నవ్యాంధ్ర పుస్తక సంబరాలు

0
320
19 నుంచి 27 వరకు ఆర్ట్సు కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహణ
రాజమహేంద్రవరం, నవంబర్‌ 10 : విజ్ఞానాన్ని పెంపొందించాలని, భాషను, సంస్కృతిని ముందు తరాలకు అందించాలన్న సంకల్పంతో ఈ నెల 19 నుంచి 27 వరకు ఆర్ట్సు కళాశాల మైదానంలో ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, విజయవాడ బుక్‌ పెస్టివల్‌ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ భాష, సాంస్కృతిక శాఖ, నన్నయ్య విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నవ్యాంధ్ర పుస్తక సంబరాలను నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విజయవంతం చేయాలని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ సిఇఓ విష్ణువర్ధన్‌, నన్నయ విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు, ఎమ్మెస్కో విజయ్‌కుమార్‌, ప్రజాశక్తి ప్రతినిధి లక్ష్మయ్య, సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసన్నకుమారితో కలిసి ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు గోరంట్ల మాట్లాడారు. భారీ స్థాయిలో పుస్తక ప్రదర్శన నిర్వహించడం ఇదే ప్రథమమని, విజ్ఞానాన్ని పెంపొందించే ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, యువత చురుకుగా పాల్గొనాలని కోరారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా రక్తదాన శిబిరాలు, క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్వహణ, నిరుపేదల విద్యాభ్యాసం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, ట్రస్ట్‌ ద్వారా రూ. వేయి కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. నవ్యాంధ్ర పుస్తక సంబరాలు లాభాల కోసం కాదని, సమాజం కోసం చేస్తున్న కార్యక్రమమని అన్నారు. వచ్చే నెల 23, 24 తేదీలో ్ల భారీగా ఉద్యోగ మేళా కార్యక్రమం చేపడతామని, ఇందులో 40 ప్రముఖ సంస్ధలు పాల్గొంటాయన్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ సిఇఓ విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ నవ్యాంధ్ర పుస్తక సంబరాలను అనంతపురం, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, శ్రీకాకుళంలలో నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ నెల 19 నుంచి 27 వ తేదీ వరకు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు,  చిత్రలేఖనం, పాటల పోటీలు, పద్యాలు, శ్లోకాలు, స్పెల్‌ బీ వంటి పోటీలతో పాటు వ్యక్తిత్వ వికాశ ఉపన్యాసాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చర్చా గోష్ఠులు జరుగుతాయన్నారు.