేగంపేటలో కొనసాగించాలని డిమాండ్‌ వచ్చింది. అయితే ఆ తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రయాణికులు అలవాటుపడ్డారు. ఇపుడు ఎంతో సుఖవంతమైన ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఇలా మార్పు వచ్చినపుడు కొంత అలజడి సహజమే. కాలక్రమేణా ఆ మార్పు మంచిదైతే ప్రజలు అర్ధం చేసుకుంటారు….అలవాటుపడతారు…దేశంలో  తాజా అంశాన్ని ప్రస్తావించడానికే శంషాబాద్‌ విమానాశ్రయ విషయాన్ని  ఈ సందర్భంగా నేను ఉదహరించా. దేశంలో రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు గత రాత్రి దేశ ప్రధాని నరేంద్రమోడీ ఓ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. నల్లధనంపై మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా జాతిని ఉద్ధేశించి ప్రధాని చేసిన ప్రసంగాన్ని నేను అప్పటికి వినలేదు. అందరిలా నాకు గందరగోళంగా అనిపించింది. అక్రమ ధనాన్ని అరికట్టడానికి రూ. 500, రూ .1,000 నోట్లను రద్దు చేయడం, కొత్తగా రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టడం ఎందుకో అని నాకు సందేహం కలిగింది. ఫేస్‌బుక్‌ మిత్రులతో సందేహాలను పంచుకున్నాను. మోడీ ప్రసంగం విన్నాక నా అనుమానాలు నివృత్తి అయ్యాయి. నల్లధనం భారత ఆర్ధిక పరిస్థితిని తలక్రిందులు చేస్తోంది. ఈ నేపధ్యంలో డబ్బు జబ్బు చేసి కోట్లకు పడగెత్తిన వారికి తప్ప సామాన్య, మధ్య తరగతి వారికి, న్యాయబద్ధంగా సంపాదించుకున్న వారికి, పన్ను చెల్లించే వారికి మోడీ  తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి అశాంతి, అలజడి అవసరం లేదు. దేశంలో దొంగనోట్ల చెలామణి బాగా పెరిగి పశ్చిమాన  పాకిస్ధాన్‌, తూర్పున బంగ్లాదేశ్‌ల నుంచి నకిలీ కరెన్సీ ప్రవాహంలా వస్తోంది. ఏటీఎంల ద్వారా కూడా దొంగ నోట్లు వస్తున్నాయి. రాజకీయ నేతలు నల్లధనంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నారు. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పొరుగు దేశాల నుంచి వస్తున్న డబ్బుతో  విపరీతంగా క్యాడర్‌ను పెంచుకోవడం, ఆయుధాలను సమకూర్చుకోవడం జరుగుతోంది. ఇలాంటివారికి మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చేలా మోడీ తీసుకున్న నిర్ణయం శ్లాఘనీయం. ఈ నిర్ణయం వల్ల తాత్కాలిక ఇబ్బందులున్నా క్రమేణా అన్నీ గాడిన పడతాయి. కోట్లకు పడగెత్తిన వారికి ఇబ్బందులు తప్ప సామాన్య, మధ్య తరగతి ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 500, 1000 నోట్లను దర్జాగా మార్చుకోవచ్చు. తాజాగా  రూపొందించిన నానో చిప్‌ ద్వారా నకిలీ నోట్ల తయారీ ఇక ఏ మాత్రం వీలు కాదు. అలాగే నల్లధనాన్ని అరికట్టే అవకాశం  కూడా ఉంది. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం జ్వరం తగ్గడానికి చేదు మాత్ర  ఎలా అవసరమో నల్ల జబ్బు డబ్బు అనే రోగం పోవాలంటే ఈ చర్య అవశ్యం. దేశంలో నల్లధన ప్రవాహాన్ని అరికట్టడానికి ప్రధానమంత్రి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోవడానికి ప్రేరకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావడం మనందరికి గర్వకారణం. దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు అరవింద్‌ పనగారియా నిన్న విజయవాడ వచ్చినపుడు జరిగిన ఓ సమావేశంలో  కూడా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించిన విషయం గమనార్హం.  ఆ కాసేపటికే మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. నల్లధనాన్ని అరికట్టడంలో మోడీ మాటలే గాని చేతలు లేవని విమర్శకుల నోళ్ళకు  ప్రధానమంత్రి మూతపడేలా చేశారు. దటీజ్‌ మోడీ! అని నిరూపించుకున్నారు.