దమ్ముంటే జనం మధ్యకు వచ్చి మాట్లాడండి 

0
147
వైకాపా పాలకులకు అమరావతి జెఏసీ సవాలు
రాజమహేంద్రవరం, జనవరి 10 : రాజధాని కోసం అమరావతిలో పోరాటం చేస్తున్న వారంతా పెయిడ్‌ ఆర్టిస్టులని వ్యాఖ్యానిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి చెందిన నాయకులు దమ్ముంటే అక్కడికి వెళ్లి ఆ అనుచిత వ్యాఖ్యలు చేయాలని అమరావతి ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నేతలు సవాల్‌ విసిరారు. వారి ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము… ధైర్యం లేక దాకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక మెయిన్‌ రోడ్డులోని హొటల్‌ జగదీశ్వరిలో రైతు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ తిరుపతిరెడ్డి అధ్యక్షతన జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి,గుడా ప్రధమ ఛైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,  శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణు, సీపీఐ కార్యదర్శి నల్లా రామారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌, బార్‌ కౌన్సిల్‌ రాష్ట్ర సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, క్రెడాయ్‌ ప్రతినిధి బుడ్డిగ శ్రీనివాస్‌, జనసేన పార్టీ నాయకులు వై శ్రీను, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు ఎన్వీ శ్రీనివాస్‌ మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు ఎటు పోతోందో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు చేస్తూ, ఇళ్లల్లోంచి ఎవరినీ బయటకు రానీయడం లేదన్నారు. ఒక వ్యక్తిపై కక్షకట్టిన ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశంగా ఆలోచనలు చేస్తున్న జగన్‌ కుట్రపూరిత ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. 13 జిల్లాల సమస్యను 29 గ్రామాల సమస్యగా చిత్రీకరించడం భావ్యం కాదన్నారు. రైతులు చనిపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జగన్‌ అధికార గర్వంతో నిర్ణయాలు తీసుకుంటూ… రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తూ… బ్రిటీష్‌ వారి విధానంలో విభజించి పాలించు తరహాలో పాలన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాంతీయ విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌ తీరు పట్ల ప్రజల నుంచి వ్యతిరేక అధికమవుతోందన్నారు. జగన్‌ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తూ ప్రజలను  భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ డైరెక్షన్లో జగన్‌ నడుస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయవద్దని,  అజ్ఞానంతో వైస్సార్‌సిపి నాయకులు వ్యాఖ్యలు చేయవద్దని వారు కోరారు.  అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి, పాలనను కేంద్రీకరణ చేయాలని సలహా ఇచ్చారు. ఒక ప్రాంతంలో ఒక్కసారి హైకోర్టు, రాజధాని పెట్టిన తరువాత వేరే ప్రాంతానికి తరలించే హక్కు ఎవరికి ఉండదని… కానీ జగన్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలపై దూరాభారం మోపుతూ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని సూచించారు. ఈ సమావేశంలో నగర టిడిపి అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు, బీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాలిక శ్రీను,  మార్ని వాసుదేవరావు, గోలి రవి, మాజీ కార్పొరేటర్లు కురగంటి సతీష్‌, బెజవాడ రాజ్‌ కుమార్‌, ఇన్నమురి రాంబాబు, ఛాన్‌ భాషా, షేక్‌ సుభాన్‌, తాడోజు హరి, విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here