ద్వారంపూడిని తక్షణమే అరెస్ట్‌ చేయాలి 

0
79
జేఏసీ నాయకుల డిమాండ్‌ (13-3)
రాజమహేంద్రవరం, జనవరి 13 : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లను దుర్భాషలాడిన కాకినాడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని రాజమహేంద్రవరం ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నాయకులు డిమాండ్‌ చేసారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై జేఏసీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, జనసేన రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ, జేఏసీ చైర్మన్‌ కందుల లక్ష్మీ దుర్గేష్‌ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, సిపిఐ నాయకుడు నల్లా రామారావు,కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్‌, ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌, క్రెడాయ్‌ రాష్ట్ర ప్రతినిధి బుడ్డిగ శ్రీనివాస్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. అధికార పార్టీ మద్ధతు, డబ్బుందనే అహంకారం, పోలీసుల సహకారంతోనే ద్వారంపూడి ఇలా మాట్లాడారని స్పష్టమవుతోందన్నారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళలపై ఆయన వెంట ఉన్న ప్రైవేటు గుండాలు దాడిచేసి గాయపరచడం దారుణమని వ్యాఖ్యానించారు. ద్వారంపూడి అనుచరులు జనసేన కార్యకర్తలపై దాడి చేస్తే తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. బూతుల పంచాంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద ప్రొఫెసర్‌గా మారి స్కూల్‌ నడుపుతున్నట్టుగా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కనీసం ఆయన వాడిన పదజాలాన్ని చూసిన తరువాత కూడా ఇది తప్పని, పార్టీకి చెడ్డపేరు వస్తుందని సర్దిచెప్పే నాయకులు కూడా ఆ పార్టీలో లేకపోవడం మరింత దుర్మార్గమన్నారు. ద్వారంపూడి తాను చేసిన తప్పుని సరిచేసుకోకుండా మళ్లీ అలాగే మాట్లాడతానని సమర్ధించుకోవడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సర్వనాశనం చేస్తూ జగన్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రులకు ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతే కావాలని జేఏసీగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేసారు. పోలీసు వ్యవస్థ మరింత భ్రష్టుపట్టి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారిందని ఆరోపించారు. వారిపై ప్రైవేటు కేసులు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఇలా ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడటం సరికాదన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని, అటువంటి వ్యక్తుల్ని శాసనసభలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేసారు. ప్రజల హక్కుల్ని హరించే ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జేఏసీ నాయకుల్ని నిరుద్యోగులని వ్యాఖ్యానిస్తున్న వైసిపి నాయకులు అసలైన నిరుద్యోగులు తామేనని గ్రహించాలన్నారు. ద్వారంపూడి తక్షణం ప్రజలు, ప్రజా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here