దేశాన్ని పులిమీద ఎక్కించి వదిలేలిన మోదీ (శనివారం – నవీనమ్)

0
390

దేశాన్ని పులిమీద ఎక్కించి వదిలేలిన మోదీ
(శనివారం – నవీనమ్)

1965-67, 1973-74 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం అతిగా పెరగడం వల్ల భారతదేశమంతటా ప్రజా జీవితం దుర్భరంగా మారింది. వ్యవసాయోత్పత్తి పతనం, కరవు, చమురు ధరల షాక్‌ తదితర కారణాలతో ఆ పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాలని అనలేం. పరిస్థితిని ముందే అంచనా వేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించవచ్చు.

ఇప్పటి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమైంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రతికూలత ప్రభావం కన్నా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పులిమీద స్వారీగా మారిపోయింది. జనజీవనాన్ని సంక్షోభంలోకి నెట్టేసే ప్రయాణం సాగుతోంది.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇంతగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనడం స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఎన్నడూ లేదు. మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో చేసిన ప్రయోగాలు భారీ నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా 2016 నవంబరులో చేపట్టిన పెద్దనోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)ను ప్రవేశపెట్టడం చిన్న ఉత్పత్తి రంగాన్ని చావుదెబ్బతీస్తోంది.

జీఎస్టీ అమలు తర్వాత ప్రత్యక్ష పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 50 శాతం పెరిగిందని ఆర్ధిక సర్వే వెల్లడిస్తోంది. జీఎస్టీ వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి సరకులు, సేవల ఖర్చు పెరిగింది. స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి చెందిన గణాంకాలు ఉదహరిస్తూ ప్రజలపై ఈ విచ్ఛిన్నకర చర్యల ప్రభావాన్ని తక్కువ చేసి చూపే ధోరణిని ప్రభుత్వం ప్రదర్శిస్తోంది.

స్థూల జాతీయోత్పత్తి అంచనాలు దుర్భలంగా ఉన్నాయని అదే ఆర్థిక సర్వే ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక వ్యవస్థలోని ఒక రంగం స్థూల జాతీయోత్పత్తిలో సాపేక్షంగా తక్కువ వాటా ఉన్నప్పటికీ జనాభాలో అత్యధిక శాతానికి ఏదోవిధమైన ఉపాధి / సంపాదన అవకాశాలు కల్పిస్తున్నప్పుడు.. స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటులో వచ్చే చిన్న మార్పులే విస్తృత ప్రజానీకం జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్థూల జాతీయోత్పత్తిలో చిన్న మార్పునకు కారణమైన చర్యలతో పెద్దగా ఇబ్బంది ఉండదనే ప్రభుత్వ వాదనలో అర్ధంలేదు.

వ్యవసాయరంగం, చిన్న ఉత్పత్తి రంగం.. రెండు కూడా ప్రభుత్వ చర్యల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవి జనాభాలో అత్యధిక శాతానికి ఉపాధి కల్పించడానికి కారణమవు తున్నాయి. వీటి పనితీరు కుంటుపడితే ద్రవ్యోల్బణం, రైతుల్లో నిరాశ, అశాంతి, నిరుద్యోగం పెరుగుతాయి. రాజకీయ, సామాజిక అనాసక్తత పెచ్చుమీరుతుంది. వీటిలోనూ చిన్న ఉత్పత్తిరంగాన్ని జీఎస్టీ కుళ్లబొడిచింది. జీఎస్టీ ‘పన్ను తటస్ధత’ ను లక్ష్యంగా పెట్టుకుంది. అంటే గతంలో సేకరించిన స్థాయిలోనే పన్నులు సేకరించడం. చిన్న ఉత్పత్తి రంగంపై విధిస్తున్న సగటు పన్నురేటు పెరగడం అంటే పెద్ద పెట్టు బడుల రంగంపై విధిస్తున్న సగటు పన్నురేటు తగ్గించడంగా ఉంటుంది.

కాబట్టి పన్ను తటస్ధత ఉన్నా.. జీఎస్టీ అనేది పన్ను భారాన్ని పెద్ద పెట్టుబడులుండే రంగం నుంచి చిన్న ఉత్పత్తి రంగానికి పున:పంపిణీ చేసేదిగా ఉంటుంది. జీఎస్టీ తర్వాత పన్ను సేకరణ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో చిన్న ఉత్పత్తి రంగానికి పన్నురేట్లు తగ్గించడం ద్వారా ఉపశమనం అందించే అవకాశం లేదు. కాబట్టి చిన్న ఉత్పత్తిరంగంపై జరుగుతున్న జిఎస్టి దాడి అధికారులు చెబుతున్నట్టు తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది.

చిన్న ఉత్పత్తిరంగంలో వర్కింగ్‌ క్యాపిటల్‌ వ్యయం పెరుగుతున్నది. ఇది మౌలిక నిర్మాణంలో జరుగుతున్న మార్పు. ఇలా దేశచరిత్రలోనే 2017 కష్టజీవులపైన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రత్యక్ష దాడి చేయడమే. ఇది 2018లో జీవన వ్యయం పెరగడానికి దారితీస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. వాటి గిరాకీ దేశీయంగానూ పెరగడం వల్ల జీవన వ్యయం మరింత భారం కానుంది. చమురు ధరలు తగ్గుతున్నప్పుడే పరిస్థితి మెరుగుకానప్పుడు అవి పెరుగుతున్నప్పుడు ఎలా మెరుగవుతుంది?

ఇరాన్‌పై ఆంక్షలు విధించాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. అదే జరిగితే చమురు ధరలు పెరుగుతాయి. దీనితో ద్రవ్యోల్బణం, విదేశీ మారకద్రవ్యపు చెల్లింపుల శేషం, భారత ఆర్థిక వ్యవస్థ వద్ధి రేటు తదితర అంశాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. మరోవైపు ఎగుమతుల వృద్ధిరేటు పెరిగే అవకాశం కనిపించడం లేదు. అమెరికా మరింతగా రక్షిత విధానాలను అవలంబించటం మూలంగా సాఫ్ట్‌వేర్‌ ఔట్‌సోర్సింగ్‌ మీద ప్రతికూల ప్రభావం పడి భారతదేశ సేవారంగ ఎగుమతులు దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మెరుగవుతున్నదని చెబుతున్నప్పటికీ ఐటీ సంబంధిత సేవలలో ఉపాధి ఇప్పటికే క్షీణిస్తున్నది.

భారత ఆర్థిక వ్యవస్థపై ఏర్పడిన ఒత్తిళ్లకు ఇది సూచికగా ఉన్నది. రాబోయే నెలల్లో ఈ ఒత్తిళ్లు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం పనితీరు కూడా కనా కష్టంగా ఉంది. నోట్లరద్దు తర్వాత మన పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 75శాతం కంటే తక్కువ వినియోగించుకుంటు న్నాయి. స్టాక్‌మార్కెట్‌ బుడగ పతనమైతే విదేశీ ద్రవ్య పెట్టుబడులు దేశాన్ని వదలిపోతాయి. ఈ క్రమం ఇప్పటికే మొదలైంది. ఇది వేగవంతమైతే, ఆర్థిక మాంద్యం నెలకొంటుంది. ఈ బుడగ పతనం కాకపోయినా అమెరికాలో వడ్డీ రేట్లు పెంచినా పెట్టుబడులు భారత్‌నుంచి ఆ దేశానికి తరలిపోతాయి. ఫెడరల్‌ రిజర్వ్‌బోర్డు చైర్మన్‌ జెరోమి పోవెల్‌ వడ్డీరేట్లు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. ఆమేరకు రిపబ్లికన్లు కూడా డిమాండు చేస్తున్నారు.

2007లో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) లో స్థూల స్థిర పెట్టుబడి రూపొందడం 35.6శాతం దాకా చోటు చేసుకుంది. ఇది 2017లో 26.4 శాతానికి దిగిపోయింది. అలాగే జీడీపీలో దేశీయ పొదుపుల నిష్పత్తి కూడా 38.3 శాతం నుంచి 29.0శాతానికి పడిపోయింది. భారతదేశ చరిత్రలో ఇటువంటి పెట్టుబడి ఆటుపోట్లు ఎన్నడూ సంభవించలేదు. పెట్టుబడులు, ఆదా రేట్లు రెండూ పడిపోవడం అనూహ్యమైన విపరిణామం. 1991లో ‘బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌’ సంక్షోభం తరుణంలో కూడా అలా జరగలేదు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేయటానికి కావాల్సిన నూతన మార్గాలను అన్వేషించడంలో మోడీ సర్కారు నిజాయితీ ప్రదర్శించ లేదు.

‘రక్షిత విధానం టెర్రరిజం అంత ప్రమాదకారి’ అని దావోస్‌లో భారత ప్రధాని ప్రకటించారు. భారతదేశంలోని ఉత్పత్తిని, విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల శేషాన్ని రక్షించుకోవటం, దుందుడుకుగా అయ్యే దిగుమతులను అడ్డగించటం వంటి విషయాలపై ప్రభుత్వానికి సరియైన వ్యూహం లేదని దీనితో తేటతెల్లమౌతున్నది. ఆర్థిక వ్యవస్థకు తక్షణం ఎదురవుతున్న లేదా కొనసాగుతున్న ప్రమాదాలను ఎదుర్కొన డానికి చైనా మాదిరిగా భారత్‌ వద్ద ఎటువంటి నిర్దిష్ట వ్యూహాలు లేవని స్పష్టమవుతోంది.

ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం నేపథ్యంలో అంతకుముందువలే కాకుండా దేశీయ మార్కెట్‌ను విస్తరించుకోవలసిన అవసరాన్ని, ఎగుమతుల మార్కెట్‌పై అతిగా ఆధారపడవలసిన అవసరాన్ని చైనా గుర్తించినది. అందుకే అక్కడి ప్రజలు చైనా ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షోభం తర్వాత ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి బలమైన పరపతి వాతావరణాన్ని అందించటమే కాకుండా చైనా ప్రభుత్వం కార్మికుల వేతనాలను కూడా బాగా పెంచింది. అలా వేతనాలను పెంచటంతో కొనుగోలు శక్తులు పెరిగి, ఎగుమతులకు పోటీనిచ్చే శక్తి సన్నగిల్లినప్పటికీ సొంత మార్కెట్‌ విస్తతమైంది. చైనా తన ఎగుమతులపై ఆధారపడుతుందా లేక దేశీయ మార్కెట్‌ను విస్తత పరచటంపై తన దష్టిని కేంద్రీకరిస్తుందా అనే విషయం ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు.

ఏ విధంగా చూసినా.. భారత భవిష్యత్తు ఆర్థిక దృశ్యం ఆందోళనకరంగా ఉందనీ, అందుకు మోడీ సర్కారు తగిన మూల్యం చెల్లించుకోబోతున్నదని తేటతెల్లమవుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here