నాకు మాత్రం ఏం కాదు !

0
546
మనస్సాక్షి  – 1105
రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు తెరిపి నిచ్చాయి.  దాంతో వెంకటేశం యింట్లోంచి బయటపడి, నెమ్మదిగా నడచుకుంటూ గిరీశం గారింటికి బయల్దేరాడు. వెళ్ళేసరికి  యింటి తలుపులు తెరిచే ఉన్నాయి. లోపల నుంచి మాటలేవో కొంచెం హడావిడిగానే వినిపిస్తున్నాయి. దాంతో వెంకటేశానికి ఆశ్చర్య మనిపించింది. దానిక్కారణం ఆ మాటలేవో గిరీశానివి కాదు. ఎవరివో. సాధారణంగా గిరీశం సీన్‌లో ఉంటే యింకెవరినీ నోరెత్తనివ్వడు. అంతా తన మాట వినాల్సిందే. మరీ గొంతె వరిదా అనుకుంటూ లోపలికి నడిచాడు. లోపలెవరో తెలిసీ తెలియనట్టున్న శాల్తీ ఒకటి తెగ మాట్లాడేస్తుంది. ”యిదిగో గిరీశంగారూ.. యింకా లస్యం చేయవద్దు. మీ మేనల్లుడికొకటీ, మేనకోడలికొకటీ చూసేద్దాం” అన్నాడు. గిరీశం తలూపి ”అలాగే.. చెబుతాలే” అన్నాడు. యింత లోనే ఆ శాల్తీ శలవుపుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆ శాల్తీ వెళ్ళగానే వెంకటేశం ”అంటే మొత్తానికి తిరిగి మీ తాతల తరానికి వెళ్ళి పోతున్నారన్నమాట. అయినా ఈ రోజుల్లోనూ బాల్య వివాహా లేంటంటారు?” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ”ఏడ్చినట్టే ఉంది. వచ్చింది పెళ్ళిళ్ళ బ్రోకరు కాదు. ఎల్‌ఐసి ఏజంటు, పాలసీలు కట్టమని వచ్చాడు” అన్నాడు. దాంతో వెంకటేశం నాలు క్కరచుకున్నాడు. యింతలో యింకో విశేషం జరిగింది. అలా బయటికిపోయిన ఎల్‌ఐసి శాల్తీ మళ్ళీ లోపలకొచ్చాడు. వెంకటేశం వంక తేరిపార చూస్తూ ”నువ్వు వెంకన్నవే కదూ.. అనుమానం వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాన్లే. నేనూ.. కుమార్‌ని” అన్నాడు. వెంకటేశానికి ఆ కుమార్‌ ఎవరో గుర్తొచ్చేశాడు. కొంతసేపు మాట లయ్యాక కుమార్‌ ”ఎల్‌ఐసిలో అయితే నా పని బ్రహ్మాం డంగా ఉంది. నువ్వు కూడా వస్తే ఈ ఫీల్డులో యింకా దున్నే యొచ్చు. నీకసలే బోల్డంతమంది పరిచయం కదా. అందరితో పొలోమని కట్టించేయొచ్చు. నీకు బోల్డంత కమీషన్‌ వచ్చిపడిపోతుంది” అన్నాడు ఊరిస్తూ. దాంతో వెంకటేశం చెవులు మెదిలాయి. సరే అన్నాడు.
———-
వెంకటేశం ఆరోజే ఓ ఉద్యోగంవాడయ్యాడు. ”అదే.. ఏజంటు కింద మారి జనాలచేత పాలసీలు కట్టించే పనిలో పడ్డాడు. ఆలో చిస్తుంటే బోల్డంతమంది తెలిసున్నవాళ్ళు గుర్తొస్తున్నారు. అయితే ముందెవరిని అడిగితే బాగుంటుందా అని ఆలోచించి అనసూయ పిన్ని గారింటికి బయల్దేరాడు. వెంకటేశం వెళ్ళేసరికి సుబ్బన్న బాబాయీ, అనసూయ పిన్నీ యింట్లోనే ఉన్నారు. వెంకటేశాన్ని చూడగానే యిద్దరూ ఎంతో అప్యాయంగా ఆహ్వానించారు. సుబ్బన్న అయితే ”ఏదో ఫంక్షన్లప్పుడు తప్ప ఎప్పుడూ రావు కదరా.. యిలా వొచ్చావంటే ఆశ్చర్యమే” అన్నాడు. ఈలోగా వెంకటేశం కుర్చీలో కూర్చుని ”చిన్న పనుండి వచ్చా.. బాబాయ్‌” అన్నాడు. యిద్దరూ అదేంటన్నట్టు ఆసక్తిగా చూశారు. అయితే వెంకటేశం వెంటనే విషయంలోకి రాలేదు. నెమ్మదిగా ”మనం ఎప్పుడు పోతామో ఎవరికయినా తెలుస్తుందా?” అన్నాడు. దాంతో సుబ్బన్న వేదాంత ధోరణిలో ”అదెలా తెలుస్తుందిరా.. అయినా అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే కదా..” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవు నవును. బాగా చెప్పావు బాబాయ్‌.. యిప్పుడు నీకు అరవై దాటాయి. ఎప్పుడేమవుతుందో తెలీదు. ఏ యాక్సిడెంటో జరిగితే, లేకపోతే ప్రాణాలు పోతే పిన్ని పరిస్థితి ఏంటంట.. అందుకే  శుభ్రంగా ఓ పాలసీ తీసేసుకుంటే ఆనక నీకేవయినా ఫర్వాలేదు. పిన్నికి ఎలాంటి యిబ్బందీ లేకుండా బోల్డంత డబ్బొస్తుంది” అన్నాడు. తను విషయాన్ని అరటిపండు వొలిచినంత ఈజీగా చెప్పేశానని వెంకటేశం అనుకున్నాడు. అయితే వాళ్ళు వెంకటేశం చెప్పిందాన్ని అంత ఈజీగా తీసుకోలేదు. ఒక్కసారిగా వాళ్ళ మొహాల్లో మార్పొచ్చింది. అనసూయ అయితే విసు రుగా లేచింది ‘నాకు వొంటింట్లో పనుంది’ అంటూ విసవిసా లోపలకెళ్ళిపోయింది. యింకో పక్క సుబ్బన్న కూడా మొహం కంద గడ్డలా చేసుకున్నాడు. అక్కడో అతిధి ఉన్నా డని కూడా చూడకుండా భుజం మీద కండువా వేసుకుని ”పొలంలో నారుమళ్ళు కట్టించాలి రా.. తర్వాత కలుద్దాం” అంటూ బయటికి నడిచాడు. దాంతో యింక చేసేదేం లేక వెంక టేశం కూడా బయటకొచ్చేశాడు.
———-
అదక్కడితో ఆగలేదు. ఎవరిని పాలసీ అడిగినా యిలాగ మొహాలు మాడ్చుకుంటున్నారు. దాంతో వెంకటేశం యింకా పనికి రాంరాం చెప్పేశాడు.
———
యింకోరోజు… వెంకటేశం పార్కులో ఉండగా ఆనంద్‌ వచ్చాడు. వస్తూనే గబగబా దగ్గరకొచ్చి ”నీ కోసమే వస్తున్నారా.. వచ్చే ఎలక్షన్లో పోటీ చేస్తానంటున్నావు కదా. అలా చేయాలంటే ముందు జనాల నోట్లో నానుతుండాలి. దానికోసమో మహత్తరమయిన ప్లాన్‌ ఆలోచించా” అన్నాడు. వెంకటేశం ఆసక్తిగా అదేంటన్నట్టు చూశాడు. యింతలో ఆనంద్‌ ”జనాలకోసం ఫ్రీ మెడికల్‌ క్యాంపు పెట్టు. యిక చూస్కో. అందరి నోట్లో నీపేరు నానుతుంది” అన్నాడు. అయితే వెంకటేశం  అనుమానంగా ”మనూళ్ళో నెలకో రెండు ఫ్రీ మెడికల్‌ క్యాంపులు జరుగుతాయి కదా. ఆ గుంపులోనే మనమూ కలిసిపోతాం కదా” అన్నాడు. ఆనంద్‌ తలూపి ”అయితే యింకో పని చేద్దాం. 40 ఏళ్ళు   దాటిన ఆడవాళ్ళందరికీ ఉచితంగా కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు  చేయించేద్దాం. కేన్సర్‌ లేదంటే తెగ ఆనందపడిపోతారు. ఒకవేళ ఉందంటే  వెంటనే వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకుం టారు. ఎలాగయినా అంతా నిన్ను దేవుడిలా చూస్తారు” అన్నాడు. యిదేదో వెంకటేశానికి మా బాగా నచ్చేసింది. ఓకే అనేశాడు.
———-
అనుకున్నరోజు రానే వచ్చింది. వెంకటేశం మెడికల్‌ క్యాంప్‌ కోసం  బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాడు. పట్నం నుంచి గైనకాలజిస్ట్‌, యింకా లేబ్‌ టెక్నీషియనూ, యింకా యితర ఎక్విప్‌మెంటూ దిగి పోయాయి. యిక ఊళ్ళో మధ్య వయసు ఆడజనాలు క్యూలో నిలబడి మరీ చూపించుకుంటారని వెంకటేశం లెక్కలేసు కున్నాడు. దాంతో ఉదయం తొమ్మిదింటికే  రాబోయే జనాల కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే తొమ్మిదే కాదు. పదీ.. పద కొండయినా ఒక్కళ్ళూ రాలేదాయె. యింకో గమ్మత్తయిన విషయ మేంటంటే.. ఎప్పుడూ ఆ వీధిలో తిరిగే ఆడవాళ్ళు కూడా ఈరోజు కనిపించడం లేదు..! దాంతో ఏం జరిగిందో అర్థంకాక వెంకటేశం ఈ వీధి చివరనున్న మీనాక్షమ్మ యింటికి వెళ్ళాడు. మీనాక్షమ్మ బయటికి పిలిచి ”ఏంటి పిన్నీ.. ఫ్రీ క్యాంప్‌కి రాలేదే.. యింకా మీ చెల్లెలు కూడా యింట్లో ఉన్నట్టుంది. వచ్చి టెస్ట్‌లు చేయించేసుకుంటే కేన్సరుందో లేదో తెలిసిపోతుందిగా” అన్నాడు. దాంతో మీనాక్షమ్మ కోపంగా చూసి ”యిదిగో వెంకన్నబాబూ.. ఆ దిక్కుమాలిన కేన్సర్‌ లవీ మా యింట్లో ఎవరికీ రావు గానీ మేం రాము” అంటూ వెంక టేశానికి యింకో మాట మాట్లాడే అవకాశం యివ్వకుండా తలుపేసు కుంది. దాంతో వెంకటేశం అదిరిపోయాడు. అక్కడ్నుంచి ఆ పక్కిం టికి వెళ్ళాడు. అక్కడా అదే పరిస్థితి. అంతేకాదు. యింకో గంట చూసి యింకెవరూ రారని నిర్ధారణ చేసుకున్నాక ఆ క్యాంపేదో ఎత్తేశారు.
——–
”అది గురూగారూ.. నాకొచ్చిన కల. ఈ జనాల తీరు బొత్తిగా అర్థ మయి చావడంలేదు” అన్నాడు వెంకటేశం బాధపడిపోతూ. గిరీశం తలూపి ”అసలిదంతా మానవ నైజమోయ్‌. తమకి చావు తప్పదని ఈ ప్రపంచంలో అందరికీ తెలిసిందే. అయితే అదేదో తమ పరంగానో, తమకొస్తుందనో అని ఆలోచించడానికి ఎవరూ యిష్ట పడరు. అలాగే కేన్సర్‌లాంటి విషయాల్ని తీసుకున్నా ‘అబ్బే.. అది నాకెందుకొస్తుందిలే’ అని దాని గురించి ఆలోచించడానికే చాలా మంది యిష్టపడరు. నీ కలలో వచ్చిందదేలే. సరే.. విషయాని కొద్దాం. అసలు నీకీ కలలు రావడానికో కారణముంది.. అన్నాడు. వెంకటేశం ఎందుకన్నట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పసాగాడు. ”మొన్నటికి మొన్న ఏం జరిగింది? డ్రైవింగ్‌లో అపార మయిన అనుభవమున్న హరికృష్ణ డ్రైవింగ్‌ చేస్తూనే దుర్మరణం పాలవడం జరిగింది. నాలుగేళ్ళనాడు తన  కుమారుడు రోడ్‌ యాక్సి డెంట్‌లో చనిపోయినప్పటి నుంచీ డ్రైవింగ్‌ చేసేటప్పుడు తీసు కోవలసిన జాగ్రత్తల గురించి… ముఖ్యంగా సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం గురంచీ, స్పీడ్‌ డ్రైవింగ్‌ వద్దనడం గురించీ, యింకా డ్రైవింగ్‌ చేసేటప్పుడు చూపించవలసిన ఏకాగ్రత గురించీ హరి కృష్ణ ఒక పెద్దన్నయ్య తరహాలో తరచుగా అందరికీ  చెపుతుం డడం గమనార్హం. అలాంటిది తన దగ్గరకే వచ్చేసరికి ‘ఆ..నాకేం కాదులే’ అన్న సగటు మానవ నైజానికి లోనయినట్టు కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యమే యివాళ తనని బలి తీసుకుంది. యింకా కోట్లాదిమందిలో ఆవేదనని మిగిల్చింది” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here