దేశం గతి మారాలంటే అన్ని వ్యవస్థల్లో సంస్కరణలు అవసరం 

0
218
వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ నాయకులు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 : దేశంలో వ్యవస్ధలన్నీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని, ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్లు, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ నాయకులు కె. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్‌, అమర్‌నాథ్‌ అన్నారు. ఈ ధోరణులు మారాలంటే పత్రికా రంగంతో సహ అన్ని వ్యవస్ధల్లో సంస్కరణలు రావాలని వారన్నారు. ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ ఆహ్వానం మేరకు ఈరోజు ప్రెస్‌క్లబ్‌కు విచ్చేసిన వారు మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ఇష్టాగోష్టి జరిపారు. వాచ్‌ డాగ్‌లా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని అన్ని వ్యవస్ధలను సరైన మార్గంలో నడుపవలసిన పత్రికా రంగంలో కూడా అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ప్రజా విశ్వాసాన్ని కోల్పొయే పరిస్థితి ఏర్పడిందని, ఇది మంచి పరిణామం కాదని వారన్నారు.  ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి పత్రికా రంగం ప్రధాన భూమిక వహించాలన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలో పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యేందుకు దోహదపడే విధంగా లేవని, ఈ పరిస్థితుల్లో పత్రికా రంగం తన వంతు భూమిక పోషించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందని, ఇది ప్రమాదకరమని అన్నారు. ఈ పరిస్థితుల్లో అంశాల ప్రాతిపదికన సెమినార్లు నిర్వహించి సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన సలహా, సూచనలను ఇవ్వాలని ఆయన అన్నారు. దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ పత్రికా వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రాజకీయ నాయకులు పత్రికా రంగాన్ని శాసించే పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పాత్రికేయుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు నెలకొల్పిన ప్రెస్‌ అకాడమీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నామామాత్రంగా మిగిలాయని, పాత్రికేయులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ప్రెస్‌ అకాడమీ నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా రంగం పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం మరింత క్షీణించకుండా అటు యాజమాన్యాలు, ఇటు పాత్రికేయులు సమిష్టి కృషి చేయాలని ఆయన అన్నారు.పాత్రికేయ సంఘాలు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తే భాగస్వామ్యమయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.  ప్రెస్‌క్లబ్‌ పూర్వాధ్యక్షులు విఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌, జీఏ భూషణ్‌బాబు, ఏపీయూడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు మండెల శ్రీరామ్మూర్తి, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కుడుపూడి పార్ధసారథి, కార్యదర్శి జెవివి గణపతి తదితరులు ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here