ధిక్కారమున్‌సైతుమా !

0
139
మనస్సాక్షి
వెంకటేశం ఓ పట్టాన ఎవరికీ అర్థం కాడు. అప్పటి వరకూ అందరికీ ‘ మా వెంకన్న’ అన్నట్టే ఉంటాడు. అయితే ఏదయినా పట్టుదల వస్తే మాత్రం యింకెవరినీ లెక్కచేయడు. ఎంతవరకయినా వెళ్ళిపోతాడు. వెంకటేశంలో ఈ బాపతు విన్యాసాలు అప్పుడప్పుడూ కనపడుతుంటాయి. ఆ రోజు కూడా వెంకటేశం అలాంటి విన్యాసం ఒకటి చేశాడు. వెంకటేశం యింట్లో వాళ్ళంతా ఓ నెల రోజుల పాటు తీర్థయాత్రలకని బయలేర్ధారు. దాంతో యింటి కాపాలాకి వెంకటేశం గంగలకుర్రులో ఆ యింటిలో ఉండాల్సి వచ్చింది. యింట్లో ఒంటరిగా ఉన్న  వెంకటేశం తోచుబడికేం తక్కువ లేదు. ఫ్రెండ్సదీ వచ్చి పోతున్నారు. అయితే యింకో తలనొప్పకటి వచ్చి పడింది. అది…. యింట్లో ఎడాపెడా తిరిగేస్తున్న ఎలుకల రూపంలో..!
ఊరేళ్ళేటప్పుడు  తినుబండారాలవీ తయారు చేసి అవుట్‌హౌస్‌లో పెట్టేసి వెళ్ళిపోయారు. యింకా యితరత్రా తిండి పదార్ధాలవీ అక్కడే ఉన్నాయి. ఆ ఎలుకల బెడదేదో  అక్కడే ఎక్కువగా  ఉంది. అక్కడికీ ఓ రోజు  అక్కడుంచిన, వెంకటేశానికి  యిష్టమయిన సున్నుండుల డబ్బాని పడగొట్టేసి సగం సగం తినేశాయి కూడా. దాంతో వెంకటేశానికి వాటి మీద పీకల్దాకా కోపం వచ్చింది. ఎలాగయినా వాటి సంగతి తేల్చాలనుకున్నాడు. అక్కడికీ బోను పెట్టడం, మందు పెట్టడం లాంటివి చేశాడు గానీ  అవేవీ కుదిరి చావలేదు. ఆ ఎలుకలేవో  శుభ్రంగా ఆ బోను చుట్టూ రౌండ్లు కొట్టి పారిపోతున్నాయి. ఆ మందు  జోలికయితే వెళ్ళడమే లేదు. యింకో పక్క రోజురోజుకీ వాటి ఆగడాలేవో మితిమీరుతున్నాయి. దాంతో వెంకటేశం కోపం, పట్టుదల యింకా ఎక్కువయిపోయాయి. ఆ రోజయితే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. యింట్లో పనిచేసే  రామయ్యని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. దాంతో రామయ్య అదిరిపోయి ” అమ్మో అలా చేయడమే..! అలాగయితే పెద్దయ్య గారు కోప్పడతారేమో..” అన్నాడు. దాంతో వెంకటేశం  ” అదంతా నేను చూసుకుంటాలే. నువ్వు చెప్పినట్లు చెయ్‌” అన్నాడు. దాంతో ఆ రోజు రాత్రే అవుట్‌హౌస్‌ తలుపులన్నీ వేసేసి అంటించెయ్యడం జరిగింది.
యింకేముంది….క్షణాల్లో అవుట్‌హౌస్‌ కాలి బూడిదైపోయింది. ఆ కాలిపోయిన వాటిలో  మిగతా వాటితో పాటు ఓ అరడజను దాకా కాలిపోయిన  ఎలుక శవాలు కూడా బయటపడ్డాయి. రామయ్య కాలిపోయిన అవుట్‌హౌస్‌ వంక దిగాలుగా చూస్తూ  ” నష్టం ఎంతుంటుంది బాబయ్యా?” అన్నాడు. వెంకటేశం తేలిగ్గా అయిదు నుంచి పది లక్షల దాకా ఉండొచ్చు. అయితేనేం.. ఆ ఎలుకలు కూడా చచ్చాయిగా” అన్నాడు. తర్వాత యింకో వారానికి వెంకటేశం బాపతు జనాలంతా తిరిగొచ్చేశారు. అప్పుడు జరిగిందంతా వాళ్ళకి తెలిసింది. దాంతో వెంకటేశం బామ్మ ” ఒరేయ్‌ తిక్క సచ్చినోడా.. నీకూ మీ తాతగారి తెలివితేటలే వచ్చాయిరా. ఆయనా అంతే.. ఉండుండి యిలాంటి పనులు చేసేవాడు” అంటూ లబలబలాడింది. యిక అక్కడ్నుంచి వెంకటేశానికి రోజూ యింట్లో యిలాంటి సణుగుడే. యింతలో వెంకటేశం అదృష్టం బాగుండి ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న ఉద్యోగంలో చేరమని లెటరొచ్చింది. యింతకీ ఆ ఉద్యోగం కూడా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో.దాంతో వెంకటేశం వెంటనే వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరిపోయాడు.
——–
బీఎస్‌ఎఫ్‌లో ఓ టీమ్‌కి కమాండర్‌గా వెంకటేశం కొత్త జీవితం ప్రారంభమయింది వెంకటేశం పనల్లా తన టీమ్‌తో బోర్డర్‌లో ఉన్న ఊళ్ళలో పరిరక్షణ. ఆరోజు వెంకటేశం డ్యూటీలో ఉండగా ఓ వార్తొచ్చింది. అది..అక్కడికి సమీపంలో ఉన్న ఊళ్ళోని స్కూల్‌లో  కొంతమంది పాకిస్థాన్‌ తీవ్రవాదులు దాక్కున్నట్లు  తెలిసింది.అసలే స్కూలుకి శెలవులు కావడంతో స్కూల్లో దూరి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే విషయం బయటపెడితే తమని చంపేస్తారేమోనని ఊరివాళ్ళు గానీ,స్కూలు వాళ్ళు గానీ వాళ& గురించి బయటపెట్టడం లేదు. మొత్తానికి యిదేదో వెంకటేశానికి తెలిసింది. దాంతో ఆ రోజు రాత్రే వెంకటేశం తన టీంతో ఆ స్కూలు మీద దాడికి బయలుదేరాడు. అసలే ఈ ఉద్యోగంలో చేరింతర్వాత రోజూ పాకిస్దాన్‌ వాళ్ళ దురాగతాలు  వింటుండడంతో వాళ్ళంటే వెంకటేశానికి యింకా కసి పెరిగిపోయింది.
వెంకటేశం తన టీంతో ఆ స్కూలు సమీపానికి వచ్చాడు. ముందుగా టీంలో ఓ పదిమందిని స్కూల్‌ లోపలికి పంపించాడు.యింకో పది మందితో తను బయటే ఉన్నాడు. యింకో అరగంట తర్వాత  లోపలకెళ్లిన వాళ్ళలో రంజిత్‌ ఫోన్‌ చేశాడు. ”సార్‌..లోపలున్నది మొత్తం 60 మంది పాకిస్థాన్‌ తీవ్రవాదులు. మేమంతా లోపలికయితే వచ్చేశాంగానీ బయటికి వచ్చే దారి కనపడ్డం లేదు. వాళ్ళు మమ్మల్ని పసిగడితే చంపేయెచ్చు. లేదా పారిపోవచ్చు.అలాగని మేం ఎదురెళ్ళి ఎటాక్‌ చేయడమూ కష్టమే” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. యిప్పుడు తను ఫోన్‌ చేసి సుపేరియర్స్‌కి విషయం చెప్పి మరికొంత ఫోర్స్‌ని తెప్పించుకునే లోపు లోపలున్న వాళ్ళు పారిపోవచ్చు. ఏం చేయాలా అని  ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేశాడు. దాంతో మిగతా టీం వంక తిరిగి ” పెట్రోల్‌ బాంబులతో స్కూలు మొత్తాన్ని పేల్చి పారెయ్యండి” అన్నాడు. దాంతో అంతా షాకయ్యారు. యింతలో వారిలో ఒకరు ” సార్‌.. అలాగయితే వాళ్ళతో పాటు  మనోళ్ళు  పది మంది కూడా పోతారుగా” అన్నాడు. దాంతో వెంకటేశం ” తెలుసు అయినా ఫర్వాలేదు. మనోళ్ళు పది మంది పోతే పోనియ్యండి వాళ్ళు 60 మంది పోతున్నారుగా” అన్నాడు. దాంతో యింకెవరూ ఏం మాట్లాడలేదు. తర్వాత ఆ ప్లానేదో అక్షరాలా అమలు జరపబడింది.
——–
మధ్యలో రెండు నెలలు శెలవులు రావడంతో వెంకటేశం బోర్డర్‌ నుంచి రాజమండ్రీ వచ్చాడు. వచ్చీ రాగానే  తిన్నగా గిరీశం గారింటికి వెళ్ళాడు. ఆ పాటికి గిరీశం యింట్లో లేడు. బాబీగాడు ఆడుకుంటున్నాడు. వెంకటేశాన్ని చూడగానే ” ఏంటి బాబాయ్‌.. ఈ మధ్య కనపట్టం లేదూ? అన్నాడు. దాంతో వెంకటేశం ” ఏం లేదురా.. ఉద్యోగంలో చేరాలే. ఆ మామయ్యేడీ ? అన్నాడు. దానికీ బాబీగాడు ” యిప్పుడే  బయటకెళ్ళారు.వచ్చేస్తారు” అన్నాడు. దాంతో వెంకటేశం అక్కడే కుర్చీలో సెటిలై పేపర్లు తిరగేయడం మొదలెట్టాడు. యింతలో ఓ విశేషం జరిగింది. ఎక్కడ్నుంచి వచ్చిందో ఓ ఈగొకటి గుయ్యిమని వెంకటేశం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. దాంతో వెంకటేశం దాన్ని అసహనంగా తోలేశాడు. అయితే ఆ ఈగ మళ్ళీ వెంకటేశం తలచుట్టూ తిరిగేస్తోంది. దాంతో మళ్ళీ మళ్ళీ  దానిని తోలసాగాడు. అలా తోలే ప్రయత్నంలో దాని మీదకి బలంగా చెయ్యి విసిరేసరికి ఆ ఈగకయితే ఏం కాలేదు కానీ తన చెంపమీదే కొట్టుకున్నాడు. యిదంతా చూస్తున్న బాబీగాడయితే నవ్వడం మొదలుపెట్టాడు. దాంతో ఆ ఈగ సంగతేదో తేల్చాలన్న పట్టుదల వెంకటేశంలో యింకా పెరిగిపోయింది. దాంతో బాబీగాడి వైపు తిరిగి” రేయ్‌ నీ పరీక్షల పేడ్‌ పట్టుకురారా” అన్నాడు. బాబీ గాడు పరిగెత్తుకెళ్ళి అదేదో తెచ్చిచ్చాడు. అప్పుడు వెంకటేశం వాడితో ”రేయ్‌.. నువ్వు ఈ పేడ్‌ పట్టుకుని రెడీగా ఉండి చెప్పగానే నా నెత్తి మీద గట్టిగా కొట్టు” అన్నాడు. బాబీ గాడూ తలూపాడు. యింతలో ఆ ఈగేదో అటూ యిటూ తిరుగుతూ  వెంకటేశం నెత్తి మీద వాలింది. దాంతో వెంకటేశం సైగ చేయడం, బాబీగాడు బలంగా నెత్తిమీద బాదడం జరిగిపోయాయి. దాంతో ఆ ఈగేదో మరణించడం, వెంకటేశం నెత్తిమీద పెద్ద బొడిపే రావడం జరిగాయి. అయినా ఈగ చావడంతో వెంకటేశం తృప్తిగా నిట్టూర్చాడు.
——–
”అది గురూ గారూ…రాత్రి నా కొచ్చిన కల” అన్నాడు వెంకటేశం తల తడుముకుంటూ. దాంతో గిరీశం ” యిదేదో టీవీ సీరియలంత పెద్ద కల వచ్చినట్టుందే” అన్నాడు. వెంకటేశం నవ్వేసి ” యింతకీ ఈ కలకి అర్థం ఏంటంటారు”? అన్నాడు. దాంతో గిరీశం ” మరేంలేదోయ్‌…. యిదంతా జరుగుతున్న చరిత్రే. అమరావతి విషయమే తీసుకో అక్కడ అప్పుడెప్పుడో  యిన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగుండొచ్చు. జరిగితే అదెలాగా సీబీఐ విచారణలో  బయటపడుతుంది. ఈలోగా ప్రభుత్వం పాత పాలకుల్ని టార్గెట్‌ చేసి మూడు రాజధానుల్ని ప్రతిపాదించడం, అందుకు అడ్డొచ్చిన శాసనమండలిని రద్దు చేయాలనుకోవడం జరిగింది. అందులో తమ ఎమ్మెల్సీలూ పదవులు కొల్పోతున్నారాయె! యిక చివరగా.. ఏ ప్రభుత్వమయినా గుర్తు పెట్టుకోవలసింది.. ప్రత్యర్థి పార్టీల్నీ దెబ్బతీయడానికి పట్టుదలలకి పోతే   అది వ్యవస్థకీ, పార్టీకీ,  ఎంతవరకు నష్టమో కూడా ఆలోచించాలి.
డా. కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here