నన్ను గెలిపిస్తే సమగ్రాభివృద్ధి చేస్తా

0
146
హెరిటేజ్‌ సిటీగా ప్రకటింపజేస్తా – భాజపా రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి బొమ్ముల దత్తు
రాజమహేంద్రవరం, మార్చి 30 : తనను రాజమండ్రి సిటీ  అసెంబ్లీ నుంచి గెలిపిస్తే నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి పరుస్తానని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్ముల దత్తు చెప్పారు.  క్వారీ ఏరియాలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఇళ్లనుంచి పార్టీలో ఉన్న తన సేవలను గుర్తించి పార్టీ టికెట్‌ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే ఒక విడత మొత్తం అన్ని వార్డుల్లో తిరిగానని, పార్లమెంట్‌ అభ్యర్థి సత్యగోపీనాద్‌దాస్‌తో కలిసి కొన్ని వార్డుల్లో తిరిగామని ఆయన చెప్పారు. ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోందని, తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు. చారిత్రిక ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం హెరిటేజ్‌ సిటీగా ప్రకటింపజేస్తానని ఆయన చెప్పారు. ఐదేళ్ల పాటు ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అభివృద్ధి, సంక్షేమ, రక్షణ రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని అందుకే నమో ఎగైన్‌ పేరిట మోడీని మరోసారి గెలిపించాలన్న నినాదంతో పార్టీ ముందుకు వెళ్తోందన్నారు. రాజమహేంద్రవరం జరిగిన ప్రతి అభివృద్ధిలో ప్రధాని మోడీ  సారధ్యంలో ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయన్నారు. అమృత్ పధకంలో పార్కుల అభివృద్ధి , వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి ఎన్నో పనులు జరిగాయని దత్తు చెప్పారు. అందరికీ ఇళ్ళు పధకంలో 8వేలఇళ్ళు మంజూరవ్వగా, 4600ఇళ్ళు  పూర్తిచేశారని, మిగిలినవి ఆయా దశల్లో ఉన్నాయని, మరో 16వేల ఇళ్ళు రావాల్సి ఉందని ఎన్నికల షెడ్యూల్‌ రావడం వలన ఆగాయని వివరించారు. తనను గెలిపిస్తే 24గంటల పాటు మంచి నీటి సరఫరా చేయిస్తానని, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని, గోదావరి ప్రక్షాళనకు కేంద్రం నుంచి నిధులు తెస్తానని, మురికినీరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలిసేలా డేడికేటెడ్‌ ఛానల్‌ నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. జల, వాయు కాలుష్యాలు లేకుండా చర్యలు తీసుకుంటానన్నారు. వినోదం కోసం ఓ ప్రాజెక్ట్‌ చేపడతామని చెప్పారు.  పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధార్వాడ రామకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి పొట్లూరి రామమోహనరావు, వీరా వీరాంజనేయులు, పైలా సుబ్బారావు, నాగరాజు, ప్రవీణ్‌, నందివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here