నగదు రహితంతోనే నేరాల్లేని సమాజం సాధ్యం

0
456
ప్రజల్లో అవగాహనకై ర్యాలీ, మానవహారం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : నగదు రహిత పాలనతోనే నేరాల్లేని సమాజం సాధ్యమవుతుందని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. నగదు రహిత పాలనపై విద్యార్ధులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు భారీ ర్యాలీ, మానవహారం కార్యక్రమాలను చేపట్టారు. పుష్కరఘాట్‌ నుంచి గోకవరం బస్టాండ్‌ మీదుగా దేవీచౌక్‌ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ  ఇకపై లావాదేవీలన్నీ క్రెడిట్‌, డెబిట్‌, రూపే కార్డుపైనే జరుగుతాయన్నారు. నగదు రహిత లావాదేవీల వల్ల బృహత్తరమైన ప్రయోజనాలు ఉన్నాయని, చాలా వరకు దారిదోపిడీలు,  ఇళ్ళ దొంగతనాలు తగ్గుతాయని అన్నారు. చాలా మందికి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయని, లేనివారు కొత్తగా ఎకౌంట్లు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి, తిరుమల, విజయదుర్గా, మాతృశ్రీ, ప్రగతి, కందుకూరి రాజ్యలక్ష్మీమహిళా కళాశాల, ఆర్ట్సు కళాశాలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులు హాజరుకాగా డిఎస్పీలు కులశేఖర్‌, శ్రీకాంత్‌, శ్రీనివాసరావు, సిఐలు రామకోటేశ్వరరావు, రవీంద్ర, ఆంధ్రాబ్యాంక్‌ ఆర్యాపురం బ్రాంచి మేనేజర్‌ పివి రామకృష్ణ, మెయిన్‌బ్రాంచి  మేనేజర్‌ బి.ఆర్‌.కృష్ణమోహన్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ మేనేజర్లు ఆర్‌ శ్రీకాంత్‌, జాలాచారి, కార్పొరేటర్‌ మర్రి దుర్గా శ్రీనివాస్‌, యాంకర్‌ చోటు పాల్గొన్నారు.