దమ్ముంటే అన్ని చోట్లా కూల్చండి చూద్దాం

0
362
నదీ తీరాల్లో కట్టడాలపై ప్రభుత్వానికి గోరంట్ల సవాలు
అవినీతి పరుడు నీతి కబుర్లు చెప్పడం ప్రజల దౌర్భాగ్యం
రాజమహేంద్రవరం,జూన్‌ 27 : దేశంలోనే సీఎం జగన్‌ అత్యంత అవినీతిపరుడని, అయితే ఈరోజు ఆయన నీతులు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించడంలా ఉందని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాడిస్టు పాలన సాగుతోందని మండిపడ్డారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం స్థానిక విఎల్‌ పురం మున్సిపల్‌ కమ్యూనిటీ హాల్‌లో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ ఉండవల్లిలో ప్రజావేదికను జగన్‌ ప్రభుత్వం అక్రమంగా కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదుల్లోని లంకలు, నదీ తీరాన కట్టిన మసీదులు, చర్చిలు, ఆలయాలు, భవనాలు కూల్చాలని సవాల్‌ విసిరారు. తప్పుడు విధానాలతో రాజకీయం చేయాలనుకునే ప్రభుత్వాలు ఎక్కువ కాలం పాలన సాగించలేవన్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేసే నాయకులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటే ఏమవుతుందో ఇప్పటినుంచే చూస్తున్నారన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు నాయకులను  దుర్మార్గంగా చంపేసారని, 133 మందిపై దారుణంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల తీరుపై కూడా ఆయన కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల్లో చాలా మంది నాయకులు సమర్థవంతంగా పనిచేయలేకపోయారన్నారు. ప్రభుత్వం ద్వారా అన్ని మౌళిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు. చంద్రన్న భీమా, ముఖ్యమంత్రి సహాయనిధి, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్‌భరోసా పింఛన్లు ఇలా అన్ని కుటుంబాలకు అందినంత మేరకు సహాయం చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ నాయకులు గ్రామాల్లో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయలేకపోవడం వల్ల మెజారిటీ తగ్గిందన్నారు. రూరల్‌ మండలం కార్పొరేషన్‌లో కలుస్తుందా? లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా అన్నది కూడా జులై 10వ తేదీలోగా తేలుతుందన్నారు. ప్రజా ప్రతినిధుల పాలన అన్ని గ్రామాల్లో ఉండాలనే లక్ష్యంతో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. త్వరలో రిజర్వేషన్లు కూడా ప్రకటించడం జరుగుతుందన్నారు. గ్రామ వలంటీర్‌ పోస్టుల్లో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలను పెడితే మాత్రం కోర్టుకి వెళ్లైనా నియమాకాలు ఆపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఘనంగా మార్ని వాసు జన్మదిన వేడుకలు
ఈ వేదికపై రూరల్‌ టీడీపీ అధ్యక్షుడు, మండల జన్మభూమి కమిటీ సభ్యుడు మార్ని వాసుదేవరావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కడియం టీడీపీ అధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, రూరల్‌ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, మత్స్యేటి ప్రసాద్‌,  ఆళ్ల ఆనందరావు, ఎలిపే జాన్‌, నున్న కృష్ణ, వల్లేపల్లి బాబూఖాన్‌, నిమ్మలపూడి రామకృష్ణ, పుక్కళ్ల సత్తిబాబు, కోరాడ వెంకటేష్‌, కార్పొరేటర్లు గొందేశి మాధవీలత,బూర దుర్గాంజనేయరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here